ఎస్ఎల్బీసీ పూర్తిచరిత్ర ఇదేనా ?
రు. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం 1982 జూలై 23వ తేదీన జీవో కూడా జారీచేసింది;
శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్.. క్లుప్తంగా ఎస్ఎల్బీసీ అని పిలుస్తున్న భారీ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంతో రాష్ట్రప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదాల నివారణకు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగంలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సొరంగంలో పనులుచేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు లేవని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) 10 రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకనే పనులుమొదలయ్యాయి. పనులు మొదలైన నాలుగురోజుల్లో ప్రమాదం జరగటమే ఆశ్చర్యంగా ఉంది. మరి జీఎస్ఐ ముందుగా ఏమి సర్వేచేసిందన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. సొరంగంపనుల్లో ప్రమాదం జరగటం ఇదే మొదటసారి కాదు. గతంలో కూడా జరిగింది. ప్రాజెక్టును మొదటినుండి వివాదాలు, ప్రమాదాలు వెంటాడుతునే ఉన్నాయి.
అసలు ప్రాజెక్టు చరిత్ర ఏమిటంటే శ్రీశైలం(SLBC) నదినుండి ఎడమగట్టుకాలువ ద్వారా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 4.5లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యిగ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిందే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్(YSR) హయాంలో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు లభించి 2006లో పనులకు శంకుస్ధాపన్ జరిగింది. మొదటినుండి ప్రాజెక్టును సమస్యలు వెంటాడుతున్నాయి కాబట్టే పనులు మొదలై దాదాపు 20 ఏళ్ళయినా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తికాలేదు. శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుండి నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండి వరకు సుమారు 44 కిలోమీటర్లు సొరంగం(టన్నెల్) తవ్వాలి. ఈ టన్నెల్ ను అధికారులు రెండురకాలుగా వర్గీకరించారు. అవేమిటంటే ఇన్ లెట్ టన్నెల్, ఔట్ లెట్ టన్నెల్. ఇందులో భాగంగానే రిజర్వాయర్ నుండి నీటిని తీసుకునే ప్రాంతంనుండి మొదలుపెట్టిన ఇన్ లెట్ టన్నెల్ 19.500 కిలోమీటర్ల పొడవుంది. ఇందులో ఇప్పటికి 13.935 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. ఇంకా పూర్తవ్వాల్సిన టన్నెల్ 6.015 కిలోమీటర్లుంది.
పనులు 20 ఏళ్ళక్రితమే మొదలైనా అప్పుడప్పుడు టన్నెల్ పై భాగంలో పెచ్చులూడిపోవటం, వరదలు, బురద పేరుకుపోతుండటం లాంటి అనేక కారణాలతో పనులు జరగాల్సినంత వేగంగ జరగటంలేదు. దీంతోనే ప్రాజెక్టుపనులు 20 ఏళ్ళుగా కొనసా............గుతునే ఉన్నాయి. రిజర్వాయర్ ప్రాంతంలో సొరంగం తవ్వతున్నారు కాబట్టి తరచూ పైనుండి ఊడిపడుతున్న మట్టిపెళ్ళలను ఎప్పటికప్పుడు తీసేయటం, నీటి ఊటను తోడేస్తునే ఉన్నారు. మట్టిపెళ్ళలు ఊడటం, నీటిఊటతో పనులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకనే ఇంజనీర్లు రాళ్ళుపడకుండా, నీటిఊట వల్ల ఇబ్బందులు ఎదరవ్వకుండా సిమెంట, పాలియురేథిన్ తో గ్రౌటింగ్ చేయించారు.
ఇంజనీర్లు చేయించిన పనులతో పాటు సొరంగం పై భాగాన్ని జీఎస్ఐ క్షుణ్ణంగా పరిశీలించింది. పనులకు ఎలాంటి ఇబ్బందులుండవని జీఎస్ఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఇంజనీర్లు నాలుగురోజుల క్రితం పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టిన నాలుగోరోజే టన్నెల్ పైనుండి సుమారు వందమీటర్లు అంటే 300 అడుగుల మేర పై కప్పుకూలిపోవటంతోనే పెద్ద ప్రమాదం సంభవించింది. టన్నెల్ పనులకు సంబంధించి 14వ కిలోమీటర్ నుండి 19.500 కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతంలో ఊటనీరు ఎక్కువగా వస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు టన్నెల్ కాంటూరు లెవల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయని ఇంజనీర్లు రిపోర్టు ఇచ్చారు. ఇదేసమయంలో సొరంగం పై భాగంలో గ్రానైట్, రాతిశిలలకన్నా మట్టి, సన్నరాళ్ళే ఎక్కువగా ఉన్నాయని కూడా ఇజనీర్లు మొదటినుండి చెబుతునే ఉన్నారు. తవ్వకంపనులు మొదలుకాగానే పై నుండి చిన్నరాళ్ళు, మట్టి ఎక్కువగా పడుతోందన్న విషయాన్ని ఇంజనీర్లు తమ రిపోర్టులో చెప్పారు.
పనులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండ ఎప్పటికప్పుడు పై కప్పుకు గ్రౌటింగ్ చేస్తున్నా కప్పును బలంగా ఉంచలేకపోతున్నదని సమాచారం. ఈ కారణంగానే శనివారంఉదయం భారీప్రమాదంజరిగింది. పనులు జరుగుతున్నపుడు యంత్రాలు తరచూ చెడిపోతుండటంతో రిపేర్లు చేయించాలన్నా, స్పేర్ పార్టులు తెప్పించాలన్న విదేశాల నుండి రావాల్సిందే. అందుకనే పనులు జరగటంలో బాగా ఆలస్యమవుతోంది. ఇలాంటి కారణాలతోనే ఐదేళ్ళక్రితం నిలిచిపోయిన పనులు నాలుగురోజుల క్రితమే మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణపనులకు అతిపెద్ద శాపం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) పదేళ్ళలో ప్రాజెక్టుపనులు పెద్దగా జరగలేదు. పనులు చేయకపోగా కేసీఆర్(KCR) ఈ ప్రాజెక్టుపై ఆనేక ఆరోపణలతోనే కాలంవెళ్ళదీశారు. కృష్ణాజలాల్లో 45టీఎంసీల నీటిని ఎస్ఎల్బీసీ కింద ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేన్మేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) కి లేఖరాసింది. అనుమత సంగతి ఏమైందో తెలీదుకాని సడెన్ గా నీటిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మళ్ళించింది. వివిధ కారణాలతో ప్రాజెక్టును పూర్తిచేయటంలో కేసీఆర్ పూర్తి నిర్లక్ష్యం చూపించారు.
1979లోనే ప్రాజెక్టుకు అంకురార్పణ
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణానికి 1979లోనే అంకురార్పణ జరిగింది. రు. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం 1982 జూలై 23వ తేదీన జీవో కూడా జారీచేసింది. అయితే 1982 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటంతో అప్పటినుండి 22 ఏళ్ళవరకు ఈ ప్రాజక్టును తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004లో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడటంతో జలయగ్నంలో భాగంగా 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. రెండు సొరంగంపనుల నిర్మాణనికి రు. 2813 కోట్ల అంచనా వ్యయంతో 2005 ఆగష్టు 11వ తేదీన పరిపాలనా అనుమతులు జారీచేశారు. ఫైనల్ గా 2006లో వైఎస్సార్ సొరంగంపనులకు శంకుస్ధాపన చేయటంతో పనులు మొదలయ్యాయి.
శంకుస్ధాపన చేయగానే తొలిసొరంగం 43.93 కిలోమీటర్ల పనులు మొదలయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురు కావటంతో సొరంగంపనులు ఇప్పటివరకు 34.71 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. వరదలు, బురద పేరుకుపోవటం, టన్నెల్ పై కప్పునుండి మట్టిపెళ్ళలు, రాళ్ళు ఊడిపడుతుండటంతో 2019లో పనులు ఆడిపోయాయి. ఇదేసమయంలో టన్నెల్ తవ్వే యంత్రాల బేరింగులు కూడా చెడిపోవటంతో ఔట్ లెట్ పనులు 2023, జనవరిలో నిలిచిపోయాయి. బేరింగులను రేవంత్ ప్రభుత్వం అమెరికా నుండి ఓడలో తెప్పిస్తోంది. బేరింగులు వచ్చేలోగానే శనివారం ఉదయం ప్రమాదం జరగటం నిజంగానే దురదృష్టమని చెప్పాలి.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపనులకు టాప్ ప్రయారిటి ఇచ్చింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేసి రేవంత్ రెడ్డి(Revanth) ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిధులను విడుదలచేస్తున్నారు. నిధులను విడుదల చేయటమే కాకుండా పెండింగ్ బిల్లులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేస్తోంది. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతుండటంతో నిర్మాణసంస్ధ జేపీ అసోసియేట్స్ నాలుగురోజుల క్రితమే పనులు మొదలుపెట్టింది. టన్నల్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద టన్నల్ గా రికార్డు సృష్టిస్తుంది. పనులు మొదలుపెట్టగానే ప్రమాదంజరిగింది. ప్రమాదాన్ని అధిగమించి పనులు మొదలుపెట్టాలన్నా, బేరింగులు రావలన్నా తక్కువలోతక్కువ ఏడాది పడుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయింది వీరే
శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సొరంగంలోని 14వ కిలోమీటర్ దగ్గర పనులు మొదలైనపుడు 50మంది అధికారులు, కార్మికులున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అతికష్టంమీద 42 మంది బయటపడ్డారు. మిగిలిన 8 మంది సొరంగంలోపలే చిక్కుకుపోయారు. సొరంగంలోపల ప్రమాదంలో చిక్కుకుపోయిన వారు ఎవరంటే జేపీ అసోసియేట్స్ కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్, సూపరెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, రోజువారి కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. వీరు కాకుండా మరో నిర్మాణసంస్ధ రాబిన్ సన్ కు చెందిన ఆపరేటర్లు సన్నీసింగ్, గురుదీప్ సింగ్ కూడా ఉన్నారు. 14 కిలోమీటర్ల సొరంగంలో బయటనుండి సొరంగంలోపల 12వ కిలోమీటర్ వరకు వాహనాలు వెళతాయి. అయితే అక్కడి బురద, నీరు ఎక్కువగా ఉండటం వల్ల ముందుకు ప్రయాణం కష్టమే అని కార్మికులు చెబుతున్నారు.
అధికారులు సొరంగంలోపలకు పంపిన ద్రోన్లు కూడా 12 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగాయి. ఆ తర్వాత కరెంటుకూడా లేదు. ట్యూబ్ లైట్లు వెలగటానికి జనరేటర్లున్నా ప్రస్తుతం వాటి పరిస్ధితి ఏమిటో తెలీటంలేదు. ఇదేసమయంలో ఆక్సిజన్ సప్లై కూడా ఇబ్బందులుగానే ఉంది. ప్రమాదంజరిగి ఇప్పటికి 24 గంటలకు పైగానే అయిపోయింది కాబట్టి లోపలున్న 8 మంది పరిస్ధితి ఎలాగుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లలో నిపులైన మిలిటరీ సిబ్బంది కూడా సొరంగం దగ్గర ఉన్నారు. లోపలకు ప్రవేశించేందుకు అవకాశాల కోసం చర్చిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.