తిరుపతిలో అందరిని దారికి తెచ్చిన "చెత్త" ప్రకటన
ఇది చిన్న ప్రకటనే. ఇంతకీ దీనివల్ల ఏమి జరిగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఏమి చేస్తున్నారు. నగర పాలక సంస్థ అధికారుల తీరు ఎలా ఉంది. వారేమంటున్నారు?
By : SSV Bhaskar Rao
Update: 2024-07-20 10:01 GMT
అది తిరుపతిలోని కపిలతీర్థం రోడ్డు (కేటీ రోడ్). టీటీడీ పరిపాలన భవనం, జిల్లా అధికారుల కార్యాలయాలు ఉంటాయి. యాత్రికుల రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కేటీ. రోడ్డుకు పక్కనే ఉన్న 42వ డివిజన్లలో వరదరాజనగర్ లో స్థితిమంతులే కాదు. పేదల నివాసాలకు కూడా నిలయం. మూడు వీధులు కలిసే చోట రోడ్డు పక్కనే చెత్తకుప్పలు ఇబ్బుడి ముబ్బడిగా కనిపించేవి. నాలుగు రోజుల నుంచి ఆ ప్రదేశం పరిశుభ్రంగా మారింది. కేవలం రూ. 500 ఖర్చుతో పెట్టిన ఒక్క హోర్డింగ్ ఈ మార్పునకు కారణమైంది.
ఆ హెచ్చరిక కాలనీవాసులను అదిరించిందో? భయపెట్టిందో? చైతన్యం చేసిందో తెలియదు! కానీ, ఆ వీధిలో రోడ్డుపై మచ్చుకు కూడా చెత్త కనిపించడం లేదు. దీనికి ప్రభుత్వం మారడమో, అధికారుల పెత్తనం ఎంతమాత్రం కాదు. చిన్నపాటి ప్రయత్నం మంచి ఫలితం ఇచ్చింది.
నగరంలోని 42 డివిజన్ పరిధిలోని పరిస్థితి ఇది. ఈ ప్రాంత నగర పాలక సంస్థ శానిటరీ ఇన్ స్పెక్టర్ గురుమూర్తి చేసిన ప్రయోగం ఫలించింది.
ఇది నగరంలోని ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి ప్రేరణ కల్పించింది.
"చెత్త ఎక్కువగా వేసే ప్రదేశానికి పక్కనే ఓ డాక్టర్ ఉంటారు. చాలాసార్లు నాతో ఆయన బాధపడ్డారు. ఏమి చేయాలనేది అర్థం కావడం లేదన్నారు" అని శానిటరీ ఇన్ స్పెక్టర్ గురుమూర్తి ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. "దండన అనేది సరైంది కాదు అని నాకు అనిపించింది. ఆ డాక్టర్ సహకారం తీసుకుని హోర్డింగ్ ఏర్పాటు చేయించా. అక్కడ రెండు డమ్మీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా" అంతే.. రెండో రోజు నుంచి అక్కడ చెత్త కనిపించలేదని గురుమూర్తి అంటున్నారు. ఇదే పద్ధతి నా డివిజన్ లోని వీధుల మొదట్లో ఏర్పాటు చేశా అని ఆయన వివరించారు.
ఆధ్యాత్మిక రాజధానిలో..
తిరుపతి అనగానే కళ్ల ముందు మెదలాడేది శ్రీవెంకటేశ్వరస్వామి. గోవిందరాజస్వామి, కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, సమీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం ఆలయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సగటున వచ్చే లక్ష నుంచి 1.20 లక్షల మందితో రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండు 24/7 రద్దీగా ఉంటాయి. ఇక సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్యకు కొదవ ఉండదు. వారందరి ఆకలి తీర్చడానికి, విశ్రాంతా కోసం అందుబాటులో వందలాది హోటళ్లు, లాడ్జీలకు కొదవ లేదు. ఇక్కడి నుంచి వచ్చే వ్యర్ధాలకు తోడు, నగరంలోని నివాసాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలు కూడా తోడవుతాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీల్లో చెత్త పన్ను రద్దు చేయడం వల్ల దుకాణదారులు, నివాసితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మున్సిపాలిటీకీ రకరకాల పన్నులు చెల్లిస్తున్నాం. చెత్త ఇవ్వడానికి పన్ను చెల్లించే దరిద్ర్యం పోయింది" అని శాంతినగర్ లోని రజని, రాణి వ్యాఖ్యానించారు. "ఇళ్ల వద్దకు చెత్తతీసుకోవడానికి వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి ఈ డబ్బు ఇచ్చినా తప్పలేదు" అని అభిప్రాయపడ్డారు.
తిరుపతి నగర పాలక సంస్థ పరిధి 27.44 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. 20 రెవెన్యూ వార్డుల్లో 50 డివిజన్లతో విస్తరించిన నగరంలోని 42 మురికివాడల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా ఉంది. 2001తో పోలీస్తే, 6.40 శాతం జనాభా పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా నగరాలు, పట్టణాల్లో మాదిరే ఇళ్ల వద్దే తడి,పొడి చెత్త వేర్వేరుగా మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. ఆ చెత్తగుట్టలు పేరుకుపోకుండా, ఎరువు, గ్యాస్ ఉత్పత్తితో నగర పాలక సంస్థకు నెలకు రూ. ఏడు నుంచి ఎనిమిది లక్షల ఆదాయం కూడా లభిస్తోంది.
పారిశుద్ధ్యంపై శ్రద్ధ
నగరంలోని 50 దివిజన్ల నుంచి రోజూ 197 మెట్రిక్ టన్నుల వ్యర్దాలు ఉత్పన్నం అవుతాయి. తడి,పొడి చెత్తను నగరంలోని మూడు ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పరిశుభ్రతకు ప్రత్యే శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకోసం నగరాన్ని రెండు జోన్లుగా విభజించారు. 25 డివిజన్లకు శానిటరీ సూపర్ వైజర్ వి. చెంచయ్య, మరో మిగిలిన 25 డివిజన్లను సుమతి పర్యవేక్షిస్తున్నారు.
"నగరంలో ఇళ్లు, హోటళ్ల నుంచి రోజుకు ఉత్పన్నం అయ్యే 197 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను న్యూ బాలాజీ కాలనీ, కరకంబాడిలోని గోవిందథామం వద్ద ఉన్న రెండు ట్రాన్స్ ఫర్ స్టేషన్ల వద్దకు తరలిస్తాం" అని చెంచయ్య ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. "ఆ సెంటర్లలో తడిపొడి చెత్త వేరు చేసి, తూకివాకంకు వద్ద ఉన్న ఎరువు, గ్యాస్ తయారు కేంద్రానికి చేరుస్తాం" అని చెంచయ్య వివరించారు. ఇందుకోసం నగరంలో మున్సిపల్ వర్కర్ నుంచి శానిటరీ సూపర్ వైజర్, డ్రైవర్లు, మేస్త్రీలు 963 మంది రోజే విధుల్లో ఉంటారు. వారిలో 130 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది కాగా, మిగతా వారంతా ఔట్ సోర్సింగ్ కార్మికులే అని ఆయన వివరించారు.
చెత్త నుంచి సంపద
ఈ మాట విని చాలా మందికి విసుగుపుట్టి ఉంటుంది. చిత్తశుద్ధితో పనిచేసే, సిబ్బంది, అధికారులు సమన్వయం చేస్తే సాధ్యం అవుతుందని నిరూపిస్తున్నారు. దేశంలో ఇండోర్ తరువాత పారిశుద్ధ్యం నిర్వహణలో తిరుపతిని దేశంలో టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలిపారు. వ్యర్ధాల నిర్వహణలో సంపద సృష్టితో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ అన్నారెడ్డి విజయకుమార్ రెడ్డి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ తోపాటు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. శానిటరీ సిబ్బంది, కార్మికుల సహకారం కూడా తనకు కలసి వచ్చిందనేది ఆయన అభిప్రాయం.
గ్యాస్ ఉత్పత్తి
కూరగాయల మార్కెట్, ఫుడ్ వేస్ట్ ద్వారా మహీంద్ర కంపెనీ రూ.16 కోట్లతో గ్యాస్ ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేసింది. రోజుకు 600 నుంచి 700 కిలోల గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది.
నగర పాలక సంస్థకు వారి నుంచి ఎలాంటి ఆదాయం లేదు. డ్రై వేస్ట్ ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. "నగరం, శివారులో చెత్తకుప్పలు పెరగకూడదు. జీరో వేస్ట్ ఉండాలనే మహీంద్ర కంపెనీకి సంస్థకు అధికారులు ప్రాజెక్టు అప్పగించారు" అని విజయకుమార్ రెడ్డి ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. శివారుల్లో కూడా వ్యర్దాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే లాభాపేక్ష లేని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. "వెట్ వేస్ట్ ద్వారా ఎరువు తయారీని ఎరోఫెనిస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధాదేవి తీసుకున్నారు. కిలోకు రూ. రెండు చెల్లిస్తారని, ఈ లెక్కన నెలకు నగర పాలక సంస్థకు రూ. ఏడు నుంచి ఎనిమిది లక్షల ఆదాయం వస్తుంది" అని ఆయన వివరించారు.
ప్రపంచ ఆధ్మాత్మిక రాజధాని తిరుపతిలో చిన్నతో హోర్డింగ్ వచ్చిన మార్పు నగరంలో కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో తిరుపతిని ప్రధమ స్థానంలో నిలపాలనేది లక్ష్యమని, శానిటరీ సిబ్బంది చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది వేచిచూడాలి.