పర్మిట్ రూములొస్తున్నాయ్!
మందు బాబులకి పండగే!;
Byline : G.P Venkateswarlu
Update: 2025-07-15 08:15 GMT
ఏపీలోని వైన్ షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేసేందుకు పరిశీలన కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రస్తుతం 3,396 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. నెలవారీ ఆదాయం మద్యం విక్రయాల ద్వారా సగటున నెలకు రూ. 2,300 కోట్ల వరకు వస్తోంది. ఆదాయం బాగానే ఉంది. మంచి బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. షాపుల వద్ద పర్మిట్ రూములు ఏర్పాటు విషయం కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన అబ్కారీశాఖ సమీక్షలో ఆయన పై ఆదేశాలు జారీ చేశారు.
గతంలో నాసిరకం బ్రాండ్స్ అమ్మి కోట్లు దోచుకున్నారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని అన్నారు. మద్యం ప్రియులు రోడ్ల పక్క, షెల్టర్ లలో మద్యం సేవించకుండా ఉండాలంటే పర్మిట్ రూములు అవసరమని అధికారులు చెప్పటంతో కమిటీని వేశారు. సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో 30 బ్రాడ్స్ మద్యం రకాల ధరలు ఏపీలో తక్కువగా ఉన్నాయని అధికారులు సీఎం కు వివరించారు.
ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు మద్యం వ్యాపారులు ఏర్పాటు చేశారు. మద్యం కొనుగోలు చేసిన వారికి అక్కడే గ్లాసులు, వాటర్ కూడా మద్యం దుకాణం వారే ఇస్తున్నారు. పెగ్గుల వారీగా కూడా మద్యం ప్రియులకు పోసి ఇస్తున్నారు. మద్యం పర్మిట్ రూములు అనధికారికంగా కొనసాగుతున్నాయి. ఇకపై అధికారికంగా అమలులోకి తసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.