ISRO: రిశాట్-1బీ కీలక ప్రయోగం 18న

ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల, శ్రీకాళహస్తీశ్వరుడి పాదాల చెంత నమూనా రాకెట్ ఉంచారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్ధించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-16 09:21 GMT

సైనిక దళాలకు ఉపయోగపడే పీఎస్ఎల్వీ సీ61 (రిశాట్-1బీ ) ఉపగ్రహ వాహకనౌక ఆదివారం వేకువజామున నింగిలోకి దూసుకుపోనున్నది. ఈ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో శాస్ర్తవేత్తలు ఆలయాల్లో శుక్రవారం పూజలు నిర్వహించారు.

"ఈ ఉపగ్రహం విజయవంతం కావాలి" అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ సారధ్యంలోని శాస్ర్తవేత్తలు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉపగ్రహ వాహకనౌక నమూనాను శ్రీవారు, శ్రీకాళహస్తీశ్వరుడి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు.

శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగకేంద్రంలో ప్రయోగానికి ముందు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయం సన్నిధిలో కూడా పూజలు చేయడం ఆచారంగా పాటిస్తున్నారు.
"సూళ్లూరుపేట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో 1962లో ప్రయోగాలు ప్రారంభించాం. ఇక్కడి నుంచి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 63వ పీఎస్ఎల్వీ తరహా రాకెట్ ప్రయోగించనున్నాం" అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తిరుమలలో చెప్పారు.
అంతకుముందు చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ఇతర దేశాలతో పోటీ కాదు. దేశ భద్రత, ప్రజల అవసరాల తీర్చే అంశాలే ప్రధాన లక్ష్యంగా ప్రయోగాలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సూళ్లూరుపేట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్న మొదటి రాకెట్. రాకెట్ ప్రయోగాలు ప్రారంభించిన తరువాత గత ఏడాదికే వంద రాకెట్లు ప్రయోగించిన ఘనత షార్ సాధించింది.
శనివారం కౌంట్ డౌన్ ప్రారంభం

షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 6.59 గంటలకు ప్రయోగించాలని ముహూర్తం నిర్ణయించారు. దీనికోసం శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. 22 గంటలపాటు నిరంతరాంగా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? లోపాలు ఉన్నాయా? అనే విషయాలను గమనించడానికి శాస్త్రవేత్తలు కళ్లలో ఒత్తులు వేసుకుని షార్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తారు. అనుకున్న సమయానికి ఈ ప్రయోగం సఫలం కావడానికి అనుగుణంగా సాంకేతింగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు.
రిశాట్-1బీ ప్రయోజనం ఏమిటి?
సూళ్లూరుపేట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగేందుకు వీలుగా తయారు చేసిన షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ శాటిలైట్ ఈ నెల 18వ తేదీ ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహకనౌకను ప్రయోగించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం 'రీశాట్-1బీ'ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేస్తున్నారు.
ప్రత్యేకతలు
ఈ రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన (హై-రిజల్యూషన్) చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. అని శాస్ర్తవేత్తలు వివరిస్తున్నారు.
దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించగలదని చెప్పారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
" శ్రీహరికోట 101వ రాకెట్ ప్రయోగించనున్నాం. ఇది విజయవంతం కావాలని పూజలు చేశాం" అని నారాయణన్ చెప్పారు. భూమిపై పరిశోధన ప్రధాన లక్ష్యంగా తయారు చేసిన పీఎస్ఎల్వీ సి61 రాకెట్ శాటిలైట్ గగనతలంలోకి తీసుకెళ్లనుందని వివరించారు.

Similar News