మదనపల్లె: నిందితులను పట్టిచ్చిన 'పచ్చబొట్టు'

ఓ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. రోజుల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఏమి చెప్పారంటే..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-19 13:47 GMT

పచ్చబొట్టు చెరిగిపోదనేది వాస్తవం. ఆ ఆనవాళ్లే హత్యకు గురైన మహిళ ఆచూకీ తెలిసింది. ఆమెను హత్య చేసిన ముగ్గురు సమీప బంధువును పోలీసులకు పట్టించింది.

మదనపల్లె డివిజన్ రామసముద్రం మండలంలో ఓ మహిళ కాళ్లు చేతులు కట్టేశారు. ఆ తరువాత పెట్రోల్ పోసి, కాల్చి చంపేశారు. ఆ మహిళ కుడిచేతిపై ఉన్న పచ్చబొట్టులో "ఎస్" అనే అక్షరం మాత్రమే కనిపిస్తోంది. ఇది మినహా, మరో ఆధారం లభించలేదు. ఆ పచ్చబొట్టు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను కటకటాల వెనక్కి పంపించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ రామసముద్రం మండలం చంబకూరు వద్ద సరిగ్గా వారం కిందట ఓ మహిళ శవం కలకలం రేపింది. ఆ మహిళ మృతదేహం వద్ద ఇలాంటి వస్తువులు లేవు. చేతికి గాజులు అలాగే ఉన్నాయి. ఒక చేతి పై ఎస్ అనే అక్షరంతో పేరు ఉంది. గుర్తు తెలియని మహిళ హత్యకు గురింది అనే సమాచారం తెలుసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. వీఆర్వో అనూష ఫిర్యాదు మేరకు రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఈనెల 12వ తేదీ క్రైమ్ నెంబర్ 45/ 25 U/S 103 (1), 238 r/w 3(5) యాక్ట్ ప్రకారం రామసముద్రం ఎస్సై జి రవికుమార్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు కోసం మదనపల్లి రూరల్ సిఐ ఏ సత్యనారాయణ తో కలిసి డిఎస్పి ఎస్. మహేంద్ర రంగం లోకి దిగారు. డాగ్ స్క్వాడ్ తోపాటు సాంకేతిక ఆధారాలను ఉపయోగించి, నిందితులను పట్టుకునేందుకు రంగంలో దిగారు.
"గుర్తు తెలియని మహిళ మృతదేహం ఫొటోలు, ఆమె చేతి పై ఉన్న పచ్చబొట్టు వివరాలను వాట్సాప్ ద్వారా వెల్లడించాం" అని DSP మహేష్ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఆ ఫోటోలు చూసి..
"నా భార్య మూడు రోజులుగా కనిపించడం లేదు. ఆమె చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉంది" బూసిపల్లెకు చెందిన వెంకటరమణ స్టేషన్కు వచ్చి చెప్పారని డిఎస్పి వివరించారు.
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో కూడా ఆ మహిళ మృతదేహం చేతిపై ఉన్న పచ్చబొట్టులో యస్మిత అనే పేరు స్పష్టంగా కనిపించింది. దీంతో హత్యకు గురైన మహిళను గుర్తించగలిగాం అని డిఎస్పి స్పష్టం చేశారు.  ఆధారాలతోనే దర్యాప్తు చేసి,
ముగ్గురి అరెస్ట్ 
మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీ జంగాలపల్లె కు చెందిన వెంకటరమణ హత్యకు గురైన మహిళ తన భార్య అని గుర్తించారు. దీంతో తమ సిబ్బంది సాంకేతిక అంశాల ఆధారంగా దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు చెప్పారు.
హత్యకు గురైన మహిళ భూషపల్లి శివమ్మ (యస్మిత) భర్తను కాదని మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మ కాలనీ చెందిన సంతోష్ తో వెళ్ళిపోయింది. దీంతో కక్షపెంచుకున్న వేంపల్లి పంచాయతీ జంగాలపల్లెకు చెందిన ఎం నీలావతి 37), రామసముద్రం మండలం నడింపల్లి పంచాయతీ గండేవారిపల్లెకు చెందిన కన్నెమడుగు గణేష్ (25), బెంగళూరులోని సజ్జాపురం బి హోసహళ్లికి అంబేద్కర్ కాలనీలో ఉంటున్న హెచ్.పీ. గోపాల్ (42) శివమ్మను హత్య చేసినట్లు గుర్తించి, అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు.
పోలీసుల విచారణలో శివమ్మ (యస్మిత) ను ఎలా హత్య చేశారో వివరించారని చెప్పారు. శివమ్మ కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి, గొంతుకు తాడు బిగించి చంపేశామని అంగీకరించారన్నారు. ఆ తర్వాత శివమ్మ మృతదేహాన్ని ఊరు బయటికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆధారాలు లేకుండా చేశామని దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ వివరించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా వివాహిత మహిళను హత్య చేసిన దుండగులను వారం కూడా తిరగముందే టెక్నికల్ టీం, డాగ్ స్క్వాడ్ సహకారంతో రోజుల వ్యవధిలోనే కేసును చేదించినట్లు ఎస్పి చెప్పారు.

"శిక్షణలో ఉండగా తనకు ఇదే తరహా కేసు ఒకటి వచ్చింది. ఆ అనుభవంనేర్పిన పాఠంతో రామసముద్రం ఎస్సై తో పాటు సహచర పోలీసు సిబ్బందితో కలిసి మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించగలిగాం" అని మదనపల్లి డిఎస్పి ఎస్. మహేంద్ర చెప్పారు.


Similar News