YS JAGAN|నాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించిన జగన్

వీరజవాన్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని జగన్ అభినందించారు. తమ ప్రభుత్వంలో అమలు చేసిన విధానం కొనసాగించడం అభినందనీయం అన్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-13 09:04 GMT
కల్లి తండలోని వీరజవాన్ నాయక్ తండ్రిని ఓదారుస్తున్న వైఎస్. జగన్

కాశ్మీర్ యుద్ధభూమిలో వీరమరణం చెందిన మురళీనాయక్ కుటుంబానికి వైఎస్. జగన్ 25 లక్షల రూపాయలు ఆర్థికసాయం ప్రకటించారు.  

గోరంట్ల మండలం కల్లి తండకు మంగళవారం మధ్యాహ్నం చేరుకున్న మాజీ సీఎం జగన్ మొదట మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తరువాత వారి ఇంటిలోకి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. మురళీనాయక్ తల్లిదండ్రులను జగన్ పరామర్శించారు.

రోడ్డు మార్గంలో రాక
బెంగళూరు నుంచి వైఎస్. జగన్ రోడ్డుమార్గంలో గోరంట్ల మండలం కల్లి తండాకు మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్. జగన్ చేరుకున్నారు. జగన్ రాకతో తండ వైసీపీ నేతలు, కార్యకర్లలతో కిక్కిరిసింది. కల్లి తండలోని మురళీ నాయక్ ఇంటికి మధ్యాహ్నం చేరిన జగన్ అర్ధగంట పాటు వారి నివాసంలో గడిపారు. నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చారు. నాయక్ నివాసంలోకి వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
ప్రభుత్వానికి అభినందన

వీరజవాన్ కుటుంబాన్ని పరార్శించిన తరువాత వైఎస్. జగన్ మీడియాతో మాట్లాడారు.
"యుద్ధభూమిలో వీరమరణం చెందిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు పరిహారం ప్రకటించడం అభినందనీయం" అని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
"దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కుటుంబానికి తమ ప్రభుత్వ కాలంలోనే రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించి, అమలు చేశాం" అని జగన్ గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు.
"వీరజవాన్ త్యాగం నిరుపమానం. వయసులో చిన్నవయసులో దేశం కోసం బలిదానం చేశారు" అని మురళీ నాయక్ కు వైఎస్. జగన్ నివాళులర్పించారు.
"రాష్ట్ర ప్రజలు ప్రధానంగా, యువతకు మురళీ నాయక్ త్యాగం స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి పార్టీ పక్షాన అండగా ఉంటాం. ఆదుకుంటాం" అని జగన్ హామీ ఇచ్చారు.
మురళీ సెల్యూట్ చేయ్..
కల్లి తండలో విషాదం తాండవిస్తూనే ఉంది. మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న పార్టీలు, సంఘాల నాయకులతో రద్దీగా మారింది. నాయక్ తల్లితండ్రులు జ్యోతి బాయి, శ్రీరాం నాయక్ కన్నీటి ధారలు ఆగడం లేదు.
మాజీ సీఎం వైఎస్. జగన్ రావడంతో కల్లి తండలోని నాయక్ తల్లిదండ్రులు భోరుమని విలపిస్తూ కాళ్లపై పడ్డారు. నాయక్ చిత్రపటానికి జగన్ నివాళులర్పించే సమయంలో..
మురళీ సార్ వచ్చాడురా.. సెల్యూట్ చేయ్ అంటూ శ్రీరాం నాయక్ చెప్పడం అక్కడ ఉన్న వారందరినీ కన్నీటి పర్యంతం చేసింది. శ్రీరాం నాయక్ ను ఆలింగనం చేసుకున్న జగన్ ఓదార్చారు. నాయక్ తల్లిదండ్రులతో జగన్ చాలా సేపు మాట్లాడారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా నిలిచి, ఆదుకుంటామని వారిని ఓదార్చారు.

Similar News