లోకేశ్ అంత మాట అనేశాడేంటీ? అమీర్‌పేటా? అమరావతా?

4 నెలల కోచింగ్ V/S 4 ఏళ్ల ఇంజినీరింగ్- లోకేశ్ వ్యాఖ్యల అర్థం ఏమిటి?

Update: 2025-11-06 04:19 GMT
Nara Lokesh (graphics)
ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. “నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ చదివినా రాని ఉద్యోగం హైదరాబాద్‌ అమీర్‌పేటలో నాలుగు నెలల కోచింగ్ తో వస్తోంది” అన్నారు రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైన లోకేశ్.
ఈ మాట విన్నవెంటనే కొందరు షాక్ అయ్యారు.

“మరి ఇంజినీరింగ్ చదవాల్సిన అవసరం లేదా?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
కానీ లోకేశ్ ఉద్దేశాన్ని కాస్త లోతుగా పరిశీలించాలి. ఆయన చెప్పింది వాస్తవమే అయినా ఆయన మాట్లాడుతున్నది పునాదుల గురించి అయి ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థలోని స్కిల్‌ గ్యాప్‌ (నైపుణయం లోటు) గురించి ఆయన చేసిన వాస్తవ వ్యాఖ్య.
ఇంజినీరింగ్ విద్యలో ఉన్న సమస్య ఎక్కడ?
ఇప్పటి చాలా కాలేజీల్లో ఇంకా పాత సిలబస్‌నే బోధిస్తున్నారు. మూడు, నాలుగేళ్ల కిందటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌, పాత ప్రాజెక్టులు, outdated పద్ధతులతో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్టు రిటైర్డ్ లెక్చరర్ శౌరయ్య చెప్పారు.
ప్రస్తుతం ఉద్యోగాలు ఇస్తున్న ఐటీ కంపెనీలు- ఇప్పుడు AI, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, గ్రీన్‌ ఎనర్జీ వంటి కొత్త రంగాల్లో నైపుణ్యాలను కోరుతున్నాయి. కానీ కళాశాలల్లో అవి బోధించబడటం లేదు.
దీని ఫలితం ఏమిటంటే...
విద్యార్థులు డిగ్రీతో బయటకు వస్తారు కానీ ఉద్యోగానికి సిద్ధంగా ఉండరు. సాఫ్ట్ స్కిల్స్ ఉండడం లేదు, టెక్నికల్ స్కిల్స్ కొరత ఉంటుందని హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న సీహెచ్ మహేష్ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో అమీర్‌పేట, గచ్చిబౌలి వంటి కోచింగ్ సెంటర్లు “జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్” ఇస్తాయి. కంపెనీలు కూడా అలాంటి విద్యార్థులను సులభంగా తీసుకుంటాయి.
లోకేశ్ వ్యాఖ్య ఈ వాస్తవాన్ని చూపిస్తోందని మహేష్ విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అవసరాన్ని సూచిస్తోందన్నారు. లోకేశ్ వ్యాఖ్యను అర్థం చేసుకోవాలంటే దాని వెనుక ఉన్న నిగూఢ ఉద్దేశాన్ని చూడాలన్నారు.
లోకేశ్ ఏమన్నారంటే..
"ప్రస్తుత ఉన్నత విద్య- ఇండస్ట్రీ అవసరాలకు సరిపోవడం లేదు. ఇంజినీరింగ్‌ డిగ్రీలకంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యం. కళాశాలలు పరిశ్రమలతో నేరుగా అనుసంధానం కావాలి" అన్నారు నారా లోకేశ్.
అందుకే ఆయన ఐటీఐలు, పాలిటెక్నిక్లు, విశ్వవిద్యాలయాలను ఇండస్ట్రీలతో లింక్ చేయండి అని ఆదేశించారు. ప్రతి కళాశాల “నైపుణ్యం పోర్టల్‌”కు కనెక్ట్ అయి విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు కల్పించాలని చెప్పారు.
కొంతమంది లోకేశ్ వ్యాఖ్యను “ఇంజినీరింగ్‌ విలువ తగ్గించడమే” అని భావిస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశం విద్యను ఉద్యోగోపయోగంగా మార్చడం.
విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. విద్యార్థి ఉద్యోగం చేయగల స్థాయి నైపుణ్యం సంపాదించాలి.
ఇదేమీ కొత్త ఆలోచన కాదు...
జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు “Industry-linked education” వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తున్నాయి.
అక్కడ కంపెనీలు, కాలేజీలు కలసి కోర్సులు రూపొందిస్తాయని జర్మనీలో ఇంజినీరింగ్ చేసిన జయపాల్ చెప్పారు. విద్యార్థి తన నాలుగేళ్ల కాలంలో ఏదైనా కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసేస్తాడు, కంపెనీల అవసరాలను దీటుగా తయారవుతాడు అన్నారు. ఇండియాలో కూడా ఇంటర్నల్షిప్ ఉంటుందని, చాలా కేసుల్లో ఇదేదో తంతుగా ఉంటుందే ప్రాడక్టివ్ గా ఉండదని జయపాల్ అభిప్రాయపడ్డారు.
ఉద్యోగావకాశాలపై ప్రభుత్వం దృష్టి..
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 406 జాబ్ మేళాల ద్వారా 78 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని లోకేశ్ చెప్పారు. అదే సమయంలో పాలిటెక్నిక్ విద్యార్థుల్లో 94.6% మందికి, ఐటీఐ విద్యార్థుల్లో 98% మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. దీని అర్థం- ప్రభుత్వం నైపుణ్య ఆధారిత విద్య వైపు దృష్టి సారించిందని.

లోకేశ్ వ్యాఖ్యల్ని సానుకూలంగా చూడాలన్నారు ఐటీ రంగ నిపుణుడు ప్రవీణ్ చంద్ర. ప్రభుత్వ రంగంలో శిక్షణ ఇస్తున్న వారు- కోచింగ్ ఎందుకు అవసరం అవుతుందో వివరించాలన్నారు.
"కోచింగ్‌ సెంటర్లు తాత్కాలిక పరిష్కారం మాత్రమే.కళాశాలలే స్కిల్‌ ట్రైనింగ్‌ కేంద్రాలుగా మారాలి. పరిశ్రమలతో లింక్ చేయడం మంచిది కానీ,
దాన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పారదర్శకంగా చేయాలి. ఉపాధ్యాయులకు కూడా స్కిల్‌ అప్‌డేట్‌ ట్రైనింగ్‌ అవసరం" అన్నారు ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న ఎస్. అనాహిత. విద్యను పూర్తిగా “జాబ్ సెంట్రిక్” గా మార్చడం కూడా ప్రమాదమేనని, విద్యలో విలువలు, పరిశోధన, ఆలోచనశక్తి కూడా అవసరమేనని ఆమె అన్నారు.
నారా లోకేశ్‌ వ్యాఖ్య “అమీర్‌పేటలో నాలుగు నెలలు చాలూ” అన్నది ఓ నినాదంగా వినిపించినా దాని వెనుక లోతైన సందేశం ఉంది. విద్యా వ్యవస్థను నిజ జీవిత అవసరాలకు దగ్గర చేయాలన్న పిలుపు ఉంది.
Tags:    

Similar News