కుప్పం: 'గంగజాతర'కు సీఎం రాక.. ఏమి ప్రార్ధిస్తారు?
గంగమాంబ జాతరకు సీఎం చంద్రబాబు బుధవారం మొదటిసారి రాన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం వెనుక కారణం ఏమిటి?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-21 07:21 GMT
కుప్పం పట్టణంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా సీఎం ఎన్. చంద్రబాబు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా సీఎం ఎన్. చంద్రబాబు పనితీరు కనబరుస్తున్నారు. జిల్లాల పర్యటనలో సామాన్యులను కూడా స్వయంగా కలుస్తున్నారు. హంగూ ఆర్భాటం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎనిమిది సార్లు ఎన్. చంద్రబాబు విజయం సాధించారు. సీఎం అయ్యారు. ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ మాత్రమే కుప్పంలోని గంగమాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయినా, ఆయన మార్గమధ్యలో వెళుతూ అమ్మవారికి నమస్కరించే వారని అంటారు. ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు స్వయంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం వెనుక కారణం ఉందనేది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నా మాటలు.
ఆలయంలో అర్ధగంట పూజలు
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబకు మొదటిసారి సీఎం ఎన్. చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయానికి చేరుకనే ఆయన అర్ధగంట పాటు ఆలయంలో అమ్మవారికి పూజలు అందిస్తారు. ఆమేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , ఎస్పీ మణికంఠ చందోలు భద్రతా ఏర్పాట్లు చేశారు.
వజ్రకిరీటంతో దర్శనం
కుప్పంలో ఈ నెల 14వ తేదీ ప్రారంభమైన జాతరలో శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబను బుధవారం వజ్రకిరీటంతో అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనానికి భక్తులు పోటెత్తిన భద్రతా చర్యల్లో భాగంగా క్రమబద్ధీకరిస్తున్నారు. రాత్రి తొమ్మది నుంచి 11 గంటల వరకు అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆమ్మవారి విగ్రహాన్ని జలధిలో నిమజ్జనం చేస్తారు. కాగా, సీఎం చంద్రబాబు రాక నేపథ్యం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
పర్యటన ఇలా..
కుప్పం నియోజకవర్గంలో సీఎం ఎన్. చంద్రబాబు పర్యటన ఇలా సాగుతుంది.
విజయవాడ విమానాశ్రయం నుంచి బుధవారం సీఎం చంద్రబాబు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ బయలుదేరుతారు.
గుడుపల్లె మండలంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో
12.50 గంటలకు కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం చేరుకుంటారు. జాతర వేడుకలలో పాల్గొంటారు. అంతకుముందు ఆయన పట్టువస్త్రాలు తీసుకుని వచ్చి, పూజారుల ద్వారా అమ్మవారికి సమర్పిస్తారు. ఆలయంలో పూజల తరువాత
మధ్యాహ్నం 1.40 గంటలకు రోడ్డు మార్గంలో ద్రవిడ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. 2.30 గంటలకు హెలికాప్టర్ లో బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి విజయవాడకు తిరిగి వెళతారు.
ఏమని ప్రార్థిస్తారు?
స్వతహాగా పల్లెలో (నారావారిపల్లె) పుట్టిన సీఎం చంద్రబాబుకు ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తారు. సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వచ్చినా, గ్రామ దేవతలకు పూజలు చేయడం, పెద్దలకు తర్పణం వదలడం అనేది ఆయన పాటించే పద్ధతులు.
కుప్పంలో గంగమాంబకు పూజలు చేయడం, పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న సీఎం చంద్రబాబు ఏమని ప్రార్థిస్తారు?
రాజకీయ సవాళ్ళను సునాయాసంగా అధిగమించడానికి శక్తి ప్రసాదించమని కోరతారా? కడపలో జరిగే మహానాడు ద్వారా పార్టీ మరింతగా రాయలసీమ బలపడాలని కోరుకుంటారా? రాజకీయ శత్రువు మరింత బలహీనం చేసి, పార్టీ శ్రేణులకు స్థైర్యం ప్రసాదించమని సీఎం చంద్రబాబు వేడుకుంటారా? మహానాడుకు ముందే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందనేది పార్టీ వర్గాల సమాచారం. ఈ పర్యటనతో పాటు కడపలో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవాలనే సీఎం చంద్రబాబు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం.