తిరుపతి:కార్తీకాన...కనువిందు చేసిన దీపోత్సవం
టీటీడీ కార్యాలయ ఆవరణలో వెలిగిన వేలాది దీపాల కథను వివరించే చిత్రాలు...
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-14 17:35 GMT
కార్తీకదీపోత్సవం కనువిందు చేసింది. దాదాపు రెండు వేల మంది మహిళలు టీటీడీ వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా కార్తీకదీపాలు వెలిగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD) పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి ఈ వేడుక అత్యంత రమణీయంగా సాగింగి. కార్తీకమాసంలో టీటీడీ ప్రతి సంవత్సరం ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తోంది.
తిరుపతిలోని టీటీడీ ప్రధాన కార్యాలయం వెనుక వైపు ఉన్న ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొత్త ఇటుకలతో ప్రత్యేకంగా చిన్నపాటి వేదిక ఏర్పాటు చేశారు.
ఆ ఇటుకలపై మట్టితో చేసిన మూకుళ్లు అమర్చి, అందులో నెయ్యి, నూనె నింపారు. మహిళలకు ముందుగానే అందించిన దూదితో చేసిన ఒత్తులు అందించారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పీఠం ఆశీనులను చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారికి, శ్రీచతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. దీపారాధన చేయడానికి వచ్చిన మహిళలు కూడా మంత్రాలు వల్లెవేశారు. ఈ వేడుక అయిన వెంటనే భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
ఈ కార్యక్రమానికి ముందు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీరాఘవేంద్ర వేదస్వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యాన్ని వివరించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేశారు.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన "శ్రీ లక్ష్మి ఆవిర్భవం" నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. తరువాత భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. మహిళలు ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి, జేఈఓ వి. వీరబ్రహ్మం దంపతులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులలో ఒకరు, ఆగమ సలహాదారులు కృష్ణశేషాచల దీక్షితులు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు, హెచ్‌డిపీపీ సెక్రటరీ శ్రీరాం రఘునాథ్, అర్చక బృందం, వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనంలో రాత్రి పది గంటల వరకు సాగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.