బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పివిఎన్ మాధవ్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.;

Update: 2025-07-01 10:03 GMT
పురందేశ్వరి నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న మాధవ్

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మంగళవారం మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (PVN Madhav) స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్‌కు బీజేపీ జాతీయ, ఏపీ నాయకులు అభినందనలు తెలిపారు. తాను ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని మీడియాతో అన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన పీసీ మోహన్‌కి ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.

మా కుటుంబం, బీజేపీ వేర్వురు కాదని స్పష్టం చేశారు. పురంధేశ్వరి సారథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గరు ఎంపీలుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు భరోసా కల్పించారని చెప్పుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పురందేశ్వరి మరిన్ని సేవలు అందించనున్నారని అన్నారు. సోము వీర్రాజు బీజేపీ బలోపేతం కోసం ఇల్లు కూడా మరచిపోయి ఏపీ మొత్తం తిరుగుతూ పని చేశారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ది వన్ మేన్ షో...

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వాహకుడిగా బెంగుళూరు ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ వ్యవహారించారు. ఈ సందర్భంగా పీసీ మోహన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక సిద్దాంతం కోసం పని చేస్తోందని పీసీ మోహన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అయినా, జాతీయ అధ్యక్షుడు అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకుంటామని తెలిపారు.

నాయకులు, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలకు తమ పార్టీలో విలువనిస్తామని, కానీ కాంగ్రెస్‌లో అంతా వన్‌మ్యాన్ షో కనిపిస్తోందని విమర్శించారు. ఏఐసీసీకి నచ్చిన నేతలను మాత్రమే కాంగ్రెస్‌లో అధ్యక్షులని చేస్తారని అన్నారు. కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఉండదని చెప్పుకొచ్చారు. కేడర్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్‌లో రాష్ట్ర, జాతీయ అధ్యక్షులని ఎంపిక చేస్తారని తెలిపారు.

Tags:    

Similar News