తెలంగాణలో కాలుమోపటానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న పవన్ ?

జూబ్లీహిల్స్ రోడ్డుషో విషయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి

Update: 2025-11-06 10:01 GMT
Janasena Chief Pawan Kalyan

జనసేన అధినేత, ఏపీ డిప్యూటి సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలంగాణలో కాలుమోపటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారా ? పార్టీని బలోపేతం చేయటానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికను ఉపయోగించుకుంటున్నారా ? ఇపుడిదే ప్రశ్నలు రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా పవన్ ప్రచారం చేయబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రోడ్డుషోల్లో పవన్ పాల్గొంటారని తెలంగాణ బీజేపీ అద్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ప్రకటించారు. పవన్ తరపున తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ మూడురోజుల క్రితం కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, రామచంద్రరావు, దీపక్ తదితరులతో భేటీ అయినపుడు పవన్ ప్రచారం విషయంపై మాట్లాడారు.

ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోల్చుకుంటే బీజేపీ వెనుకబడిందనే చెప్పాలి. అందుకనే ఆలోటును భర్తీ చేసేందుకు పవన్ తో ప్రచారం చేయించాలని, రోడ్డుషోల్లో ప్రసంగించేట్లుగా రూటుమ్యాపును రెడీచేయాలని మీటింగులో రెండుపార్టీల నేతలు డిసైడ్ అయ్యారు. నిర్ణయం తీసుకుని మూడురోజులయినా ఇప్పటివరకు పవన్ పాల్గొనబోయే రోడ్డుషోల రూట్ మ్యాప్ రెడీ అయినట్లు లేదు. రోడ్డుషో రూట్ మ్యాప్ రెడీ అయ్యుంటే మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రచారానికి ఇక మిగిలింది మూడురోజులు మాత్రమే. ఈనెల 11వ తేదీన పోలింగ్ కాబట్టి 9వ తేదీన సాయంత్రంకు ప్రచారం ముగుస్తుంది. అంటే ప్రచారానికి ఉన్న మూడురోజుల్లోనే పవన్ ప్రచారంలో పాల్గొంటే పాల్గొన్నట్లు లేకపోతే లేదు. గురువారం సాయంత్రానికి కూడా రోడ్డుమ్యాప్ రెడీ అవకపోతే అసలు పవన్ ప్రచారంచేయటంపైనే అనుమానాలు పెరిగిపోతాయి.

నిజానికి రోడ్డుషో అంటేనే సుడిగాలి ప్రచారం అని అందరికీ తెలుసు. కాబట్టి మూడురోజుల్లో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో రోడ్డుషోలు నిర్వహించటం పెద్ద కష్టమేమీకాదు. రోడ్డుషోల్లో పవన్ పాల్గొంటే వచ్చే ఊపే వేరుగా ఉంటుంది. ఇప్పటివరకు ఏదోలాగ జరుగుతున్న ప్రచారం రోడ్డుషోలతో ఒక్కసారిగా వేడెక్కిపోవటం ఖాయం. అయితే పవన్ ప్రచారం విషయంలో మూడురోజుల క్రితం ఉన్నంత ఊపు ఇపుడు కనబడటంలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున 8 మంది అభ్యర్ధులు పోటీచేశారు. అయితే వీరిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఆ తర్వాత పవన్ తెలంగాణను పూర్తిగా వదిలేశారు. ఎప్పుడైనా హైదరాబాదుకు రావటం, సినిమా ఫంక్షన్లలో హడావుడి చేయటం తప్ప పార్టీపరంగా ఉనికి చాటేందుకు ప్రయత్నంచేయలేదు. తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించటం, పవన్ డిప్యుటి సీఎం అవటంతో బాగా బిజీ అయిపోయారు. అయితే ఏపీలో ఎంత ఘనవిజయం సాధించినా తెలంగాణలో అసలు ఉనికిలో కూడా లేదన్న వెలితి పవన్ను పట్టి పీడిస్తోంది.

అందుకనే ఎప్పుడు అవకాశం వచ్చినా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయటానికి ప్రయత్నాలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ సంకేతాలు పంపారు. జనసేన వర్గాల సమాచారం ఏమిటంటే ఇపుడు రోడ్డుషోలో పాల్గొనటంతో పాటు తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలు, తర్వాత జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీతరపున అభ్యర్ధులను దింపటమే. పార్టీ పోటీచేయటం అంటే బీజేపీతో పొత్తుతోనా లేకపోతే ఒంటరిగానేనా అన్నది ఇప్పటికైతే సస్పెన్సే. దీనికి కారణం ఏమిటంటే టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని కూటమిగా పోటీచేయటానికి తెలంగాణ బీజేపీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకతకు కారణం ఏమిటంటే పై రెండుపార్టీలు ఆంధ్రాపార్టీలుగా ముద్రపడటమే.

ఆంధ్రాపార్టీలుగా ముద్రపడిన టీడీపీ, జనసేనతో కలిస్తే జనాల్లో బీజేపీపైన కూడా వ్యతిరేకత వస్తుందన్న భయం తెలంగాణ నేతలను పట్టిపీడిస్తోంది. అందుకనే తెలంగాణ బీజేపీనేతలు టీడీపీ, జనసేన గురించి ఎక్కడా ప్రస్తావించటంలేదు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పవన్ ఎందుకు ప్రచారానికి వస్తున్నాడంటే ఇక్కడ సీమాంధ్రుల ఓటర్లు వేలల్లో ఉన్నారు. వీళ ఓట్లను ఆకర్షించటానికి మాత్రమే బీజేపీ పవన్ను ఉపయోగించుకోవాలని అనుకున్నది.

ఇదేసమయంలో పవన్ ఆలోచన మరోరకంగా ఉన్నట్లు సమాచారం. ఎలాగంటే తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో కలుపుకుని ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సీమాంధ్రులున్నారు. వీళ్ళ మద్దతు పొందగలిగితే ఏపీలో లాగానే తెలంగాణలో కూడా జనసేనను బలోపేతం చేయచ్చని పవన్ భావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. సో, జూబ్లీహిల్స్ ప్రచారం వెనుక ఇటు బీజేపీ అటు పవన్ ఎవరి వ్యూహాలు వాళ్ళకున్నాయని అర్ధమవుతోంది. మరి ఎవరి వ్యూహం వర్కవుటవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News