విజయవాడలో రామ్‌చణ్ భారీ కటౌట్..హెలిక్యాప్టర్ నుంచి పూల వర్షం
256 అడుగుల ఎత్తున్న ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. గేమ్ చేంజర్ లుక్‌లో దీనిని ఏర్పాటు చేశారు.
రామ్‌చరణ్ గేమ్ చేంజర్ సినిమా భారీ కటౌట్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్‌చరణ్ 256 అడుగుల అతి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ మూవీ లుక్‌తో దీనిని ఏర్పాటు చేశారు. దీని పైన పూలు చల్లేందుకు ప్రత్యేకంగా ఓ హెలిక్యాప్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం హెలిక్యాప్టర్ లో నుంచి ఈ భారీ కటౌట్ మీద పూల వర్షం కురిపించారు. ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి ఈ అవార్డును దిల్‌రాజు అందుకున్నారు. గత పది రోజుల నుంచి ఈ కటౌట్ ఏర్పాటు పనులు చేపట్టారు. గిన్నీసు బుక్ రికార్డు మెగా అభిమానుల పేరు మీద ఉండాలనే ఉద్దేశంతో రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి నిపుణులను తీసుకొచ్చి వారి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు దీనిని ఆవిష్కరించారు.
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. చరిత్ర సృష్టించే విధంగా ఆ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 1న గేమ్ చేంజర్ ట్రైలర్ వస్తుందన్నారు. విజయవాడ తెలుగు సినిమా పుట్టినిల్లు అని, 256 అడుగుల భారీ కటౌట్‌ను పెట్టడంతో మరో రికార్డు సృష్టించినట్లు చెప్పారు. మెగా అభిమానులు మామూలు ఫ్యాన్స్ కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ రమ్‌చరణ్‌లను అందించారన్నారు. వీరితో పాటు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ వంటి హీరోలను అందించారని తెలిపారు. గేమ్ చేంజర్‌కు సంబంధించి అమెరికాలో నిర్వహించిన మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక చేస్తే ఎలా ఉంటుందో ఒక సారి చూడండి అని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పే డేట్‌ను బట్టి ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించాలో చెబుతామన్నారు. గేమ్ చేంజర్ ఫైనల్ వెర్షన్ చూసిన చిరంజీవి సంక్రాంతికి భారీ హిట్ కొట్టబోతున్నట్లు అభిమానులకు చెప్పాలని ఫోన్ చేశారని చెప్పారు. అభిమానులంతా జనవరి 10న రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని చెప్పారు. ఐఏఎస్ అధికారిగా, పోలీసు అధికారిగా యాక్షన్‌తో అలరిస్తారని చెప్పారు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా రూపుద్దిదుకుంది. ఇది పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తు ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.