Chittoor Mango Story: తోతాపురి తోసేస్తే, టేబుల్ మామిడి నిలబెట్టింది

మామిడి గుజ్జు పరిశ్రమల ప్రయోగం ఫలిస్తే, రైతులకు ప్రతి ఏడాది పండుగే!;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-01 10:13 GMT
బేనీషా రకం మామిడి కాయలు

చిత్తూరు జిల్లాలో మామిడి తోటల రైతులను తోతాపురి రకం మామిడికాయల (totapuri mango) ధరలు ఏడిపించాయి. ఆ కన్నీటి ధారాను టేబుల్ రకాల మామిడి బేనీషా, నీలం, మల్లిగ, రుమాణి, మల్బూబ, వంటి రకాల ధరలు ఊరడిస్తున్నాయి. సీజన్ ముగింపునకు వస్తుండడంతో, ధరల సూచికలో మార్పులు కనిపిస్తున్నాయి.

జిల్లాలోని దామనచెరువు, బంగారుపాలెం ప్రైవేటు మార్కెట్ యాడ్లతో పాటు తిరుపతి, చిత్తూరు కేంద్రాల్లోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న మామిడి మార్కెట్లలో టేబుల్ రకాల మామిడి ధరలకు కాస్త రెక్కలు వచ్చాయి. ఇది రైతులకు కాస్త ఉపశమనం కలిగించేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే,
చిత్తూరు జిల్లాలో కొన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు రెండేళ్లుగా తోతాపురి తోపాటు టేబుల్ రకాల్లో బేనీషా, నీలం మామిడి కాయలు కూడా ప్రాసెసింగ్ ప్రయోగం చేస్తున్నాయి.

బంగారుపాళెం మార్కెట్ లో బేనీషా రకం మామిడికాయలు

"ఈ ప్రయోగం ఫలిస్తే రానున్న కాలంలో రైతులకు ధరల పంట పండుతుంది" అని చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల సంఘం అధ్యక్షుడు గోవర్ధనబాబీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కొన్ని రోజులు తప్పదు..
జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రైతుల పరిస్థితి దయనేయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకం మామిడికి రైతుకు కిలో మామిడికి ప్రకటించిన మద్దతు ధరలో ఇచ్చే నాలుగు రూపాయల ప్రోత్సాహక ధరకు పరిశ్రమల నుంచి 8 రూపాయల గిట్టుబాటు ధర లభించడం లేదు. ర్యాంపుల వద్ద ఉన్న వ్యాపారులు కేవలం రెండు నుంచి, రూ.2.50 మాత్రమే చెల్లిస్తున్నట్లు బాహాటంగా చర్చ జరుగుతుంది.
"ఈ ధరల వ్యత్యాసం మరో 15 రోజులపాటు తప్పదు" అని మామిడి గుజ్జు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
"ఈ ఏడాది మామిడి సీజన్ ముగింపునకు రావడమే దీనికి కారణం. టేబుల్ రకాలైన బెనిష, మల్గుబ, నీలం, మల్లిగా, ఆల్ఫోన్స్ తోపాటు ఇంకొన్ని రకాల మామిడికాయల ధరలు రిటైల్ మార్కెట్లో పెరిగాయి" ఇది కాస్త రైతులకు ఊరట అని అభిప్రాయపడుతున్నారు.
చిత్తూరు జిల్లా మామిడి దిగుబడిలో రెండవ స్థానంలో ఉంది. అందులో గుజ్జు తీయడానికి ఉపయోగపడే తోతాపురి రకం మామిడి తోటలు అత్యధికంగా సాగు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో సుమారు 1,40,000 ఎకరాల్లో (సుమారు 56,000 హెక్టార్లలో) మామిడి సాగు అవుతోంది. తోతాపురి రకం మామిడిని అధికంగా సుమారు 99,737 ఎకరాల్లో (39,895 హెక్టార్లలో) సాగు చేస్తున్నారు. ఇది మొత్తం మామిడి సాగులో 90% వరకు ఉంటుంది.
టేబుల్ రకం: మల్బూబా, నీలం, అల్ఫోన్సో, బెనిషా, మల్లిక, రుమాణి, నీలం వంటి ఇతర రకాలు.
2025లో మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలో 5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది" అని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధనరెడ్డి తెలిపారు. అయితే, కృష్ణా జిల్లా తరువాత చిత్తూరులో దిగుబడి 8 లక్షల టన్నులకు చేరువ అయిందని ఒక వ్యవసాయ నిపుణుడు అంచనా వేశారు.
ఉద్యానశాఖ అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం, 2025లో 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయ్యాయి. ఈ ఏడాది దిగుబడి పెరిగినప్పటికీ ధరలు తగ్గడం వల్ల రైతులకు కష్టాల కడగండ్లు తప్పలేదు.
1. గడచిన రెండేళ్లుగా గుజ్జు పరిశ్రమల వద్ద నిలువలు పేరుకుపోయాయి.
2. జిల్లాలోని గుర్తు పరిశ్రమలు కూడా అన్ని పనిచేయలేదు.
3. పనిచేసిన పరిశ్రమలు కూడా ఒక కన్వేయర్ బెల్ట్ మాత్రమే వాడారు.
4. దీనివల్ల గణనీయంగా వచ్చిన మామిడి దిగుబడిని పరిశ్రమలు కొనుగోలు చేయలేని పరిస్థితుల కారణంగా ధర పడిపోవడానికి కొన్ని కారణాలుగా ప్రస్తావించవచ్చు.
ఈ విషయం కాస్త పక్కకు ఉంచితే..
ఊరిస్తున్న టేబుల్ రకాలు
జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ(agriculture Market committee Amc) లను పక్కకు ఉంచుదాం. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి సమీపంలో ఉన్న దామలచెరువు, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రానికి సమూహంలో ఉన్న ప్రైవేటు మామిడి మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడికి సగటున రోజుకు 100 నుంచి 150 టన్నుల మామిడికాయలు వస్తున్నాయి. ఈ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు తో పాటు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు.
"దీనివల్ల టేబుల్ రకాల మామిడికాయల ధర బాగా ఉంది" అని బంగారుపాలెం వద్ద మామిడి రమణా చేసే శైలేష్ చెప్పారు.
"దీనివల్ల రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోవచ్చు. నష్టపోయిన పెట్టుబడిలో నాలుగు నుంచి ఆరు శాతం నష్టం భర్తీకి మాత్రమే అవకాశం కలిగింది" అనేది ప్రసాద్ విశ్లేషణ.
చంద్రగిరి నియోజకవర్గం పాకాల సమీపంలో ఉన్న దామలచెరువు మార్కెట్లో కూడా టేబుల్ రకాలకు కాస్త మెరుగైన ధర దక్కుతున్నట్లు చెబుతున్నారు.
పూతలపట్టు నియోజకవర్గం లో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో తోతాపూరి రకానికి చెందిన మామిడి తోటలో అత్యధికంగా ఉంటే మిగతావి టేబుల్ రకాల తోటలే ఎక్కువ. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా తవణంపల్లి వద్ద ఐదు మామిడి గుజ్జు పరిశ్రమలు, బంగారుపాలెం వద్ద రెండు పరిశ్రమలు ఉంటే అందులో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. శ్రీని ఫుడ్స్ గుజ్జు పరిశ్రమ తెరవలేదు.
"రెండేళ్లుగా ప్రాసెస్ చేసిన గుజ్జు ఇంకా నిలువ ఉండిపోయింది. ఇది మార్కెటింగ్ కాకుండా మళ్లీ కాయలు కొనుగోలు చేసి చేతులు కాల్చుకోలేము" అనేది ఆ పరిశ్రమ యజమానులు చెబుతున్న మాట.
బంగారుపాలెం వద్ద ఉన్న ప్రైవేట్ మార్కెట్ యార్డుకు వెయ్యి టన్నుల మామిడికాయల దిగుబడి వస్తోంది. అందులో తోతాపురి రకం మామిడికాయ కిలో కు రూ. రెండు నుంచి, రెండున్నర రూపాయలు కూడా ధర లభించలేదు.
"టేబుల్ రకాలకు ధర ఆశాజనకంగా ఉంది" అని సీనియర్ జర్నలిస్టు శివ కూడా చెప్పారు.
పొరుగు రాష్ట్రాలకు మామిడికాయలు రవాణా చేసే శైలేష్ కథనం మేరకు
బెనిషా కిలో రూ. 100 నుంచి 120 రూపాయలు, మల్లిగా రకం 55 నుంచి 75, మల్గూబ కిలో 150, షుగర్ బి రు 25 నుంచి 30, రుమాని 50 నుంచి 70 రూపాయలు, నాటి రకం కాయలకు 30 నుంచి 45 రూపాయల ధర లభిస్తున్నట్లు చెప్పారు.
"తోతాపురి రకం మామిడికాయలతో నష్టపోయిన రైతులకు టేబుల్ ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి" అని శైలేష్ ప్రస్తావించారు.
చంద్రగిరి నియోజకవర్గం పాకాల సమీపంలోని దామనచర్ల మార్కెట్లో కాస్త ఉపశమనం లభిస్తుంది.
"నేను నాలుగు ఎకరాల్లో మామిడి తోట సాగు చేశా. ఇంతటి దారుణమైన ధరలను ఊహించలేదు" కుక్క పల్లెకు చెందిన రైతు ప్రసాద్ వ్యాఖ్యానించారు. తోతాపురికి రూ. 1.50 నుంచి రెండు రూపాయలు కూడా దక్కలేదు అని చెబుతూ, వేదనకు గురయ్యారు.
ఇక్కడి ప్రైవేట్ మార్కెట్లో ధరలను ఆన్లైన్లో ఉంచుతున్నారు. ఆ సమయంలో మాత్రమే విక్రయానికి వీలు కలుగుతుంది. ఆ విధంగా కూడా బేనిషాకు కిలో ఆరు నుంచి ఏడు రూపాయలు కూడా దక్కలేదని ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది బినేషాకిలో 30 నుంచి 35 రూపాయలకు అమ్ముకున్నాం. ఆ ధరకు ఈ ఏడాదితో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ప్రసాద్ చెప్తున్నారు.
టేబుల్ రకాలైన మామిడి కాయలు మాత్రమే కాస్త ధర పలుకుతున్నాయి. సీజన్ ముగింపుకు రావడం వల్ల రానున్న 15 రోజులలో పెరిగే. ధరలపై రైతులు ఆశావాహంగా ఉన్నారు.
కనీసం అప్పుడైనా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు సగం వంతైన దక్కుతుందా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి మామిడికాయల మార్కెట్లో కూడా టేబుల్ రకాలకు మెరుగైన ధరలు లభిస్తున్నాయి.
"పొరుగు రాష్ట్రాల వ్యాపారులకి ఏడాది కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బెనీషా, మలుగుబ, నీలంతోపాటు అనేక రకాల మామిడికాయ ధర మెరుగ్గానే ఉంది" అని మండి వ్యాపారి వాహిద్ చెప్పారు. ఇక్కడి రిటైల్ మార్కెట్ లో బేనీషాకు గత నెల చివరి వరకు కిలో రూ.80 80 నుంచి రూ.120 వరకు దక్కుతోంది. మల్బూబ రూ.110 నుంచ 120, హిమాం పసంద్ రూ.150 నుంచి 200, అల్ఫోన్సా (ఖాదర్) కు రూ. 60 నుంచి 80, సింధూర లేదా పుల్లోరా కిలో రూ. 50 నుంచి 70, రుమాణి, రూ. 45 నుంచి 60 వరకు, నీలం రకం మామిడి కిలో రూ. 35 నుంచి 40 వరకు ఉంది. తిరుపతి మామిడి మార్కెట్ అధికారిక సైట్ లోనే ఈ వివరాలు ఉన్నాయి.
పరిశ్రమల ప్రయోగం ఫలిస్తే...
చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు 47 వరకు ఉంటే, ఈ సీజన్ ప్రారంభంలో 33 పరిశ్రమలు మాత్రమే తెరిచారు. గత రెండేళ్లలో మిగిలిపోయిన గుజ్జు వల్ల తెరిసిన పరిశ్రమలు కూడా సామర్ధ్యానికి తగినట్లు కొనుగోలు, ప్రాసెసింగ్ చేయడం లేదు. చిన్న పరిశ్రమలు ఒక కన్వేయర్ బెల్టు, భారీ పరిశ్రమలు ఒకటి లేదా రెండు బెల్టుల పైనే మామిడి గుజ్జు తయారీకి ప్రాసెస్ చేస్తున్నారు. ఈ మామిడి కొన్ని శ్రమల్లో ఇప్పటివరకూ తోతాపురి రకం కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
టేబుల్ రకాలలో బెనిషా, మలుగుబ, నీలం, రుమాణి, నాటి రకం మాడి కాయలతో పాటు ఇంకొన్ని రకాల మామిడి వెరైటీలు ఎగుమతులకు, తినడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ టేబుల్ రకాలను కూడా గుజ్జు తీయడానికి కొన్ని పరిశ్రమలు ఆర్ అండ్ డి (research and development) పద్ధతిలో ప్రయోగాత్మక పరిశీలన చేపట్టాయి. బేనీషా, నీలం రకాల మామిడి గుజ్జు తీస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ గుజ్జుకు ఆదరణ లభిస్తే రైతులకు రానున్న కాలంలో మేలు జరిగే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా మామిడి గుజ్జ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు గోవర్ధనబాబీ అభిప్రయాపడ్డారు.
"గత రెండు సంవత్సరాల నుంచి 2000 టన్నుల టేబుల్ రకాల మామిడికాయలు ప్రాసెసింగ్ చేస్తున్నారు" మామిడి గుజ్జు (mango pulp industries) ప్రతినిధి బాబీ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఒక రకంగా ఇది పరిశ్రమలు చేస్తున్న సాహస ప్రయోగం అనేది ఆయన మాట.
రంగుతోనే తాడా..
గత రెండేళ్లుగా బేనీషా, నీలం రకం మామిడిని కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలకు పైగా కొనుగోలు చేశారు. గుజ్జు పరిశ్రమలో ఈ రకం మామిడికాయలను ధర్మల్ ప్రాసెస్ చేసే సమయంలో పసుపు రంగుకు బదులు నలుపుగా రావడం అనేది డిసడ్వాంటేజ్ అని ఆ ప్రతినిధి చెప్పారు. పాలిష్, సైజు అనేది ఒక రకంగా ఈ కాయకు ఉన్న ప్రత్యేకత. దేశంలోని పొరుగు రాష్ట్రాలకు రవాణా, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి మాత్రమే ఈ కాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాంటిది మామిడి గుజ్జు పరిశ్రమల్లో ఈ కాయలు కొనుగోలు చేయడం ద్వారా ప్రయోగాత్మగా ప్రక్రియకు పరిశీలనకు గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సాహసం చేశారు. రంగుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ధర లభిస్తే మాత్రం ఈ ప్రయోగం ఫలించినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా యూరోపియన్, గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాతే, గుజ్జు పరిశ్రమలకు ఊపిరి వస్తుంది. గుజ్జు కొను కూడా చేయడంలో ప్రధాన ట్రేడర్ గా ఉన్న కువైట్ ,(Kuwait) ముందడుగు వేస్తే గుజ్జుకు డిమాండ్ పెరుగుతుంది. టేబుల్ రకాల మామిడి కాయలతో తయారు చేస్తున్న గుజ్జుకు ఏ మేరకు ఆదరణ ఉంటుందనేది కూడా స్పష్టమవుతుంది. ఈ పరిణామాలు సాను కొనిస్తే మాత్రం భవిష్యత్తులో చిత్తూరు జిల్లా మామిడి రైతుల దశ తిరుగుతుందని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Similar News