Tirupati Zoo | వన్యమృగాల మృత్యుఘోష..
తిరుపతి ఎస్వీ జూ పార్కులో జాగ్వార్ 'కుశ' ఎలా మరణించింది?
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-07 16:08 GMT
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో తరచూ వన్యమృగాలు మృత్యువాత పడుతున్నాయి. ఇక్కడ జంతువులకు ఏమైందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మంగళవారం 15 సంవత్సరాల వయసున్న మగ జాగ్వార్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై అటవీశాఖ వన్నె ప్రాణి విభాగం అధికారులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
తిరుపతి ఎస్వీ జూపార్కుకు మంగళవారం సెలవు. సందర్శకులు ఉండరు. జూపార్కులో సిబ్బంది, వన్యప్రాణుల సంరక్షకులు మాత్రమే ఉంటారు. ఇదే సమయంలో అనుకోని విధంగా మగ జాగ్వార్ మరణించడం, సమాచారం అందుకున్న అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు పరిశీలించారు. తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఖననం చేశారు. ఇదిలాఉండగా...
ఆగని మరణాలు..
తిరుపతి ఎస్వీ జులాజికల్ పార్క్ లో ఇప్పటికే అనేక ప్రాణులు చనిపోయాయి. అనారోగ్య కారణాలతోనే చనిపోయినట్లు తిరుపతి వెటర్నరీ విశ్వవిద్యాలయం కథాలజీ విభాగం నిపుణులు గతంలో వన్యమృగాల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత నిర్ధారించారు.
తిరుపతి జూ పార్కులో ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ కూడా ఓ సింహం మృతి చెందింది. ఎనిమిది నెలల వయసులో ఉండగా 2002లో ఈ మలసింహాన్ని తిరుపతి జోకు తీసుకువచ్చారు. వయసు మీరడం దీనికి తోడు ఆరోగ్య సమస్యల కారణంగానే చనిపోయినట్లు అప్పట్లో నిర్ధారించారు.
2023 డిసెంబర్ నెలలో 23 సంవత్సరాల వయసున్న సీత అనే ఆడ సింహం వృద్ధాప్యం, అనారోగ్య కారణంగానే మరణించింది. దీనికి ముందు రోజుల వ్యవధిలోనే అనురాగ్ అనే మధు సింహం కూడా మరణించింది.
15 ఏళ్ల జాగ్వార్ ఇక లేదు..
తిరుపతిలోని ఎస్వీ జులాజికల్ పార్కులో మంగళవారం 15 సంవత్సరాల వయసున్న మగ జాగ్వార్ కుశ మరణించింది. 2019లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి ఈ జాగ్వర్ ను తీసుకు వచ్చారు. దీనిని మచ్చిక చేసుకోవడంలో జాగ్రత్తలు పాటించిన జంతు ప్రదర్శనశాల సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలా మరణించింది?
తిరుపతి జూ పార్క్ లో సంచరిస్తున్న కుశ అనే మగ జాగ్వార్ ఎప్పటిలాగా మంగళవారం కూడా విశాల మైదానంలో తిరగడానికి వదిలినట్లు తిరుపతి జూ సిబ్బంది ద్వారా తెలిసింది. ఏం జరిగింది కానీ వాటి పరిధిలోని ఆవరణలో తిరుగుతూ ఓ చెట్టుకు చిక్కుకుపోయి, మరణించి పడి ఉండడం కనిపించినట్లు సిబ్బంది ద్వారా తెలిసిన సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే జూ క్యూరేటర్ సెల్వం, మిగతా అధికారులు ఘటన ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిసింది.
ప్రమాదవశాత్తు మరణించిన 15 సంవత్సరాల మగ జాగ్వార్ కు తిరుపతి ఎస్వి పశు విశ్వవిద్యాలయం పెథాలజిస్టులు పరిశీలించారు. ఆ జాగ్వర్ కు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత hyper shark, aspsia తో మరణించిందని నిర్ధారించారు. అటవీ శాఖ ఫోటో కాల్స్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుశ అనే జాగ్వర్ ను ఖననం చేసినట్లు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఈ విషయంపై తిరుపతి జూ (zoo) క్యూరేటర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.