ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి
పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ సిబ్బంది, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు తేల్చి చెప్పారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వివరణ తీసుకున్న తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని, ప్రజలతో మమేకమై పనిచేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సక్రమంగా పాల్గొనకపోతే పార్టీ ఇమేజ్‌కు హాని కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో జరిగిన పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు హాజరు కాలేదని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.4,000కు పెంచి, ఇంటింటా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు అందజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పలు చోట్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రులు పలువురు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని సీఎం పిలుపునిచ్చారు.