షాకింగ్..కూలిన సుంకిశాల రీటైనింగ్ వాల్ (వీడియో)

నల్గొండ జిల్లాలోని సుంకిశాల ప్రాజెక్టు రీటైనింగ్ వాల్ కుప్ప కూలిపోవటంతో రాజకీయంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పెద్దఎత్తున వివాదం రేగుతోంది.

Update: 2024-08-10 08:02 GMT

మేడిగడ్డ బ్యారేజీ గోల మరచిపోకముందే సుంకిశాల గోల మొదలైంది. నల్గొండ జిల్లాలోని సుంకిశాల ప్రాజెక్టు రీటైనింగ్ వాల్ కుప్ప కూలిపోవటంతో రాజకీయంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పెద్దఎత్తున వివాదం రేగుతోంది. రీటైనింగ్ వాల్ కూలిపోవటానికి కారణం మీరంటే కాదు మీరే అంటు రెండుపార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్ నుండి వచ్చేనీటితో నల్గొండ జిల్లాతో పాటు రాజధానికి మంచినీటిని అందించేందుకు కేసీయార్ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన రీటైనింగ్ వాల్ ఇపుడు కూలిపోయింది. దాంతో రెండువైపుల నుండి ఆరోపణలు, ప్రత్యారోపణల గోల పెరిగిపోతోంది.

కూలిన రీటైనింగ్ వాల్ ను చూసిన తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు బీఆర్ఎస్, కేసీయార్ పై ఆరోపణలు చేశారు. 2021లో కేసీఆర్ నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టు మొత్తం నాసిరకంగానే ఉందన్నారు. కేసీఆర్ డబ్బుల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టు నిర్మాణమంతా నాసిరకంగా తయారైందని ఇందులో భాగంగానే రీటైనింగ్ వాల్ కూలిపోయినట్లు చెప్పారు. రీటైనింగ్ వాల్ కూలిపోవటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరంతా సుంకిశాల ప్రాజెక్టులోకి వచ్చేసి మోటార్లు కూడా ముణిగిపోయాయని మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడిన కేసీయార్ నిర్మాణం మొత్తాన్ని నాసిరకంగా పూర్తిచేయించిన ఫలితంగానే ఇపుడు రీటైనింగ్ వాల్ కూలిపోవటం, మోటార్లు ముణిగిపోయినట్లు చెప్పారు.

కూలిపోయిన రీటైనింగ్ వాల్ ను నిర్మాణసంస్ధే డబ్బులు పెట్టి కట్టిస్తుంది కాబట్టి ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. నిర్మాణం ఇంకా పూర్తికాకుండానే రీటైనింగ్ వాల్ కూలిపోవటం అంటే కేసీఆర్ ఏ స్ధాయిలో డబ్బుకు కక్కుర్తిపడ్డారో అర్ధమవుతోందని మంత్రులు ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కూడా ఇలాంటి కక్కుర్తి వల్లే ప్రాజెక్టంతా దెబ్బతినేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్లకు కూడా పనికిరాదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్ఏ)తో పాటు ఇరిగేషన్, ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టంగా చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తుచేశారు. నీటినిల్వకు మేడిగడ్డ పనికిరాకపోవటంతో దీనిపై ఆధారపడిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిరుపయోగం అయిపోతోందన్నారు. ఎందుకంటే రెండు ప్రాజెక్టులను కేసీఆర్ నాసిరకంగానే నిర్మించినట్లు ఆరోపించారు. ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించటంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినట్లుగా మంత్రులు ఆరోపించారు.

ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు మంత్రులపై ఎదురుదాడిచేశారు. కేటీఆర్ ఏమంటారంటే సుంకిశాల ప్రాజెక్టు బాధ్యతంతా ప్రభుత్వానిదే అన్నారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ ఆగస్టు 2వ తేదీన కూలిపోతే ఇన్నిరోజులు ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు హడావుడిగా గేట్లు ఏర్పాటు చేయకపోవటంతోనే సమస్య వచ్చిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేతకానితనంతో వచ్చిన సమస్యను బీఆర్ఎస్ పై బురదచల్లటం ఏమిటని నిలదీశారు. తమ హయాంలో పక్కా ప్రణాళికలతో నిర్మించిన ప్రాజెక్టులో ఇపుడు సమస్య తలెత్తితే బాధ్యత ప్రభుత్వానిదే కాని బీఆర్ఎస్ ది ఎంతమాత్రం కాదని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు.

పోయిన ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయటపడిన మేడిగడ్డ సమస్యే ఇంకా చల్లారలేదు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి, శ్లాబుకు పగుళ్ళొచ్చేసి ప్రాజెక్టు మొత్తం గబ్బుపట్టిపోయింది. దాని తాలూకు ప్రకంపనలు తెలంగాణాలో ఇంకా చల్లారలేదు. మంత్రులు, కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తదితరులను తప్పుపడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోని డొల్లతనంపై ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ తో విచారణ చేయిస్తోంది. ఇంతలో సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిపోవటం, మోటార్లు ముణిగిపోవటంతో ప్రభుత్వానికి భారీగా నష్టమొచ్చింది. దాంతో ఇటు మంత్రులు, అటు కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ నేతలు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరీ గోల ఎంతదాకా వెళుతుందో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News