శ్రీవారికి తమిళ యాత్రికుల గొడుగు సేవ..

గరుడసేవ రోజు సమర్పించేందుకు చెన్నై నుంచి 11 గొడుగులలో పాదయాత్ర ప్రారంభం.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-22 16:06 GMT
తిరుమలకు బయలుదేరిన యాత్రికులు. కిక్కిరిసిన చెన్నై నగరం ప్యారిస్ లోని కేశవ పెరుమాల్‌ ఆలయ పరిసరాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గరుడ వాహనసేవ రోజు చెన్నై హిందూ ధర్మార్థ సమితి ట్రస్టు తరఫున టీటీడీకి 11 గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. వాటిలో ఒకటి వెండిపట్టుతో తీయారు చేయడం ఇందులో ప్రత్యేకం. 200 ఏళ్ల నాటి ఆచారం మధ్యలో ఆగింది. దీనిని 2000 సంవత్సరం నుంచి పునరుద్ధరించినిట్లు తమిళనాడులోని నిర్వాహకులు తెలిపారు.

తిరుమలకు చెన్నై నగరం నుంచి సోమవారం గొడుగుల ఊరేగింపు ప్రారంభమైంది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఉన్న 16 రకాల మర్యాదల్లో గొడుగు పట్టడం మొదటిది అని హిందూ ధర్మర్థా సమితి ట్రస్టు ట్రస్టీ ఆర్‌ఆర్‌. గోపాల్‌ జీ చెప్పారు. 20 సంవత్సరాలుగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్టు ద్వారా గొడుగులు సమర్పిస్తున్నారు.


కేశవ పెరుమాళ్ ఆలయంలో పూజలు

చెన్నై నగరం ప్యారీస్‌ వద్ద ఉన్న దేవరాజ మొదలియార్ ‌వీధిలోని కేశవ పెరుమాల్‌ ఆలయం ఆవరణలో వేకు జామున నుంచి ఈ పవిత్ర గొడుగులకు విశేష పూజలు నిర్వహించారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ, హిందూ ధర్మర్థా సమితి ట్రస్టు ట్రస్టీ ఆర్‌ఆర్‌. గోపాల్‌ జీ, నిర్వాహక ట్రస్టీ వేదాంతం జీ, విశ్వహిందూ విద్యాకేంద్రం ప్రధాన కార్యదర్శి గిరిజా శేషాద్రి, విశ్వహిందూ పరిషత్‌ తమిళనాడు ప్రధాన కార్యదర్శి సోమసుందరం నేతృత్వంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీలు జెండా ఊపి తిరుమల వైపుగా గొడుగుల ఊరేగింపును ప్రారంభించారు.

"శ్రీమన్నారాయణుడికి 16 రకాల మర్యాదలు ఉన్నాయి. అందులో మొదటి మర్యాద గొడుగుల సమర్పణ. ఈ భాగ్యం అందరికీ లభించడం పూర్వజన్మ పుణ్యం" అని హిందూ ధర్మర్థా సమితి ట్రస్టు ట్రస్టీ ఆర్‌ఆర్‌. గోపాల్‌ జీ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ మాట్లాడుతూ,

"తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఊరేగింపులో ఉపయోగించే గొడుగులు అత్యంత ప్రధానమైనవి. వాటిని సమర్పించే భాగ్యం తమిళనాడుకు లభించింది" అని విద్యాదీశ తీర్థ స్వామీజీ ఆశీర్వదించారు తమిళనాడులో కోట్లాది మంది భక్తులు ఉన్నా, ఆ పుణ్యం హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్. గోపాల్జీకి లభించిందని అన్నారు.
"గోవర్ధనగిరిని భగవాన్ కృష్ణుడు తన చిటికెన వేలుతో ఎత్తి ప్రజలను రక్షించాడు. ఈ గొడుగులు కూడ తమిళనాడు ప్రజలందరినీ రక్షిస్తాయి" అని అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులు సమర్పించడం 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇకపై ఎటువంటి అడ్డంకులు లేకుండా శతాబ్దాలు, సహస్రాబ్దాలు కొనసాగుతుంది అని అన్నారు.

తిరుమల శ్రీవారికి గొడుగులు సమర్పించే ఆనవాయితీ 200 సంవత్సరాల నాటిదని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌. గోపాల్‌జీ చెప్పారు. మధ్యలో ఈ సంప్రదాయం ఆగిపోయినా, 2000 సంవత్సరం నుంచి పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో గరుడసేవ రోజు శ్రీవారి ఆలయం ముందు ఈ గొడుగులు సమర్పిస్తామని ఆయన తెలిపారు.
కాలినడకన ప్రయాణం
చెన్నై నుంచి గొడుగులు భుజాలపై మోసుకుంటూ యాత్రికులు చెప్పులు కూడా ధరించకుండా కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. మార్గమధ్యలో ఊరి బయట విశ్రాంతి తీసుకునే యాత్రికులు ఎవరి నుంచి కూడా ఆహార పదార్థాలు తీసుకోకుండా, సొంతంగా తయారు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు.
"ఐదు రోజులపాటు సాగే పాదయాత్ర ద్వారా 27వ తేదీ మధ్యాహ్నానికి తిరుమలకు చేరుకుంటారు. అంతకుముందు రోజు అంటే 26వ తేదీ శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి రెండు గొడుగులు సమర్పిస్తాం" అని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌. గోపాల్‌జీ తెలిపారు. తిరుమల శ్రీవారికి సమర్పించే గొడుగుల తయారీకి దాతల నుంచి విరాళాలు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News