'పవన్ సంతకం.. 'జగన్'ను ఇరకాటంలో పెట్టిందా?

తిరుమల శ్రీవారి దర్శనంలో పవన్ కల్యాణ్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. దీనిపై విమర్శకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే..

Update: 2024-10-02 08:27 GMT

శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే వ్యవహారం టీటీడీ వివాదాలకు కేంద్రంగా మారింది. దీనిని మరింత తీవ్రం చేసిన రాజకీయ పార్టీలు శ్రీవారి దర్శనానికి కూడా ముడిపెట్టాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని హిందూయేతరులు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే అంశాన్ని తెరమీదకి తెచ్చారు. దానిపై డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమలలో వ్యవహరించిన విధానంతో రాజకీయ విమర్శకుల అంచనాలను తల్లకిందులు చేశారు. ఇక నోరు మెదపడానికి వీలు లేని విధంగా వైసీపీని కూడా ఆత్మ రక్షణలో పడేశారు. తిరుమల పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ పెద్ద కూతురు ఆద్య (రేణూదేశాయ్ కుమార్తె),ప్రస్తుతం ఆయన భార్య అన్నా లెజినోవా కుమార్తె పోలెనా అంజనీ కొణిదెలతో కలిపి వచ్చిన ఆయన ఏం చేశారని ఒకసారి పరిశీలిద్దాం..



తిరుమల లడ్డూ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కలవరానికి గురిచేసింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పొరుగు దేశాల నుంచి కూడా వచ్చే భక్తుల్లో కూడా చర్చకు ఆస్కారం కల్పించింది. ఈ పరిస్థితుల్లో..

తిరుమల లడ్డు అపవిత్రమైందని, దీనికోసం జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్ఛిత్త దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం మంగళవారం సాయంత్రం తిరుపతికి వచ్చిన ఆయన, అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేశారు. ఆ తర్వాత నడక మార్గంలో తిరుమలకు రాత్రి 9:30 గంటలకు చేరుకున్నారు.టీటీడీ అతిథి గృహంలో బస చేశారు.అక్కడికి వచ్చి పెద్ద కూతురు ఆద్య (రేణూదేశాయ్ కుమార్తె), చిన్న కూతురు పోలేనా అంజలి (అన్నా లోజినోవా కుమార్తె)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
పవన్ కల్యాణ్ భార్య అన్న లెజినోవా సంతానమైన చిన్న కుమార్తె పోలేనా అంజని కొణిదెల క్రిస్టియన్. మైనర్ కూడా. దీంతో కూతురు పోలేనా తోపాటు పవన్ కల్యాణ్ కూడా శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇస్తూ సంతకం చేశారు. ఈ చర్యతో తనపై ఇంకెవరు నోరు తెరపడానికి అవకాశం లేకుండా చేశారు. ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ ను డిఫెన్స్ లో పడేశారనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి.. నిబంధనల ప్రకారం..
హిందువులు కాని ఇతర మతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. "హిందూమతంపై తనకు గౌరవం ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై విశ్వాసం, భక్తి ఉంది" అని నిర్ణీత దరఖాస్తుపై సంతకం చేయాలి. కాగా,

శ్రీవారి లడ్డు ఆ పవిత్రమైందనే వేదనతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేయడానికి తన ఇద్దరు కుమార్తెలు కుమారునితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు వచ్చిన విషయం తెలిసింది. వారిలో క్రిస్టియన్ మతానికి చెందిన తన భార్య లెజినోవా సంతానంలో చిన్న కుమార్తె పోలేనా అంజనీ కొణిదెల మైనర్. కుమార్తె కంటే ముందు పవన్ కళ్యాణ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచించల భక్తి, విశ్వాసం ఉందని చెబుతూ డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన చిన్న కుమార్తె పోలేనా అంజని సంతకం చేశారు. టీటీడీ తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో, కార్యాలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ బసచేసిన అతిథి గృహం వద్దకు చేరుకొని డిక్లరేషన్ పై సంతకాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే..

పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం రాజకీయ విమర్శలకు చెక్ పెట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఇకపై డిక్లరేషన్ అనే పదం పలకడానికి కూడా సాహసించని రీతిలో ఆయన ఘాటైన సమాధానం చెప్పినట్లు ఈ చర్య ద్వారా కనిపిస్తోంది.
డిఫెన్స్ లో మాజీ సీఎం జగన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం వల్ల మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు, వైసీపీ నాయకులు డిఫెన్స్ లో పడ్డారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 
"డిక్లరేషన్ ఇవ్వను" అని వైయస్ జగన్ చెప్పడం. "ఇది అవసరం లేదు" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పునరుద్ధాటించడం తెలిసిందే.
ఈ వాదోపవాదాలు జరుగుతుండగానే..
సెప్టెంబర్ 28: తిరుమల లడ్డు వ్యవహారంలో శనివారం (గత నెల 27) తిరుమలలో శ్రీవారి దర్శనానికి వైఎస్. జగన్ పర్యటన ఖరారైంది.
"డిక్లరేషన్ ఇవ్వకుంటే తిరుపతిలో అడుగుపెట్టనివ్వం" అని టీడీపీ కార్యదర్శి జీ. నరసింహయాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ వంటి వారందరూ ఘాటుగా హెచ్చరించారు.
"పిఠాపురంలో బాప్తీసం తీసుకున్నారు. ఆయన భార్య కూడా క్రిస్టియన్"అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య ఇది.
సెప్టెంబర్ 27: ఉదయం :టీడీపీ కూటమి నేతలు జగన్ అడ్డుకోమని ప్రకటన చేశారు.
మధ్యాహ్నం: నేను తిరుమలకు రావడం లేదు అని వైఎస్ జగన్ తన పర్యటన రద్దు చేసుకున్న విషయాన్ని ప్రకటించారు.
దీనిని కూడా అవకాశం గా తీసుకున్న టీడీపీ కూటమి నేతలు "తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు" అని కొత్త పల్లవి అందుకున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాగా,
తాజాగా పవన్ కల్యాణ్ తిరుమలలో తన కుమార్తెలతో కలిసి డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష వైసీపీ నాయకులే కాదు. మాజీ సీఎం జగన్ ను ఆత్మరక్షణలో పడేశారు. దీనిపై వారు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

జగన్ డిక్లరేషన్ ఇవ్వరా ?
మాజీ సీఎం వైఎస్. జగన్ తిరుమల పర్యటనలో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చే వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
2014 - 2019: వరకు సీఎం గా ఉన్న వైఎస్. జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఒంటరిగానే వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. "భార్యతో ఎప్పుడూ తిరుమలకు రాలేదు" అనేది టీడీపీ కూటమి నేతల ఆరోపణ.
"వైఎస్. జగన్ కు తిరుమల వెంకటేశ్వరస్వామిపై భక్తి, విశ్వాసం లేకే, ఇలా వ్యవహరించారు" అని సీఎం చంద్రబాబు, కూటమి నేతలు కూడా ఏక బిగిన ఆరోపించారు.
తిరుమల లడ్డు లో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం బయటకు పొక్కిన తర్వాత వైయస్ జగన్ పై రాజకీయంగా విమర్శలు ఎక్కువయ్యాయి. వైసిపి ప్రభుత్వ కాలంలోనే వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని టిడిపి కూటమి నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అందువల్లే తనకు తిరుమల వెంకన్నపై భక్తి ఉందని నిరూపించుకునేందుకు కొండకు వెళ్ళేందుకు జగన్ సిద్ధమయ్యారు. అర్ధంతరంగా ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అనేది ఇంతవరకు మాజీ సీఎం జగన్ లేదా ఆయన పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవానికి..
వైఎస్సార్ కుటుంబం క్రిస్టియన్ మతాచారాలను మాత్రమే పాటిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. కాగా వైఎస్ జగన్ పూర్వీకులు అంటే.. జగన్ ముత్తాత క్రిస్టియానిటీ స్వీకరించారు. ఆ తర్వాత నుంచి వారి కుటుంబం మొత్తం అదే మతంలో కొనసాగుతోంది. 
డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని పురాతన చర్చిలో వైఎస్సార్ కుటుంబీకులు మొత్తం కలుస్తారు. చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో వైఎస్ఆర్, అదే హోదాలో ఐదేళ్లు కొనసాగిన జగన్ కూడా... క్రిస్మస్ వేడుకలకు కచ్చితంగా పులివెందులలోనే ఉంటారు. అంతేకాకుండా వైఎస్. జగన్ తల్లి వైఎస్. విజయమ్మ నిత్యం బైబిల్ చేత పట్టుకుని ఎప్పుడు కనిపిస్తారు. ఇదిలా ఉంటే
తిరుమల లడ్డు వ్యవహారం నేపథ్యంలో తిరుపతి రెండు రోజుల పర్యటన రద్దు చేసుకున్న వైఎస్. జగన్ తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. "నా మతం మానవత్వం" అంటూ కొత్త భాష్యం చెప్పారు. "నాలుగు గోడల మధ్య మాత్రమే బైబిల్ చదువుతాను. బయటికి వస్తే హిందూ మతాన్ని, ఇస్లాం, క్రిస్టియన్, జైన్, సిక్కు మతాచారాల ప్రకారం ఆయా ప్రార్థన మందిరాలకు కూడా వెళ్తా. పూజలు చేస్తా. అలాంటప్పుడు నాది ఏ మతం? మీరే చెప్పండి" అని ఎదురు ప్రశ్నించారు. కాగా..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందే డిక్లరేషన్ ఇచ్చారు. ఇది చాలావరకు వైఎస్. జగన్ ను ఇరకాటంలో పెట్టేది ఉందని భావిస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News