'ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట' వద్ద 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం
ఏకశిలానగరం ఇక సెంటర్ ఆప్ అట్రాక్షన్. టీటీడీ సన్నాహాలు..
Byline : SSV Bhaskar Rao
Update: 2025-12-07 10:11 GMT
శ్రీకోదండరామాలయంలో ఇమాంఖాన్ బావి వెనక కథేమిటి.? ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు వెనక నేపథ్యం ఏమిటి?
కడప నుంచి తిరుమలను అనుసంధానిస్తున్నారు. జాతీయ రహదారి- 40లోని కడప, గ్రీన్ ఫీల్డ్ హైవేలోని ఒంటిమిట్ట, తాళ్లపాక కలపడం ద్వారా ఆలయాల సర్క్యూట్ అమలు చేస్తున్నారు. దీనివల్ల ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను మరింత తీర్చదిద్దడం ద్వారా పర్యాటక అభివృద్ధికి టీటీడీ కార్యాచరణ అమలు చేస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం "ఆంధ్రా భద్రాద్రి"గా గుర్తింపు ఇచ్చింది. గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న తాళ్లపాక గ్రామ పొలిమేరల్లో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగానే కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీకోదండరామాలయానికి సమీపంలోని చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
"ఒంటిమిట్ట తోపాటు ఈ మార్గంలోని ఆలయాలకు యాత్రికులు వెళ్లేవిధంగా 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో ఉంచుకోండి. ఆమేరకు ప్రణాళికలు తయారు చేయండి" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు.
దేవుడి కడపకు తిరుమల మధ్య చారిత్రక అనుబంధం ఉంది. ఈమార్గంలోనే ఒంటిమిట్ట, పదకవితా పితామహుడు అన్నమాచార్యుడి జన్మస్థలం తాళ్లపాక గ్రామం వద్ద యాత్రికులకు సదుపాయాలు కల్పించడానికి టీటీడీ శ్రద్ధ తీసుకుంటోంది. తద్వారా ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
కడప - తిరుమల ఆధ్యాత్మిక కారిడార్.. ఒంటిమిట్ట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
కర్నూలు నుంచి ప్రారంభమయ్య జాతీయ రహదారి- 40పై ఉన్న కడప, అక్కడి నుంచి చెన్నై మార్గంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేలో (Greenfield Highway) రాజంపేట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రేణిగుంట జంక్షన్, పుత్తూరు, నగరి మీదుగా తమిళనాడు వరకు ఉన్న రహదారిలో చారిత్రక ఆధ్యాత్మిక సంపదకు నిలయంగా ఉంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళుతూ ఉంటారు.
మూడు క్షేత్రాలకు తొలిగడప..
దేవుడి కడప అనే కుగ్రామం తిరుమలకు వెళ్లే యాత్రికులకే కాదు. దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని మూడు క్షేత్రాలకు వేళ్లే యాత్రికులకు కూడా ఇది తొలగడప. దక్షిన భారతదేశం నుంచి కాశీ వెళ్లే యాత్రికులు కడపమీదుగానే ప్రయాణం చేయాలి. ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం, తిరుమలకు కాలిబాట, వాహనాల్లో వెళ్లేవారికి కడప పట్టణమే ప్రధానమార్గం. దీంతో పాతరోజుల్లో ఆ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులు కచ్చితంగా మొదట దేవుడి కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే వారు. మళ్లీ కొన్ని సంవత్సరాలుగా యాత్రికుల సంఖ్య పెరుగుతోంది.
తిరుమలతో అనుబంధం..
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవుడి కడప ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams TTD) 2006 స్వాధీనం చేసుకుంది.
తిరుమలకు వెళ్లడానికి కడప నగరానికి సమీపంలోని దేవుడి కడపలోని శ్రీలక్ష్మీ శ్రీవెంకటేశ్వరాలయం గడప అనేది చారిత్రక పురాణం చెబుతోంది. తిరుమల శ్రీవారికి ప్రతిబింబింలా దేవుడి కపడలో వేంకటేశ్వరస్వామి కనిపిస్తారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం, దేవుడి గడప రాజగోపురం ఒకేసారి నిర్మించినట్టు కడప కైఫీయత్తు స్ఫస్టం చేస్తోంది.
తిరుమల వరాహస్వామి క్షేత్రం. డేవుడి కడప మాత్రం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి కావడం ప్రత్యేకం. ఇక్కడ ఇంకో ప్రత్యేక ఉంది. వినాయకుడి విగ్రహానికి అడ్డనామాలు చూస్తుంటాం. దేవుడి కడపలోని విగ్రహానికి మాత్రం నిలువు నామాలు ఉంటాయి. గర్భగుడిలో వేంకటేశ్వరుడు, ఎడమ వైపు మందిరంలో శ్రీమహాలక్ష్మి దర్శనం ఇస్తారు. ఇక్కడ మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
తాళ్లపాక వద్ద 108 అడుగుల విగ్రహం..
శ్రీవెంకటేశ్వరస్వామి వారిని కీర్తించిన పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మస్థలం కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాక గ్రామం. జాతీయ రహదారికి పక్కనే 2008లో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షగా తీర్చిదిద్దారు. ఇదే ప్రదేశంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రత్యేకంగా తిరుమల నాదనీరాజనం తరహాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక కూడా ఏర్పాటు చేశారు.
తాళ్లపాక గ్రామంలో చక్రతాళ్ల్వార్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలోని సిద్ధేశ్వరుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి ఆలయాలు అత్యంత పురాతనమైనవి. ఈ ఆలయంలో అన్నమయ్య పూజలు చేశారనడానికి చారిత్రాక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే ధ్యానమందిరాన్ని కూడా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేసింది.
కడప నుంచి జాతీయ రహదారిలో ప్రయాణించే యాత్రికులు ఈ ప్రదేశాలను సందర్శించడానికి అనువైన వాతావరణం కల్పించారు. కొన్నాళ్లపాటు తాళ్లపాక గ్రామంలోని ధ్యానమందిరం వద్ద తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సుదర్శన కంకణాల కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, ఆ తరువాత రద్దు చేశారు. ఆ సమయంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా ఉండడం వల్ల తాళ్లపాక గ్రామ విశిష్టత దేశంలోని అనేక ప్రాంతాల వారికి సులువుగా తెలిసేది.
ఆంధ్రా భద్రాద్రిలో సెంటర్ అట్రాక్షన్
కడప నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీ కోదండరామాలయాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు టీటీడీ సిద్ధం చేస్తోంది. ఒంటిమిట్ట మీదుగా సాగే జాతీయ రహదారికి ఒకపక్క కోదండరామాలయం ఉంటే, మరో పక్క 195 ఎకరాల విస్తీర్ణంలో పెద్దచెరువు ఉంటుంది.
2025 ఏప్రిల్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన ఉన్న ఆయన
"ఒంటిమిట్ట ఆలయ పరిసరాలతో పాటు చెరువుకు కూడా మహర్దశ తెచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేయండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. అబివృద్ధి పనులతో పాటు చెరువు అభివృద్ధి, సుందరీకణ, బోటు షికారు చేసే విధంగా యాత్రికులకు మానసిక ఉత్సాహం కలగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర విభజన తరువాత చాలా ప్రాంతాల నుంచి ఒత్తిడి వచ్చినా, 16 శతాబ్దంలో చోళులు నిర్మించిన శ్రీకోదండరామాలయాన్ని 2014లో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాద్రిగా ప్రకటించారు శ్రీరామనవమి ఉత్సవాల్లో పట్టాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఒంటిమిట్ట చారిత్రక విశేషాలు ఇవీ..
1) ఒంటిమిట్ట కోదండ రామాలయ గోపుర నిర్మాణం చోళుల శిల్ప సంప్రదాయంలో ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో రామాలయాన్ని దర్శించారు.
"దేశంలోని దెద్ద గోపురాల్లో రామాలయ గోపురం కూడా ఒకటి" అని ట్రావెర్నియర్ కీర్తించారు.
2) ఈ ఆలయంలో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడు ఒక శిలపై విగ్రహాలు చెక్కడం వల్ల దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు.
3) ఆంధ్రా మహాభారతాన్ని రచించిన పోతన
"నేను ఏకశిలపురి వాసిని" అని ప్రకటించుకున్నారు. తాను రాసిర భాగవతాన్ని పోతనామాత్యుడు కోదండరాముడికి అంకితం ఇచ్చారనే విసయం చరిత్ర చెబుతోంది. ఆయన రాసిన భాగవతంలో వాడిన మాటలు, భాషను పరిశోధించిన పరిశోధకులు పోతన కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించాడని చెబుతున్నారు.
4) దేశంలోని రామాలయాల్లో మూలరాట్టు పాదాల చెంత హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం హనుమంతుడి విగ్రహం కనిపించదు.
5) శ్రీరామహనుమంతులు కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్షణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
6. ఒంటిమిట్ట కోదండరామాలయానికి మూడు గోపుర ద్వారాలతో పాటు ఆలయ ప్రాకారం లోపల విశాలమైన ఆవరణ కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు ఉండగా, 32 స్తంభాలతో రంగనాయకుల మండపం నిర్మించారు.
7) ఈ రంగమండపం కూడా విజయనగర శిల్పాలను తలపిస్తుంది. పొత్తపి (కడప జిల్లా) చోళులు, విజయనగరరాజులు, మట్లిరాజులు (సిద్ధవటం, కడప జిల్లా) ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని మూడు దశల్లో నిర్మించారనేది చారిత్రక ఆధార కథ.
8) ఒంటిమిట్టకు చెందిన ఆంధ్రా వాల్మీకిగా పేరు పొందిన వావిలకొలను సుబ్బారావు (1863 నుంచి 1936 మధ్య కాలంలో) ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతుంది.
ఆయన టెంకాయచిప్పతో భాక్షాటన చేయడం ద్వారా దాదాపు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చేయించడం, రామసేవా కుటీరం నిర్మించారనేందుకు ఒంటిమిట్ట వద్ద ఆధారాలు కనిపిస్తాయి.
9) పోతనా మాత్యుడి తోపాటు అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వెంకటకవి కూడా కోదండరాముడికి కవితార్చన చేశారు.
10) చోళ, విజయనగర వాస్తుశైలి కనిపించే ఈ ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత కథలు చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో అయ్యల తిప్పరాజు కూడా ఒంటిమిట్ట నివాసి, ఆయన కోదండరాముడిపై భక్తితో శ్రీరఘువీర శతకం రచించారు. ఈయన మనువడు అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. కోదండరాముడి సన్నిధిలో సహజకవి విగ్రహం కనిపిస్తుంది.
11) ఒంటిమిట్ట రామాలయం వద్ద సందర్శనీయ ప్రదేశాల్లో ఇమాంబేట్ బావి కూడా ఒకటి. ఇమాంబేగ్ 1640లో కడపను పాలించిన అబ్దుల్ నభీఖాన్ ప్రతినిధి. ఈ బావివెనుక కథనం ఉంది.
"ఒంటిమిద్ద ఆలయ దర్శనానికి వచ్చిన యాత్రికులతో పరాచికాలాడారు. మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే పలుకుతాడనేది యాత్రికుల సమాధానం. దీంతో ఇమాంఖాన్.. మూడుసార్లు రాముడిని పిలిచాడంట. ప్రతిగా ఓ.. ఓ అని సమాధానం వచ్చిందంట. దీంతో ఇమాంఖాన్ శ్రీరాముడికి భక్తుడిగా మారాడు" అనేది కథనం.
యాత్రికుల కోసం ఆలయం వద్ద ఓ బావి తవ్వించినట్లు చరిత్ర. దీంతో ఆ బావికి ఇప్పటికి ఇమాంబేగ్ బావిగా పేరు నిలిచిపోయింది.
రంగంలోకి టీటీడీ...
కడప నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయం, పరిసరాలు అభివృద్ధి చేయడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో..
"2.96 కోట్ల రూపాయలతో 1.35 ఎకరాల్లో సుందరీకరణ పనులు చేపట్టానికి అనుమతి ఇచ్చాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. హైదరాబాద్ మార్గంలోనే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి 37 కోట్ల రూపాయలతో వంద అధునాతన వసతులతో కూడిన యాత్రికుల వసతి సముదాయం కల్పించడానికి కూడా ఆమోదం తెలిపారు. జూలై్ 22వ తేదీ నిర్వహించిన టీటీడీ పాలక మండలిలో కూడా తిరుమల తరహాలో ఒంటిమిట్టలో నిత్యాన్నదానం అమలు చేయడానికి వీలుగా అన్నదాన సత్రం, వసతుల కోసం 4.35 కోట్ల రూపాయాలు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఒంటిమిట్టలో చేయాల్సిన అభివృద్దిపై ఈ సంవత్సరం ఆగష్టు 23న విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ చిలకపాటి అనిల్ కుమార్ సారధ్యంలోని బృందం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించింది.
"శ్రీకోదండరామాలయం, మాడవీధులు, రథశాల, పుష్కరిణి, భర్త సంజీవరాయస్వామి ఆలయం, మాట ఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామ, లక్షణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల్లో అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తాం" అని ప్రొఫెసర్ చిలకపాటి అనిల్ కుమార్ తెలిపారు.
చెరువులో జాంబవంతుడి విగ్రహం ఎందుకు?
పురాణ, ఇతిహాసాల చరిత్ర ఆధారంగా ఒంటిమిట్ట వద్ద జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది.
రామయణం, భాగవత కథనాల ప్రకారం జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడైన భల్లూక రాజుగా గుర్తింపు ఉంది. రామాయణ గాధలో కూడా శ్రీరాముడితో కలిసి లంకా యుద్ధంలో పోరాడిన జాంబవంతుడు శక్తియుక్తులు చాటారు. హనుమంతుడికి శక్తిని గుర్తు చేసి, సీతాదేవికి వెదకడానికి ప్రేరేపించిన మహాబలిశాలి మాత్రమే కాకుండా, వివేకవంతుడిన ప్రస్తావించారు. శ్రీకృష్ణుడికి శ్యామంతకమణితో పాటు తన కుమార్తు జాంబవతిని కూడా వివాహం చేశాడంట. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించినట్లు రామాయణం చెబుతోంది. రామాయణం ప్రకారం రాముడి పక్షాన పోరాడిన జాంబవంతుడు సుగ్రీవుడు, అంగదుడికి సాయం చేశాడు. సముద్రం దాటమని హనుమంతుడిని జాంబవంతుడు ప్రోత్సాహించినట్లు సుందరకాండలో ప్రస్తావించారు.
108 అడుగుల విగ్రహం.. మాస్టర్ ప్లాన్ ..
రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగ నిర్వహించే ఏకశిలా నగరం ఒంటిమిట్టపై టీటీడీ దృష్టి కేంద్రీకృతం చేసింది. తిరుమలకు చేరడానికి తిరుపతి జాతీయ రహదారిలోని శ్రీకోదండరామాలయం ప్రాంతం ఆకట్టుకునే విధంగానే కాకుండా యాత్రికులకు విస్తృతమైన సదుపాయాలు కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేసింది.
"ఒంటిమిట్టలో రానున్న 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్" తయారు చేయాలి" అని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
"పెరిగే యాత్రికుల సంఖ్యను అంచనా వేసి, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళిక" ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. భక్తుల కోసం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీకోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియం, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు.
ఒంటిమిట్టలో తమ బృందం పరిశీలించిన అంశాలను కూడా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయనతో సమన్వయం చేసుకుని కార్యాచరణ సిద్ధం చేయాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ టిటిడి సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ-1 మనోహరం, అధికారులకు సూచనలు చేశారు.