ఆరుతడి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో కంది సాగవుతోందని, దాదాపు 1,60,000 టన్నుల కంది ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
By : The Federal
Update: 2025-12-24 10:42 GMT
కంది పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందుకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆరుతడి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా మాట్లాడుతూ కందులు, పెసలు, మినుములు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వ్రాసిన ఉత్తరానికి స్పందించి, కేంద్ర ప్రభుత్వం కందుల కొనుగోలుకు ముందుకు రావడం అభినందనీయం అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 40 వేల టన్నుల కందుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో కంది సాగు జరగగా, దాదాపు 1,60,000 టన్నుల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుత నిర్ణయం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కంది ఉత్పాదనలో సుమారు 25 శాతం మాత్రమే కొనుగోలు జరిగే పరిస్థితి ఉంటుందని అన్నారు. ఇది ఒక ఆరంభమే అయినప్పటికీ, 40, 000 టన్నుల కొనుగోలు తర్వాత కూడా మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగకపోతే మరింత కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం కోస్తా ప్రాంతంలో పండిన "వరి" పంటను పూర్తిగా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్టుగానే, రాయలసీమలో మొక్కజొన్న, శనగ, కంది, మినుము, పెసలు, జొన్నలు, చిరుధాన్యాలు సహా అన్ని ఆరుతడి పంటలను కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్న సందర్భంలో, ఆరుతడి పంటలకు కనీస మద్దతు ధర హామీ ఇవ్వడం అత్యవసరం.. రైతులు వరి నుండి ఆరుతడి వైపు మళ్లాలంటే, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా లభిస్తుందనే నమ్మకం కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో పండించిన మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే సుమారు ₹600 తక్కువ ధరకు అమ్ముడవుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించలేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అలాగే రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వేలాది టన్నుల శనగలు గోడౌన్లలో నిల్వ ఉండిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇంత నిలవలు ఉన్నా ఈ పంటలను కనీస మద్దతు ధరకు కొనే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వెల్లబుచ్చారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఇప్పటికైనా ఈ పంటలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలపాలని కోరారు.
కేవలం ప్రకటనలతో కాలయాపన చేయకుండా, సరైన సమయంలో, అవసరమైనంత పరిమాణంలో అన్ని ఆరుతడి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలి అని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు యర్రం శంకర రెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.