బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలపై నడుం బిగించిన ఉద్యమ కమిటీ

పీపీపీ మోడల్ పెద్ద మోసమని నినదించిన ఉద్యమకారులు

Update: 2025-11-09 13:34 GMT
బాపట్ల మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ నినదించిన ఉద్యమ కమిటీ
బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్ లోకి మార్చవద్దంటూ స్థానికులు నడుంబిగించారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడుకోవాలని ఉద్యమిస్తున్నారు. పీపీపీ విధానంలో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వైపుకు తీసుకు వచ్చిన 590 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య విద్యను, అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చెయ్యాలనే ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.
ఈనెల 9వ తేదీ ఆదివారం బాపట్లలోని ఎన్జీవో హోమ్ హాలులో పిపిపి పేరుతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట అంజి బాబు, సిపిఐ కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర బాబు, సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి సింగరకొండ, సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, ప్రభుత్వ మెడికల్ కళాశాలల కో కన్వీనర్ డాక్టర్ వసుంధర కుర్ర, వి సి కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. జె. విద్యాసాగర్, సమాజ వాది పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధ శ్రీనివాసరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దర్శి విష్ణు శంకర్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వ సురేష్ తదితరులతో ఏర్పాటైన కమిటీ పీపీపీ మోడల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది.
బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రాంగణాన్ని వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, పరిరక్షణ కమిటీ బృందం, ప్రజా పౌర సంస్థల నేతలు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో 56 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు ప్రారంభం కావటాన్ని గమనించారు. గత 17 నెలలుగా బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అదనంగా ఎలాంటి నిర్మాణం జరగలేదని, నేడు కొంత ఐరన్ ను పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు తరలించడాన్ని ప్రతినిధి బృందం గుర్తించింది.
ప్రైవేట్ మెడికల్ మాఫియాను ప్రోత్సహిస్తూ 500 ఎకరాలలో నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మరియు 10 ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ మెడికల్ మాఫియాకు కట్టబెట్టాలనే కుట్ర జరుగుతుందని ఈ కమిటీ ఆరోపించింది. గత ప్రభుత్వం మెడికల్ సీట్లను అమ్ముకుంటే నేటి ప్రభుత్వం ఏకంగా మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెట్టిందని విమర్శించింది.
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి ప్రసంగిస్తూ విద్య, వైద్య రంగాలు సేవా రంగాలుగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని కోరారు. వైద్య విద్య, వైద్యం ప్రైవేటు పరం అయితే సామాజిక న్యాయం దక్కదని, పేదలు అప్పులు పాలవుతారని , రైతులు ఆత్మహత్యలకు ఖరీదైన వైద్యం కారణమౌతుందని తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు "కుల, మత రాజకీయాలకు అతీతంగా పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. వైద్య విద్య ప్రైవేట్ రంగంలో ఉంటే అర్హత లేని కోట్లాది రూపాయలు వెచ్చించ గల కోటేశ్వరుల బిడ్డలకే మెడికల్ సీట్లు దక్కుతాయని, అర్హత గల పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ "ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రతి ఏడాది 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు వైద్య వ్యాపారంలో సంపాదిస్తుందని, ఇలాంటి కార్పొరేట్ వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కట్టబెట్టడం దారుణం" అన్నారు. 3 లక్షల 29వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 5 వేల కోట్లు ఖర్చు పెడితే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, 10 ప్రభుత్వ ఆసుపత్రులలో వేలాది మందికి వైద్య విద్య, కోట్లాది మందికి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించగలవన్నారు. ఆంధ్రప్రదేశ్ రోగులలో 50 శాతం మంది ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారని కొత్తగా మరో 10 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు వెనుకబడిన ప్రాంతాలలో వస్తే సమాజ పురోగమనానికి తోడ్పడుతుందన్నారు.
వైద్య విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగితినే దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీల జీవితాల్లో మార్పులు కనబడతాయన్నారు
దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్. పది ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 20 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిస్తాయని, రిజర్వేషన్లు అమలై సామాజిక న్యాయాన్ని శక్తివంతం చేస్తుందన్నారు వినయ్ కుమార్.
Tags:    

Similar News