Ration card | రూపు మారనున్న రేషన్ కార్డు
జేబులో పట్టే సైజులో రేషన్ కార్డు తయారు చేయనున్నారు. నాయకులు ఫోటోలు లేకుండా వినియోగదారులకు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-04-01 16:05 GMT
రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా రేషన్ కార్డు రూపాంతరం చెందుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం డెబిట్ కార్డ్ సైజు లో రేషన్ కార్డు సైజు మార్బోచబోతోంది. అది కూడా ఏ పార్టీ నాయకుల ఫోటోలు ఇందులో కనిపించవు. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న పథకాలు, విద్యార్థులకు జారీ చేస్తున్న పత్రాలు, పుస్తకాలపై నాయకుల ఫోటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే,
నిత్యావసర సరుకులు తీసుకునేందుకు రేషన్ కార్డులు ఇక మరింత చిన్నవి కాబోతున్నాయి. జేబులో పట్టేంత వీలుగా అధునాతన సాంకేతిక వ్యవస్థతో రేషన్ కార్డులు తయారు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
"రేషన్ కార్డులు ఇకపై డెబిట్ కార్డును పోలిన సైజులో ఉంటాయి" అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేరిన రేషన్ కార్డులో ఉండే ఫీచర్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. ఈ కార్డులపై సేఫ్టీ ఫీచర్ కోసం క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తామని వెల్లడించారు. కార్డు వెనుక వైపు ఆ కుటుంబంలోని సభ్యుల వివరాలు మొత్తం నమోదు చేస్తామని చెప్పారు.
"రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. కేవైసీ (KYC) ప్రక్రియ జరుగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 30 వ తేదీతో ముగుస్తుంది" అని పౌరసరఫల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వాస్తవానికి ఈ గడువు మార్చి 31 తోనే ముగిసిందని, 100% కేవైసీ ప్రక్రియ పూర్తి కానందున గడువును పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు.
"ఇప్పటివరకు రాష్ట్రంలో 93 శాతం కేవైసీ కార్యక్రమం పూర్తయింది. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు అందాయి. బోగస్ కార్డులు వేరువేయడం ద్వారా కొత్తవారికి కూడా రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం" అని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఈనెల చివరి లోపు రేషన్ కార్డుల్లో చిరునామా మార్పు, కొత్త సభ్యుల పేర్లు చేరిక, అనర్హులు, మరణించిన వారి వివరాలను తొలగించడం వంటి మార్పులు చేస్తామని ఆయన వివరించారు. కేవైసీ గడువు ముగిసిన తరువాత చిన్నపాటి సైజులో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల వివరించారు.