రవాణా నిలిపేస్తాం

కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీజుల పెంపు అమలును నిలిపివేయాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది.

Update: 2025-12-07 10:27 GMT

కేంద్రంపై లారీ ఓనర్స్ అసోసియేషన్ మండిపడింది. 13 ఏళ్లు దాటిన పాత వాహనాలకు టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పెంపుదల సరకు రవాణా యజమానులపై పెనుభారం మోపుతుందని పేర్కొంటూ, కేంద్ర నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. దీనికి నిరసనగా రవాణా నిలిపివేతకు నిర్ణయించినట్లు తెలిపింది. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీజుల పెంపు అమలును నిలిపివేయాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను నెరవేర్చని పక్షంలో మంగళవారం అర్ధరాత్రి (డిసెంబర్ 9) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరకు రవాణా సేవలను నిలిపివేస్తామని ప్రకటించింది. ఒక వేళ అదే జరిగితే.. రైల్వే షెడ్లు, షిప్‌ యార్డుల్లో గూడ్స్‌ రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని వల్ల సుమారు 10 వేల గూడ్స్‌ లారీలు నిలిచిపోయే అవకాశం ఉంది. 

లారీ యజమానుల ప్రధాన డిమాండ్లు

లారీ ఓనర్ల సంఘం తరఫున ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిలోని ప్రధాన అంశాలు:

  1. ఫీజుల పెంపు నిలిపివేత: 13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజులను కేంద్రం భారీగా పెంచడం సరికాదని, ఈ అదనపు ఛార్జీల పెంపు నోటిఫికేషన్‌ అమలును నిలిపివేయాలి.

  2. సీఎం జోక్యం: ఈ నోటిఫికేషన్ అమలును నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఫీజులు తగ్గించేలా ముఖ్యమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  3. VLTDS మినహాయింపు: గూడ్స్‌ వాహనాలకు వీఎల్‌టీడీ (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్) లను అమర్చాల్సిన అవసరం లేదని, దీని నుంచి లారీలను మినహాయించాలని డిమాండ్ చేశారు.

  4. భారం తగ్గించాలి: లారీ యజమానులపై భారం పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం తాజా నిర్ణయం వలన ఆర్థిక భారం పెరిగి, లారీ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 అర్ధరాత్రిలోపు ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన రాకపోతే, సరకు రవాణా రంగంలో స్తంభన తప్పదని వారు హెచ్చరించారు.

Tags:    

Similar News