ADANI CASE| అదానీకి ఇచ్చిన భూముల్ని వెనక్కు తీస్కో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ లో అదానీ కంపెనీలకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, సామాజిక సేవా కార్యకర్త ఇఎఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు.
By : The Federal
Update: 2024-11-27 02:26 GMT
అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు జారీ చేసిన నోటీసుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో అదానీ కంపెనీలకు ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేసి ఆ కంపెనీలకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
అమెరికాలో న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు జారీ చేసిన తీర్పు ఆధారంగా, మన రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కొంత మంది రాజకీయ నేతలు, అధికారులు, అదానీ కంపెనీల మధ్య లావాదేవీలు ఉన్న విషయం బయటపడింది. ఆ తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ SECI తో, అదానీ, అజూర్ కంపెనీలకు, రెండు దశాబ్దాల పాటు, అత్యధిక లాభాలు కలిగించే విధంగా ఒక ఒప్పందం మీద 2021-22 లో సంతకం చేసిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే, ఒకవైపు అదానీ నుంచి ముడుపులు తీసుకుని రాష్ట్రంలో లక్షలాది మంది విద్యుత్ వినియోగదారుల మీద, అప్పటి ప్రభుత్వం, అదనంగా ఎలక్ట్రిసిటీ చార్జీల భారాన్ని రుద్దినట్టు అర్థమయింది. ఆ విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కూడా ఉంది.
ఆ తీర్పులో బయటపడ్డ విషయాల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం క్రింద సూచించిన చర్యలు తీసుకోవాలి:
కేంద్ర దర్యాప్తు సంస్థలు, CBI/ Enforcement Directorate/ CBDT లను, ఆ తీర్పు ఆధారంగా, అమెరికాలో, Security Exchange Commission (SEC), Federal Bureau of Investigation (FBI) వంటి సంస్థల నుంచి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కోరాలి.
దర్యాప్తు లో అప్పటి నాయకులు, అధికారులు ముడుపులు తీసుకున్న విషయం రుజువైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారు చేసిన ఒప్పందాలను రద్దు చేయాలి. ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.
అటువంటి ఒప్పందం కారణంగా, ఎలక్ట్రిసిటీ వినియోగదారుల మీద పడిన అదనపు చార్జీలను వెనక్కి తీసుకుని, 2021-22 నుంచి వారి మీద పడిన భారానికి తగిన నష్టపరిహారాన్ని ఇస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. అందుకు కావాల్సిన డబ్బు, లంచాలు తీసుకున్న నేతల నుంచి, అధికారుల నుంచి వసూలు చేయాలి
అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు, అదానీ వంటి కంపెనీలకు, అక్రమంగా ఎన్నో ఇతర ప్రాజెక్టులను ముట్ట పెట్టడం జరిగింది. ముఖ్యంగా, కడప జిల్లా , శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలలో, ASR పార్వతీపురం జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో, 6,200 మెగావాట్ల Pumped Storage ప్రాజెక్టులను, ఎటువంటి competitive bidding లేకుండా, అక్రమంగా అదానీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులో మన్యంలో ఇచ్చిన ప్రాజెక్టులు పీసా చట్టానికి, అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా ఇవ్వబడ్డాయి. ఆ ప్రాజెక్టు వలన ప్రజలకు, ఆదివాసీలకు నష్టం కలుగుతుంది. ఆ ప్రాజెక్టులను తత్ క్షణం రద్దు చేయాలి
గంగవరం పోర్టు, కేంద్ర ప్రభుత్వంలో నేతల ఒత్తిడితో, అదానీ కంపెనీ అధీనమైంది. ఆ పోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 10.4% వాటా ఉండేది. ఆ వాటా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకూడదు. అయినా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నేతల ప్రమేయం తో, తక్కువ ధరకు ప్రభుత్వం అదానీ కంపెనీకి అమ్మడం జరిగింది. ఆ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, అందుకు కారకులైన నేతల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో లక్షలాది ఎలక్ట్రిసిటీ వినియోగదారులు స్మార్ట్ మీటర్లు ఇంస్టాల్ చేయాలంటూ, ప్రభుత్వం అదానీ కంపెనీకి అధిక ధరలకు స్మార్ట్ మీటర్ల ఆర్డర్లను ముట్ట పెట్టడం జరిగింది. అందువల్ల నష్టపోయేది వినియోదారులే అనే విషయం ఒక స్వచ్చంధ సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా తెలియ చేసినా, ప్రభుత్వం ఆ రిపోర్టును గోప్యంగా పక్కనపెట్టి, ఆదానీకి లాభాలు కలిగించడం కోసం స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ను వెనక్కి తీసుకోవాలి
విశాఖలో, డేటా సెంటర్ పెట్టే ముసుగులో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మధురవాడ లో, కొండ పోరంబోకు లో వేలాది కోట్ల విలువ ఉన్న 270 ఎకరాల భూమిని అదానీ కి చట్టవిరుద్ధంగా ధారాదత్తం చేసింది. ఆ భూమిని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APMDC, మధ్య ప్రదేశ్ లో సులియారీ బొగ్గు గని మైనింగ్ కు లీజ్ తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతో, మైనింగ్ పనిని ఆదానీకి 2021-22 లో అప్పగించింది. ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడిన అదనపు భారం ఎంతో, నిష్పాక్షికమైన దర్యాప్తు చేయిస్తే బయట పడుతుంది. అదానీ కంపెనీకి ముట్టపెట్టిన మైనింగ్ పనిని రద్దు చేస్తూ, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తే, రాష్ట్ర ప్రభుత్వం లాభపడుతుంది. సులియారీలో అదానీ కంపెనీ అక్కడ ఆదివాసీ ప్రజల హక్కులను భంగపరిచిన కారణంగా, మన రాష్ట్రానికి చెడ్డ పేరు రావడం ప్రభుత్వం గుర్తించాలి. అటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, మన రాష్ట్ర ప్రభుత్వం కారణంగా జరగడం బాధాకరం
2014 నుంచి, ప్రభుత్వాలు అదానీ కంపెనీలకు ఎన్నో విధాలుగా భూములను, ఇతర వనరులను ఉదారంగా ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి విషయాలమీద నిష్పాక్షికమైన దర్యాప్తు అవసరం.
ఈ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను
ధన్యవాదాలతో
ఇఎఎస్ శర్మ
న్యూయార్ కోర్టు తీర్పు ఆధారంగా అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని టీడీపీ ఆరోపించింది. దీనిపై అసెంబ్లీలో చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.