సింహాచలం సన్నిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు మృతి
భర్త హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంటే, భార్య శైలజ ఇన్పోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నారు.;
By : The Federal
Update: 2025-04-30 05:58 GMT
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో గోడకూలిన దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం కూడా ఉన్నట్లు గుర్తించారు. దర్శనం కోసం వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజలు గోడ కూలిన దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. భర్త పిళ్ళా ఉమామహేశ్వరరావు హెచ్‌సీఎల్‌లో పని చేస్తుండగా, భార్య శైలజ ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. ఇది వరకు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్న ఉమామహేశ్వరరావు,శైలజలు ఇటీవల సొంతూరుకు వచ్చారు. ప్రస్తుతం నుంచే వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లో నుంచే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం రూ. 300 టోకెన్ క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ప్రమాద వశాత్తు గోడ కూలిన దుర్ఘటనలో దంపతులిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన వారి కుటుంబాలను కలిచివేసింది. అందరితో కలివిడిగా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఉమామహేశ్వరరావు, శైలజల దంపతులు ప్రమాదంలో మరణించడాన్ని వారి ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.