తిరుపతిలో అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా? ఎందుకలా?

తిరుపతిలో పెరిగిన స్టే హోం సంస్కృతి.. గెస్ట్ హౌసులుగా మారిపోతున్న గృహాలు;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-30 11:59 GMT

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. టిటిడి సత్రాల్లో గదులు తీసుకోవడం కష్టంగా మారింది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో "స్టే హోం" సంస్కృతి పెరగడం వంటి కారణాలతో స్థానికులకు ప్రధానంగా మధ్య తరగతి వారికి అద్దె ఇల్లు దొరకడం కష్టంగా మారింది.

తిరుమలకు వచ్చే యాత్రికుల్లో ఎక్కువ మంది తమ నివాసాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. దీంతో తిరుపతిలో తమ ఇళ్లను యజమానులుగా స్టే హోం కోసం ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Full View

పర్యాటక అభివృద్ధి కోసం ఏపీటీడీసీ హోం స్టే కల్చర్ పరిచయం చేసింది. అంతకుముందు నుంచి ఈ వసతి ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో మూడు నెలల కాలంలో అద్దె ఇళ్లను లీజుకు తీసుకుని హోం స్టేలుగా మార్చడం వేగవంతమైంది.
తిరుపతి నగర పాలక సంస్థ అధికారుల లెక్కల ప్రకారం 500 దరఖాస్తులు అందాయి. వాటిలో చాలా వరకు పెండింగ్ లో ఉంటారు. అనధికారికంగా హోం స్టే ప్రైవేటు అతిథి గృహాల సంఖ్య 1,500 పైగానే ఉంటాయనేది ఓ అంచనా.
తిరుపతి నగరంలో జీఎస్టీ, అగ్నిమాక శాఖ ప్రధానంగా మున్సిపల్ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడం వల్ల హోంస్టే సంస్కృతి బాగా విస్తరించడానికి ఆస్కారం ఏర్పడింది.
తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారి మహాపాత్ర ఏమంటున్నారంటే..
"స్టే హోం ఏర్పాటుకు 112/2019 జీఓ ఉంది" అని మహాపాత్ర చెబుతున్నారు. దీనిద్వారా సర్వీస్ అపార్టెమెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయని ఆయన చెబుతున్నారు.
"నగరంలో దాదాపు 500 వరకు హెం స్టేల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి. వాటిలో చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయి" అని కూడా మహాపాత్ర చెప్పారు.
"నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు ఉంటేనే పరిశీలన చేసిన అనంతరం అనుమతి ఇస్తాం" అని కూడా మహాపాత్ర స్పష్టం చేశారు.
ఆదాయంలో మేటి..

నీటి పన్ను రూ8.18కోట్లు, మురుగునీటి పన్ను రూ1.50కోట్లు పన్నుల రూపంలో కార్పొరేషన్‌ ఖాతాలోకి చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.84కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈసారి వంద కోట్ల మార్కు దాటడంతో పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది.
తిరుపతి నగర పాలక సంస్థ 2024-25 సంవత్సరానికి దాదాపు వంద కోట్ల రకాల పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 85 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. దీంతో పోలిస్టే దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఈ ఏడాది ఆస్తి పన్ను ద్వారా 81 కోట్ల రూపాయలు, ఖాళీ స్థలాలపై (వీఎల్టీ) ద్వారా సుమారు పది కోట్ల రూపాయలు, నీటి పన్న ద్వారా 8.13 కోట్ల రూపాయల వరకు నగర పాలక సంస్థకు ఆదాయం లభించింది. అందులో మురుగునీటి పన్నుల ద్వారా 1.50 కోట్ల రూపాయలు కూడా ఆదాయం లభించినట్లు అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
అద్దెల దరువు
తిరుపతి ఓ ఆధ్యాత్మిక నగరం. రోజుకు 1.50 లక్షల మంది యాత్రికులు రాకపోకలు సాగించే యాత్రిక పట్టణంలో కొత్త తరహా వ్యాపారానికి తెరతీశారు. అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. హోం స్టే కల్చర్ పెరిగడం వల్ల. ఆ ఇళ్లు లాడ్జీలుగా మర్చేశారు. సాధారణ, మధ్య తరగతి సొంతిల్లు లేని వారిపై అద్దెల భారం పెరిగింది. నగరంలో మారుమూల వీధుల్లో నాలుగు నుంచి ఐదు వేల రూపాయల అద్దెకు ఐదేళ్ల కిందటి వరకు ఇళ్లు దొరికేవి. కాస్త మెరుగైన ప్రాంతాల్లో పది వేల లోపు డబుల్, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లు దొరికేది. ప్రస్తుతం ఆ పరిస్థితి తిరగబడింది.
ఇళ్ల ముందు నెలల తరబడి టూ లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. నివాసితులకు ఇవ్వడానికి మాత్రం యజమానులు ఆసక్తి చూపించడం లేదు. కొన్ని నెలలు ఖాళీగా ఉంచే ఇళ్లు, అపార్టుమెంట్లు నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలకు అప్పగిస్తున్నారు. వాటిని లీజుకు తీసుకునే వారు కూడా ఒకో గదికి కోజుకు మూడు వేల నుంచి ఆరు వేలు, పది వేల వరకు అద్దె వసూళ్ల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదీ కారణమే.. సాధారణంగా నగరాల్లో అద్దె నియంత్రణ విభాగం కీలకంగా లేకపోవడం కూడా కారణమే. అందులో టౌన్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు లేకపోవడం వల్ల అడ్వాన్సులు, అద్దె భారంగా మారింది.
ఇవే అడ్డాలు : ఇది కపిలతీర్థం నుంచి అలిపిరికి వెళ్లే బైపాస్ రోడ్డు. ఈ మార్గంలో ఎడమపక్కనే ఎన్టీఓ కాలనీ ఉంది. మూడు నెలల కిందటి వరకు ఉన్న ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలతో లాడ్జీలు, గదులు ఏర్పాటు చేశారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పాత ఇళ్లు కాస్తా స్టేహోంలుగా మారాయి. ఇప్పుడు ఈ ప్రాంతమంతా ప్రైవేటు హోటల్లు, చిన్నపాటి లాడ్జీలు, స్టే హోంలుగా మారిపోయాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు 16.59 చదరపు మైళ్లలో 2001 వరకు 2,28,202 జనాభా ఉండేది. నగర పాలక సంస్థగా మారిన తరువాత 27.44 కిలోమీటర్లు (10.59 చదరపు మైళ్లకు విస్తరించింది. దీంతో 2011 నాటికి జనాభా 3,74,260కు చేరింది. అంటే తిరుపతి నగరానికి రేణిగుంట అంతర్భాగంగా మారినట్లు భవనాలు, వ్యాపారాలు విస్తరించాయి. తిరుపతి రూరల్ కూడా చంద్రగిరి, అలివేలు మంగాపురం, కడప మార్గంలో కరకంబాడి వరకు పూర్తిస్థాయి, కాలనీలు, వాణిజ్యం, షాపింగ్ మాల్స్, లాడ్జీలు ఏర్పడ్డాయి.
"తిరుపతి జనాభా 2.50 లక్షల మంది. రోజుకు 1.50 లక్షల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. హోం స్టే, లాడ్డీలు అందుబాటులో లేకుంటే యాత్రికుల పరిస్థితి" ఏమిటి అని తిరుపతి డిప్యూటీ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ మహాపాత్ర ధర్మసందేహం వ్యక్తం చేశారు.
చాలని వసతి
తిరుపతిలో టీటీడీ సత్రాల్లో యాత్రికులకు వసతి చాలడం లేదు. దీంతో స్టే హోం విస్తృతం కావడానికి దారితీసింది.
ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో 505 గదులు, 9 డార్మెటరీలు, 1038 లాకర్లు అందుబాటులో ఉంచారు.
అలిపిరికి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ యాత్రికులకు ప్రవేశం లేదు. ఎస్ఎస్డీ టోకెన్ల జారీ, విజిలెన్స్ విభాగం ఆధీనంలో ఉంచుకున్నారు.
రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసంలో 11 డార్మెటరీలు, లోపల 714 లాకర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి చాలని స్థితిలో స్థలం దొరికితే చాలు అని నేలపైనే పడుకునే వారి సంఖ్య వెలల్లో ఉంటుంది.
తీవ్రమైన సమస్య
తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక 950 గదులతో 70 ఏళ్లుగా సేవలు అందించిన గోవిందరాజ సత్రాలు 1,2 కూల్చివేశారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్టు బస్సుల్లో వచ్చే యాత్రికులకు వసతి సమస్య మరింత జఠిలమైంది. ఐదు అంతస్తుల్లో రెండు బ్లాకులు రూ.600 కోట్లతో నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే 20 వేల మంది యాత్రికులకు వసతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రికుల అవసరాలు సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు తెరతీశారు. మున్సిపల్ శాఖల నుంచి అనుమతి లేకుండానే ప్రైవేటు ఇళ్లను అద్దెకు తీసుకుని హెం స్టే వ్యాపార కేంద్రాలుగా మార్చారు.
వీధివీధినా...

తిరుపతిలో ప్రధాన రహదారులకు సమీపంలోని వీధివీధినా సర్వీస్ అపార్టుమెంట్లు, స్టే హోంలు విపరీతమయ్యాయి. ఆటో డ్రైవర్లు, టాక్సీల డ్రైవర్లు యాత్రికులను ఆ హోంలకు తీసుకుని వెళ్లడం ద్వారా కమీషన్ తీసుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. అదే రీతిలో యాత్రికులను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా వారి చేతిలో ఓ బోర్డు ఉంచి రోడ్డుపై నిలుతున్నారు. దీని వల్ల కనీసంగా దాదాపు 200 మందికి పైగానే ఉపాధి కూడా దొరుకుతోంది.
కపిలతీర్థం రోడ్డులో బాబు అనే వ్యక్తి బోర్డు పట్టుకుని ఇలా కనిపించాడు.
"సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఇలా నిలబడతా. రోజుకు రూ. 500 కూలి దొరుకుతుంది" అని బాబు చెప్పారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు కనీసంగా అంటే వంద నుంచి 200 వరకు హోం స్టేల కోసం ఇలా పనిచేస్తున్న వారి జీవితం ఇది.
తిరుపతి నగరం, తిరుచానూరు, రేణిగుంట మార్గం, అర్బన్ హాట్ ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారం జోరందుకుని, అద్దె ఇళ్లకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగేలా చేశారు.
దీనిపై నగర పాలక సంస్థలోని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి ఎస్. శ్రీనివాసరావు ఏమంటున్నారంటే..
"పట్టణంలో 15 మీటర్ల ఎత్తుకు లోబడి ఉన్న భవనాలు పరిశీలించడం వరకు మా అధికారం ఉంది" అని చెప్పారు. ఆ కోవలో ఆస్పత్రులు, పాఠశాల ప్రైవేటు భవనాలు తనిఖీ చేసి, అనుమతిస్తాం" అని శ్రీనివాసరావు చెప్పారు.
అసలు సమస్య ఇక్కడే వచ్చింది. 18 మీటర్లకు పైబడి ఎత్తు ఉండే భవనాల్లో వాణిజ్యం, విద్యా , ఆస్పత్రి భవనాల అనుమతులు రాష్ట్ర స్థాయిలోని అగ్నిమాపక శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలోని ప్రైవేటు భవనాల్లో హోం స్టే లేదా, సర్వీస్ అపార్టుమెంట్లకు అగ్నిమాపక శాఖ అధికారుల తనిఖీ, అనుమతి లేకుండానే బహిరంగంగా నిర్వహిస్తున్నా, పట్టించుకునే వారు లేకుండా పోయారు.
సమస్య ఏమిటి?
నగర పాలక సంస్థలో అద్దె నియంత్రన వ్యవస్థ సుప్తచేతనావస్థలో ఉండడం వల్ల, నివాస భవనాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల స్థానికులకు ఇళ్ల సమస్య పెరిగింది. దీనికి తోడు అనుమతి లేని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న భవనాల నుంచి నగర, పాలక సంస్థ, జీఎస్టీ కూడా ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్న పరిస్థతి స్పష్టంగా కనిపిస్తోంది.
పరిష్కారం ఇదే..
తిరుపతి నగరంలో యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారికి వసతి కల్పించడం టీటీడీకి ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న రైల్వేస్టేషన్ సమీపంలోని ఆదునాతనంగా మారిన మొదటి సత్రంలో 94 గదులు ఉన్నాయి. శ్రీనివాసంలో 410 గదులు, 953 లాకర్లు, పెద్ద డార్మెటరీ హాళ్లు ఉన్నాయి. మాధవం అతిథి గృహాల సముదాయంలో 164 గదులు, విష్ణునివాసంలో 196 గదులు యాత్రికులకు వసతి సదుపాయం చాలడం లేదు. టీటీడీ అతిథి గృహాల్లో (ఎస్వీ, పద్మావతి) వీఐపీలకు మాత్రమే పరిమితం.
ప్రస్తుతం తిరుపతికి వస్తున్న పెరుగున్న యాత్రికుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని భూదేవి కాంప్లెక్స్ పూర్తిగా యాత్రికులకు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తోడు ఇప్పటికే నిర్ణయించినట్లు అలిపిరి ప్రాంతంలో భారీ హాళ్లు నిర్మిస్తే మినహా, యాత్రికులకు వసతి అందుబాటులోకి వచ్చే వాతావరణం కనపించడం లేదు.
అద్దె నియంత్రణ వ్యవస్థ జీవం పోయడం తోపాటు, వ్యాపార సంస్థలుగా మారిన ఇళ్లు, అపార్టుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తేనే అద్దె ఇళ్ల సమస్య తీరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై నగర పాలక సంస్థ అధికారులు ఎలా స్పందింస్తారనేది వేచిచూడాల్సిందే.

Similar News