మహిళలు తమ అందాల జుట్టును క్యాన్సర్ రోగుల కోసం త్యాగం చేస్తున్నారు. జడ నుంచి 14 ఇంచుల పొడవు వెంట్రుకలు కత్తిచించి రోగులకు విగ్గులు ( Wigs )తయారీ కోసం అందిస్తున్నారు. మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ సంస్థ ద్వారా ఇప్పటికి 74 మంది మహిళలు జట్టును విరాళంగా అందించారు.
రోగికి క్యాన్సర్ నాలుగో దశకు చేరాక, జట్టు ఊడిపోతుంది. ఆ సమయంలో రోగులు ఆత్మన్యూనతకు గురికాకుండా, దాతలైన మహిళలు అందించిన జుట్టుతో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా తయారు చేసిన సుమారు రూ.30 వేల విలువైన విగ్గును అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) మదనపల్లి కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్,శానిటరి ప్యాడ్ బ్యాంక్స్,బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో "హెల్పింగ్ మైండ్స్ ( Helping Minds) " సంస్థ పనిచేస్తోంది. క్యాన్సర్ బాధితులకు మానసికంగా తోడుగా ఉండాలని రెండేళ్ల నుంచి హెయిర్ డోనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన భార్య అర్షియా కూడా సంపూర్ణ సహకారం అందించి, కేశాలు దానం చేశారని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు.
ఇదీ ప్రేరణ
హైదరాబాద్ లో రెండేళ్ల కిందట ఓ విద్యార్థినికి క్యాన్సర్ సోకింది. కీమోథెరపీ చేయించుకోవడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోయాయి. సహచర విద్యార్థులు ఎగతాళి చేయడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనే మమ్మలిని కదిలించిందని హెల్పింగ్ మైండ్స్ నిర్వాహకుడు అబూబక్కర్ సిద్దిక్ గుర్తు చేశాడు.
"ఆ పరిస్థితి ఇంకెవరికీ ఎదురు కాకూడద. అందుకే మహిళల తలవెంట్రుకలు విరాళంగా సేకరిస్తున్నాం" అని సిద్ధిక్ చెప్పారు ఈ తలనీలాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న "హోప్ ఫర్ లైఫ్" సంస్థకు అందిస్తున్నట్లు చెప్పారు.
"నా భార్య అర్షియా బేగం ఆదివారం తన జడ నుంచి 14 ఇంచులు పొడవు ఉన్న తల వెంట్రుకలు విరాళంగా అందించారు. దీంతో క్యాన్సర్ రోగుల కోసం ఇప్పటి వరకు తలవెంట్రుకలు అందించిన వారి సంఖ్య 74కు చేరింది" అని సిద్ధిక్ వివరించారు. ఈ కేశాలతో క్యాన్సర్ భాదితులకు తమ సంస్థ ద్వారా ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని వివరించారు.
"క్యాన్సర్ రోగుల కోసం డబ్బు ఇవ్వలేకపోవచ్చు. మా వెంట్రుకలు విక్రయించి, రోగులకు వైద్యం చేయించమని సహకారం అందిస్తున్నాం" అని అర్షియా బేగం చెప్పారు. చిన్నపాటి జడ వేసుకున్న ఏమి నష్టం లేదు. మళ్లీ పెరుగుతాయి. క్యాన్సర్ రోగుల కోసం ఆమాత్రం త్యాగం చేయడం నా వంతు కర్తవ్యంగా భావించానని అర్షియా చెప్పారు. తన భర్త అబూబక్కర్ సిద్దిక్ హెల్పింగ్ మైండ్స్ సంస్థకు సహకారం అందించడం అనేది కూడా నా బాధ్యత అని ఆమె చెప్పారు.
ఈ ఏడాది జూన్ 14వ తేదీ 22వ వార్డు కౌన్సిలర్ ముబీనా కూతురు అర్ఫా అంజూమ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు చెందిన రేనా, నిమ్మనపల్లెకు చెందిన పావని హెయిర్ డొనేషన్ చేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన వారందరికీ ప్రశంసాపత్రం తో పాటు పూల మొక్క బహుకరించడం ద్వారా హెల్పింగ్ మైండ్స్ బృందం శుభాకాంక్షలు తెలిపింది.
తలనీలాల విలువ..
తలనీలాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన ధర ఉంది. అందుకు నిదర్శనం టీటీడీ (Tirumala Tirupati Devasthanams TTD)కి సంవత్సరానికి తలనీలాల విక్రయం ద్వారా మాత్రమే దాదాపు 120 కోట్ల నుంచి 176 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 176.5 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేశారు. ఇందులో మూడు రకాల గ్రేడింగ్ లు ఉంటాయి. తలవెంట్రుకల పొడవు 16, 18, ఐదు నుంచి ఆధారంగా ఎనిమిది నుంచి 18 ఇంచుల వరకు ధర ఎక్కువే. తలనీలాల పొడవు 14 అండుళాలు ఉంటే విగ్గులు, లేదా ఎయిర్ ఎక్స్ టెన్సన్ కోసం వినియోగిస్తారు. మార్కెట్ లో ఈ వెంట్రుకల విలువ రూ. 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది.
బాధితులకు విగ్గులు
మదనపల్లె ప్రాంతంలో మహిళల నుంచి విరాళంగా సేకరిస్తున్న తల వెంట్రుకలు హైదరాబాద్ లోని హోప్ ఫర్ లైఫ్ సంస్థకు అందిస్తున్నారు. ఒక విగ్గు తయారు చేయడానికి 18 ఇంచుల పొడవు ఉండే ఐదుగురి నుంచి సేకరించిన కేశాలు అవసరం అవుతాయి. అంటే ఓ మహిళ తన అందమైన వెంట్రుకల్లో 500 గ్రాముల పైగానే విరాళంగా సమర్పించడం ద్వారా క్యాన్సర్ రోగుల మానసిక స్థైర్యం తోపాటు ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేయడంలో సహకారం అందిస్తున్నారు.
మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ఏమంటారంటే..
"రెండేళ్ల కిందట హైదరాబాద్ లో జరిగిన సంఘటన కదిలించింది. కీమోథెరపీ (Chemotherapy) వల్ల వెంట్రుకల రాలిపోయిన వారికి విగ్గులు అందించాలని సంకల్పించి మహిళల నుంచి తల వెంట్రుకలు ఇవ్వాలనే సూచనకు మంచి స్పందన లభిస్తోంది" అని సిద్ధిక్ చెప్పారు. దాతల నుంచి విరాళంగా తీసుకుంటున్న వెంట్రుకలు హైదరాబాద్ లోని హోప్ ఫర్ లైఫ్ ( Hope for Life) సంస్థ నిర్వాహకులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"హైదరాబాద్ లోని హోప్ ఫర్ లైఫ్ సంస్థ ఆ వెంట్రుకలు ఓ ఆస్పత్రికి అందించే వారు. క్యాన్సర్ రోగులకు అవసరమై విగ్గులు ఇవ్వాలని కోరితూ సవాలక్ష ప్రశ్నలతో సకాలంలో అందించకుండా జాప్యం చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయంగా సంస్థలోనే విగ్గులు తయారు చేస్తున్నారని సిద్ధిక్ వివరించారు.
ఓ విగ్గు రూ. 70 వేలు
బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వెంట్రుకలతో తయారు చేసిన విగ్గు కొనుగోలు చేయాలంటే కనీసంగా అంటే రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు పలుకుతోంది. క్యాన్సర్ రోగులుకు ఉచితంగా ఈ తరహా సదుపాయం అందించడానికి శ్రద్ధ తీసుకుంటున్నామని సిద్ధిక్ చెప్పారు.
"మదనపల్లె ప్రాంతంలో ఐదుగురికి తమ సంస్థ ద్వారా విగ్గులు అందించి, వారిలో స్థైర్యం నింపిన ఆత్మసంతృప్తి మిగిలింది" అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆధార్ నంబర్ నమోదు చేసుకోవడం ద్వారా రోగులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. విగ్గు అవసరమైన రోగులు తమను సంప్రదించగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ లోని సంస్థ నిర్వాహకులు బాధితురాలి తల చూపించడం ద్వారా విగ్గు తయారు చేయిస్తున్నట్లు సిద్ధక్ వివరించారు.
మదనపల్లె కేంద్రంగా పనిచేస్తున్న హెల్పింగ్ మైండ్స్ ద్వారా సామాజికసేవ కార్యక్రమాల నిర్వహణలో యువకుడైన సిద్ధిక్ అందిస్తున్న సేవలకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రోగులకు అత్యవసర వైద్య సేవల కోసం మదనపల్లెలోని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ కు దాతల నుంచి సేకరించిన రక్తం నిలువలు కూడా అందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అవసరమైనప్పుడు తమ సంస్థలోని సభ్యులను పంపించడం ద్వారా అవసరమైన రక్తం దానం చేయించి, ప్రాణాలు నిలుపుతున్నట్లు చెప్పారు.
మదనపల్లె కేంద్రంగా పనిచేస్తున్న హెల్పింగ్ మైండ్స్ ద్వారా సామాజికసేవ కార్యక్రమాల నిర్వహణలో యువకుడైన సిద్ధిక్ అందిస్తున్న సేవలకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రోగులకు అత్యవసర వైద్య సేవల కోసం మదనపల్లెలోని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ కు దాతల నుంచి సేకరించిన రక్తం నిలువలు కూడా అందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అవసరమైనప్పుడు తమ సంస్థలోని సభ్యులను పంపించడం ద్వారా అవసరమైన రక్తం దానం చేయించి, ప్రాణాలు నిలుపుతున్నట్లు చెప్పారు.
పేదల కోసం...
పట్టణంలో పేదల కోసం ఆర్టీసీ బస్టాండ్ తోపాటు రెండు మూడు చోట్ల ఫుడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరి ఇంట అయినా శుభకార్యాలు జరిగితే అన్నం వృథా కానివ్వరు. ఆ ఆహార పదార్థాలు సేకరించి, పాకెట్లలో నింపి, ఫుడ్ బ్యాంకులోని ర్యాక్ లో అమరుస్తుంటారు. అవసరమైన వారు డిగ్నిఫైడ్ గా వచ్చి ఆ పొట్లాలు తీసుకుని వెళ్లడం మదనపల్లెలో కనిపిస్తుంది.
వీటితో పాటు అనాథాలు ఎవరూ లేరని కూడా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు చెబుతుంటారు. చనిపోయిన వారి మృతదేహాలను వారి సంప్రదాయానికి అనుగుణంగా ఖననం చేయడం ద్వారా వారికి మేమున్నాం అని కూడా చాటిచెబుతున్న సంఘటనలు పట్టణంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.