ఉండవల్లి నుంచి కుప్పం పనులకు శంకుస్థాపన
రూ.2,203 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ 7 పరిశ్రమలు స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఒకేసారి 7 పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుప్పం స్థానిక ప్రజలు, పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ 7 పరిశ్రమలు స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
త్వరలో కుప్పంలో రూ.6,300 కోట్ల పెట్టుబడితో మరో 8 కంపెనీలు వస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను పూర్తిగా స్థానికంగానే ఉత్పత్తి చేస్తామని, సౌరవిద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో డెయిరీ, పౌల్ట్రీ రంగాలను విస్తరింపచేయాలని, గతంలో మైక్రో ఇరిగేషన్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. రైతుల పిల్లలు ఐటీ రంగంలోకి వెళ్లి, కొందరు పారిశ్రామికవేత్తలుగా మారారని, విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువారేనని గర్వంగా పేర్కొన్నారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రోత్సహిస్తామని తెలిపారు. నాణ్యమైన పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తామని, ఏఐ సాయంతో ఇంటి వద్దే చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్దేశిత సమయంలో పరిశ్రమలు ప్రారంభించాలని సంస్థలకు సీఎం చంద్రబాబు సూచించారు.