పెరుగుతున్న కృష్ణా, గోదావరి వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.;
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా, గోదావరి ఉపనదుల ద్వారా విపరీతమైన నీటి ప్రవాహం కూడా ఉంటోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2అడుగులుగా ఉంది. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నీటి ప్రభావం పెద్ద ఎత్తున ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. సహాయక కార్యకలాపాలకు ముందస్తు చర్యల కోసం రూ. 16 కోట్లు మంజూరు చేశారు.
పల్నాడు, బాపట్ల, గుంటూరు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ నిధులను కేటాయించారు. రక్షణ చర్యలకు కోసం బృందాలు కూడా రంగంలోకి దిగారు. వరద ప్రవాహం ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు,/కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువుగా ఉన్నందువల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.