తేజస్వీ గెలుపులో మలుపులెన్నో

2025 బీహార్ ఎన్నికల్లో చివరకు రాఘోపూర్‌ నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించాడు.

Update: 2025-11-14 16:40 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్లలో తేజస్వీకి అనుకూల ఆరంభం లభించినా  కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన నియోజక వర్గాల్లో తేజస్వీ యాదవ్ పోటీ చేసిన  రాఘోపూర్ ఒకటి. తేజస్వీ యాదవ్ గెలుస్తాడా, గతంలో మాదిరిగా ఓటమి చవిచూస్తాడా అనేది తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ప్రతి రౌండ్ లో కూడా ఇదే వాతావరం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఊపిరి బిగబట్టుకుని ఆఖరు రౌండ్ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. 

ప్రారంభం ఇలా

వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ మొదటి రౌండ్లలోనే ఆధిక్యాన్ని సాధించాడు. మొదటి రౌండ్‌లో అతనికి 893 ఓట్ల మెజార్టీ లభించింది. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌ వెనుకబడ్డాడు. 5వ రౌండ్ వరకు ఈ ఆధిక్యం తేజస్వీ యాదవ్ కు కొనసాగింది, కానీ 6వ రౌండ్‌లో పరిస్థితులు మారిపోాయాయి. బీజేపీ అభ్యర్థి సతీష్ కు అనుకూలంగా మారింది. సతీష్ 106 ఓట్లతో ఆధిక్యం లభించింది. ఈ దశలో తేజస్వీ యాదవ్ తో పాటు ఆ పార్టీ నేతలు డీలా పడ్డారు. బీజేపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.  అయితే ఓట్ల మెజారిటీ తక్కువుగా ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో కూడా సంతోషం సన్నగిల్లింది. తేజస్వీ పార్టీ శ్రేణులు ఆశతో ఎదురు చూడసాగారు. 

మలుపు మొదలు: 10-11 రౌండ్లలో సతీష్ ఆధిక్యం పెరగడం

కౌంటింగ్ ముందుకు సాగగానే పరిస్థితులు తలకిందులైంది. బీజేపీ అభ్యర్థి పుంజుకోవడం మొదలైంది. తేజస్వీ యాదవ్ బాగా వెనుకబడ్డారు. 10వ రౌండ్ వరకు తేజస్వీ 36,950 ఓట్లతో వెనుకబడ్డాడు, సతీష్ కుమార్ 40,180 ఓట్లతో 3,230 మెజార్టీ సాధించాడు. 11వ రౌండ్‌లో ఈ ఆధిక్యం 4,829 ఓట్లకు పెరిగింది, సతీష్ 44,929 ఓట్లు, తేజస్వీ 40,100 ఓట్లు వచ్చాయి. ఇది రాఘోపూర్‌లో ఆర్జేడీకి పెద్ద షాక్‌గా మారింది. బీజేపీ అభ్యర్థి యాదవ సామాజిక వర్గాల్లో ప్రభావం చూపి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఓట్లు సమకూర్చుకున్నాడు. మరో వైపు పట్నాలో తేజస్వీ కుటుంబం, పార్టీ నేతలు ఉత్కంఠతో ఎదురుచూశారు. మహాఘట్‌బంధన్ మొత్తం ఎన్‌డీఏకు వెనుకబడుతుండటంతో, ఈ స్థానం మరింత కీలకంగా మారింది.  11 గంటల సమయంలో సతీష్ 1,273 ఓట్ల ఆధిక్యంతో పుంజుకున్నాడు. దాదాపు 20 నిమిషాల్లో పరిస్థితి తారుమారైంది.

తీవ్ర పోరాటం: 14-16 రౌండ్లలో సతీష్ బలమైన ఆధిక్యం

కౌంటింగ్ మధ్యలో సతీష్ ఆధిక్యం మరింత పెరిగింది. 14వ రౌండ్ వరకు తేజస్వీ 7,493 ఓట్లతో వెనుకబడ్డాడు. 16వ రౌండ్‌లో ఈ మెజార్టీ 9,705 ఓట్లకు చేరింది, తేజస్వీకి 55,706 ఓట్లు, సతీష్‌కు 65,411 ఓట్లు లభించాయి. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తేజస్వీ 2,288 ఓట్ల మేర వెనకబాడ్డాడు. 3:30 గంటల సమయంలో సతీష్ 7,000 ఓట్ల ముందంజలోకి వచ్చాడు, అరగంట తర్వాత 9,000 ఓట్లకు ఈ గ్యాప్ పెరిగింది. ఈ సమయంలో బీజేపీ కార్యాలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, ఎన్‌డీఏ మొత్తం 200+ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో సతీష్ విజయం దాదాపు ఖాయమని అనిపించింది. తేజస్వీ మొదట 2010లో తన తల్లి రబ్రీ దేవీని ఓడించిన సతీష్‌ ను ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ మళ్లీ ఎదుర్కొన్నాడు. ఈ దశలో ఆర్జేడీలో కలవరం చెలరేగింది, కానీ తేజస్వీ "మార్పు రావాలి" అనే తన క్యాంపెయిన్ స్లోగన్‌ను గుర్తు చేసుకుని ఎదురుచూశాడు.

తిరిగి మలుపు: 19-21 రౌండ్లలో తేజస్వీ పునరాగమనం

అయితే ఒక్కసారిగా సీన్ తిరగబడింది. 19వ రౌండ్‌లో తేజస్వీ 72,932 ఓట్లతో 1,186 ఓట్ల మెజార్టీ సాధించి ముందుకు వచ్చాడు. 20వ రౌండ్‌లో 77,646 ఓట్లతో 3,523 మెజార్టీ లభించింది. 21వ రౌండ్ వరకు 4,937 ఓట్లకు పెరిగింది. ఈ మలుపు ఆర్జేడీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. మహాఘట్‌బంధన్‌కు కొంచెం ఊపిరి పోసింది. అయినప్పటికీ ఆర్జేడీ శ్రేణుల్లో భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారు 40 స్థానాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మరో వైపు సతీష్ ఆధిక్యం క్షీణించడంతో బీజేపీలో కొంచెం నిరాశ వ్యక్తమైంది.

చివరి ఉత్సవం: 23-32 రౌండ్లలో బలమైన విజయం

23వ రౌండ్‌లో తేజస్వీ 94,458 ఓట్లతో 11,481 మెజార్టీ సాధించాడు. 25వ రౌండ్‌లో అది 13,903 ఓట్లకు పెరిగింది. 29వ రౌండ్‌లో 1,16,467 ఓట్లతో 13,880 మెజార్టీ లభించింది. చివరి 32వ రౌండ్‌లో తేజస్వీ మొత్తం 1,18,597 ఓట్లతో విజయం సాధించాడు, సతీష్ 1,04,065 ఓట్లతో 14,532 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 14 వేల ఓట్ల మెజార్టీతో పైచేయి సాధించడంతో తేజస్వీ మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ గెలుపు తేజస్వీకి మూడోసారి (2015, 2020 తర్వాత) విజయాన్నిచ్చింది. పట్నాలో ఆర్జేడీ కార్యాలయంలో ఉత్సవాలు జరిగాయి, తేజస్వీ తండ్రి లాలూ, సోదరి మీసా భారతి సహా కుటుంబం సంతోషించింది. ఈ విజయం మహాఘట్‌బంధన్‌కు ఒక్క చిన్న ఆశాకిరణం అని ఆర్జేడీ భావిస్తోంది. ఈ నియోజకవర్గం లాలూ కుటుంబానికి కంచుకోటగా మారడంతో, సతీష్ ప్రతిసారీ సవాలు విసిరినప్పటికీ, చివరికి తేజస్వీ ఆధిపత్యాన్ని కాపాడుకున్నాడు.

Tags:    

Similar News