శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెన్షన్...
హిందూయేతర యాత్రికులు ఆలయంలోకి ప్రవేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఎస్ఓ;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-19 07:47 GMT
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రత డొల్లతనం బయటపడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆలయ ముఖ్య భద్రతాధికారి (chief security officer) అయ్యన్నను సస్పెండ్ చేశారు. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (executive officer) ఎస్ శ్రీనివాసరావు ఆ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు భారీగా వస్తుంటారు. చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీశైలంలో కూడా తిరుమల తరహాలోనే అనేక దర్శించ తగిన ప్రదేశాలు ఉన్నాయి.
తిరుమల తరహాలో యాత్రికుల రద్దీ నియంత్రణ, స్వచ్ఛంద సేవకుల వ్యవస్థను పటిష్టం చేశారు. ఆర్జిత సేవా కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో శ్రీశైలం ఆలయం, ఉప ఆలయాల వద్ద భద్రత కోసం శాశ్వత రక్షణ సిబ్బంది, కాంట్రాక్టు ప్రాతిపడికన పనిచేసే ఉద్యోగులులను శ్రీశైలం దేవస్థానం నియమించింది.
పది రోజుల కిందట
శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లన్నను దర్శించుకోవడానికి క్యూలో వచ్చే యాత్రికులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇందులో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, డొల్లతనం 10 రోజుల కిందట బయటపడింది. సాధారణంగా.ఇక్కడ 300 రూపాయల టికెట్ తోపాటు, వీఐపీలు, జనరల్ క్యూ కూడా నిర్వహిస్తున్నారు. రోజుకు అన్ని రకాల సేవలు, సర్వదర్శనం కోసం వేల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. వారాంతపు సెలవులు, ముఖ్యమైన రోజుల్లో ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. కాగా, వారితో కలిసిపోయిన కొందరు హిందూయేతర భక్తులు స్వామి దర్శనానికి క్యూలో వెళ్లారు. వారి వద్ద అన్యమత పుస్తకాలు ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రారంభంలోనే దీనిని గమనించలేదు. ఆ భక్తులు ఆలయ సమీపానికి వెళ్లిన తర్వాతే, ప్రధాన ద్వారం వద్ద ఉన్న సిబ్బంది గుర్తించారని తెలిసింది.
"క్యూలోకి ప్రవేశించే ముందే, యాత్రికులను తనిఖీ చేయడంతో పాటు, వారు తీసుకువెళ్లే బ్యాగులను కూడా నిష్టంగా స్కానింగ్ చేయాలి. ఇవేమీ పట్టనట్టుగా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించడం వల్లే ఇలా జరిగింది" అని అక్కడి సీనియర్ జర్నలిస్టుల ఒకరు చెప్పారు. అందువల్ల మిగతా యాత్రికులతో కలిపే హిందూయేతరులు కూడా నింపాదిగా క్యూలోకి ప్రవేశించారు. ఆలయం సమీపంలోకి వెళ్లేసరికి వారి చేతుల్లో ఉన్న ఇతర మత పుస్తకాలను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపించారు.
ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను సస్పెండ్ చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఆలయ భద్రతాపరమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిని ఉపేక్షించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.