ఆ తల్లి మనసు ఎందుకు పాషాణమైంది? అదృశ్యమైన ఈ పాపాయి ప్రాణం ఎలా పోయింది?
తిరుపతిలో ఈ విషాధ ఘటన వెనుక చేదు నిజాలేమిటి?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-06 17:11 GMT
తిరుపతి నగరం కొరమీనుగుంటలో ఆరు నెలల పాప రమ్య అదృశ్యం ఘటన విషాదంగా మారింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిగుడ్డు శనివారం ఉదయం కనపించకుండా పోయింది. సాయంత్రానికి ఆ పసి గుడ్డు ఇంటికి సమీపంలోని మురుగునీటి కాలువలో శవమై పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ సంఘటన వివరాలివి
మూడు నెలల నా కూతురు రమ్యను ఎవరో ఎత్తుకుని వెళ్లారని తల్లి చందన శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సీఐ రామకిషోర్ స్పందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కేసు సమాచారం తెలియడంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్ణవర్థనరాజు కూడా ను ఛాలెంజ్ గా తీసుకున్నారు. సిబ్బందితో కలిసి ఆయన కూడా రంగంలోకి దిగారు. కొరమీనుగుంట ప్రాంతంలో స్వయంగా దర్యాప్తు చేశారు.
తిరుపతి నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. కూడళ్ల తోపాటు అనేక ప్రాంతాల్లో అదృశ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఇంతటి పగడ్బందీ చర్యల మధ్య పసిబిడ్డను ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోవడం అసాధ్యం కాదని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. నాలుగైదు బృందాలు ఏర్పాటు చేశారు. గాలింపు ముమ్మరం చేశారు. ఇదేమీ పట్టనట్లు రమ్య తల్లి చందన మాత్రం అందరినీ బిడ్డను ఎవరో ఎత్తుకుని వెళ్లారని నమ్మించింది. రంగంలోకి దిగిన పోలీసులు కూడా సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించడంలో ఒక బృందం నిమగ్నమైంది. కొరమీనుగుంట ప్రాంతం నుంచి నివాసాలు, ప్రయివేటు వ్యక్తులు, పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. ఎక్కడా చిన్న బిడ్డను ఎత్తుకుని వెళుతున్న వారి చిత్రాలు కనిపించలేదు. దీంతో
అలిపిరి పోలీసులు సాగిస్తున్న దర్యాప్తుపై ఎస్పీ హర్షవర్ధనరాజు గంటగంటకు వివరాలు తెలుసుకున్నారు. నిందితులు దొరికే వరకు విశ్రమించవద్దని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మధ్యలో సీఐ, ఎస్ఐలతో కూడా మాట్లాడుతూ, దర్యాప్తును పర్యవేక్షించారని సిబ్బంది ద్వారా తెలిసింది.
సీఐ మదిలో సందేహం
ఎన్ని సీసీ కెమారాలు పరిశీలించినా బిడ్డను ఎత్తుకుని వెళుతున్న వ్యక్తులు కనిపించని స్థితిలో కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఐ రామకిషోర్ మెదడులో సందేహం తలెత్తింది. అది కూడా మధ్యాహ్నం తరువాత ఆయనలో కలిగిన సందేహంతో మూడు నెలల బిడ్డ రమ్య తల్లి చందనను మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేపట్టారు.
"అప్పటికీ తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లారనే చందన బుకాయించింది" అని సీఐ రామకిషోర్ చెప్పారు. "గంటపాటు విచారణ తరువాత తన కూతురు రమ్యను తానే హత్య చేసినట్లు అంగీకరించింది" అని సీఐ వివరించారు. తమ సిబ్బంది తోపాటు కొరమీనుగుంట ప్రాంత ప్రజల నుంచి కూడా సహకారం అందిందని ఆయన చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు కూడా గాలిస్తుండగా, ఇంటికి సమీపంలోనే మురుగునీటి కాలువలో పాప మృతదేహాన్ని కనుగొన్నట్లు సీఐ రామకిషోర్ వివరించారు.
పాప భారమై..
చందనకు రమ్య (మూడు నెలల పాప) మూడో కూతురు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఆమె ఒకటే కష్టపడాలి. బిడ్డలను సంతరించాల్సిన పరిస్థితి. భర్త మద్యానికి బానిసై, పనికి వెళ్లకపోవడం వల్ల కుటుంబ భారం చందన మోయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బిడ్డపై మమకారాన్ని ఆమె అదిమిపెట్టుకుంది. బాధను పంటి బిగువన బిగపట్టినట్టే ఉంది. లేకుండా, కన్నబిడ్డను కడతేర్చడానికి ఏ తల్లీ సాహసించదు. ఇక్కడ చందన తన బిడ్డను వదలించుకోవడానికి ఎంత నరక యాతన పడి ఉంటుందనేది ఈ వివరాలు చదివితే అర్థం చేసుకోవచ్చు.
అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు ఆ వివరాలు ఇవి.
"తిరుపతి నగరం కొరమీనుగుంట ప్రాంతానికి చెందిన చందన, భూపతి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మళ్లీ ఆడ బిడ్డ పుట్టింది. మూడు నెలల ఆ పాపకు రమ్మ అని పేరుపెట్టుకున్నారు. పిల్లలను సాకి సంతరించడం చాలా కష్టంగా ఉంది. ఒక బిడ్డను ఎవరికైనా దత్తత ఇద్దాం అనేది చందన సూచన. కొడుకు కోసం తన భార్య చందనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించడానికి అంగీకరించని భూపతి, బంధువులు కోరినా బిడ్డలను దత్తత ఇవ్వడానికి నిరాకరించాడు" అని విచారణలో తేలిందని సీఐ రామకిషోర్ చెప్పారు.
"భర్త భూపతి పనికి వెళ్లకపోవడం. ఉదయం పనికి వెళితే సాయంత్రం ఇంటికి చేరుకునే చందన బిడ్డలను చూసుకోవడం కష్టంగా మారింది. తాగుడు వ్యసనానికి బానిసైన భర్త భూపతి తీరుతో చందన విసిగిపోయినట్లు" తేలిందని సీఐ చెప్పారు.
బిడ్డ ఎలా మరణించింది?
ఇంటిలో మంచంపై ఉన్న తన మూడు నెలల బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారని చందన అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తాను బహిర్భూమికి వెళ్లానని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ చేయడంతో తన కుటుంబ సమస్యల కారణంగా, భర్త తీరుతో విసిగిపోయానని చందన పోలీసుల ముందు అంగీకరించింది. బిడ్డలను సాకడం కష్టంగా మారడంతో తన మూడు నెలల బిడ్డను తానే చంపి, కాలువలో పడేసి, ఈ నాటకం ఆడినట్టు విచారణలో తేలిందని సీఐ రామకిషోర్ వివరించారు. ఉదయం నుంచి తమ సిబ్బంది గాలింపు చర్యల్లో తీవ్రంగా శోధించారని ఆయన వివరించారు. బిడ్డను తల్లే హత్య చేసినట్లు తేలిందని ఆయన తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.