ఇండిగో సమస్య విమానయాన మంత్రి వైఫల్యమే..

ఇండిగో సమస్య పరిష్కారంలో విఫలమైన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.

Update: 2025-12-07 12:02 GMT

తీవ్ర సంక్షోభంలో ఉన్న విమానయానరంగ సమస్య పరిష్కారంలో సంబంధిత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌ల (ఎఫ్‌డీటీఎల్‌) అమలుతో తలెత్తిన ఇబ్బందులతో వందలాది విమాన సర్వీసులు రద్దయి లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే?

విమానయాన చరిత్రలోనే లేదు..
‘ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ సంస్థ, రెగ్యులేషన్స్‌ అమలులో తలెత్తిన పరిస్థితులతో పాటు విమానయానశాఖ వైఫల్యమే దీనికి కారణం. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రిగా ఎంపికైనప్పుడు ఈ ప్రాంతానికి మంచి అవకాశం వచ్చిందని అంతా సంతోషించాం. కానీ విమానయానరంగంలో ఏడాదిన్నరగా ఎప్పుడూ చూడని పరిస్థితులు చూస్తున్నాం. జూన్‌ 12న ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 232 మంది దుర్మరణం పాలయ్యారు. దీనిపై అప్పటికే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిపై విమర్శలొచ్చాయి. పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడకు వెళ్లి రీల్స్‌ చేశారన్న ఆరోపణలొచ్చాయి. తాజాగా ఇండిగో విమానాల సమస్యతో తలెత్తిన పరిణామాలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దేశంలో ఆరేడు లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరలేక ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్నారు. మొన్న వెయ్యి, నిన్న వెయ్యి, అంతకుముందు రోజు 500 చొప్పున ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. పైలట్ల సంఖ్య తగినంతగా లేదని తెలిసినా రూట్‌ పర్మిషన్లు ముందే ఇచ్చేసి వార్‌ రూమ్‌ పెట్టి మానిటరింగ్‌ చేస్తున్నామని చెబితే ఉపయోగం లేదు. ఒక్క విశాఖలోనే 12 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రూ.26–30 వేలు, విశాఖ–ఢిల్లీకి రూ.50 వేలు, చెన్నై–ఢిల్లీ మధ్య రూ.70 వేలు, బెంగళూరు–ముంబైలకు రూ.40 వేలు, హైదరాబాద్‌–ఢిల్లీలకు రూ.60 వేలకు టిక్కెట్ల ధరలు పెంచేశారు. ఫ్లైట్‌ కాస్ట్‌ రెగ్యులేషన్‌ లేదు. కేంద్రమంత్రి ఏం చేస్తున్నారు? ఆయన రీల్స్‌ తప్ప ఇంకేమీ చేయడం లేదు.
నియంత్రణలోనూ వైఫల్యమే..
ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌ (ఎఫ్‌డీటీఎల్‌) అనేది చాలా కీలకం. కోర్టు ఆదేశాలతో ఈ నిబంధనను తెచ్చారు. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో విమానాలు ఆలస్యం కావడం సహజం. ఈ నిబంధనలను తెచ్చినప్పుడు సిబ్బందిని పెంచి, రూట్స్‌ తగ్గించుకోవాలి. కానీ కేంద్ర మంత్రి ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. దేశంలో లక్షలాది మంది ప్రయాణికుల భద్రతను ఫణంగా పెట్టి మీరిచ్చిన నిబంధనలనే ఫణంగా పెడతారా? 2010లో దుబాయ్‌ నుంచి మంగుళూరు వచ్చిన విమానం కూలిన ఘటనలో 150 మంది మరణించారు. దానికి కారణం ఆ పైలట్‌కు తగిన విశ్రాంతి లేకపోవడమే. ఇండిగోతో మీకున్న లాలూచీ ఏమిటి? దేశంలో అన్ని విమానయాన సంస్థలూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. అందువల్ల వాటిపై నియంత్రణ లేకుండా పోయింది. ప్రస్తుతం ఇండిగో సమస్యతో టిక్కెట్ల ధరలు పది రెట్లకు పెంచేస్తే పౌర విమానయాన శాఖ ఏం చేస్తున్నట్టు? ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?
లోకేష్‌కి ఏమిటి సంబంధం?
ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేష్‌ పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. పౌర విమానయాన సంస్థకు, లోకేష్‌కు సంబంధం ఏమిటి? ఇప్పటికైనా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు రీల్స్‌ చేసుకోవడం ఆపి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను జాకీలెత్తి లేపే ప్రయత్నాలు ఆపి దేశ ప్రజల ప్రయోజనాలపై శ్రద్ధ చూపాలి. లేదంటే.. ఆ శాఖ మంత్రిగా వైఫల్యం చెందినందున కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం’ అని గుడివాడ అమర్నాథ్‌ వివరించారు.
Tags:    

Similar News