మాది పెట్టుబడుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు;

Update: 2025-07-28 07:53 GMT

తమది పెట్టుబడుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్‌ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్‌ లో పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్‌ సీ లాంగ్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. అలాగే గ్రీన్‌ హైడ్రోజన్, ట్రాన్స్‌ మిషన్‌ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్‌ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్‌ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్‌ రంగంలో సింగపూర్‌ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్‌ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్‌ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్‌ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మానవ వనరులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ట్రేడ్‌ రంగాల్లో సింగపూర్‌ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మరోవైపు గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ తో సీఎం చర్చించారు. సింగపూర్‌ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్‌ లో సింగపూర్‌ టౌన్‌ షిప్‌ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్‌ ను చూసే గతంలో హైదరాబాద్‌ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబరు నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ ను సీఎం ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌ లో గృహ నిర్మాణం, సబ్‌ సీ కేబుల్‌ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రంగంలో సింగపూర్‌– ఏపీ కలిసి పని చేస్తామని వెల్లడించారు. గ్రీన్‌ ఎనర్జీ, గృహ నిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి పని చేస్తున్నామని సింగపూర్‌ మంత్రి ఏపీ సీఎంకు వివరించారు. గతంలో హైదరాబాద్‌ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని సింగపూర్‌ మంత్రి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Tags:    

Similar News