Teacher' suspicious death | బడిలోనే ఆ టీచర్ ఎలా చనిపోయారు?

ఓ ఉర్దూ బడిలో టీచర్ మరణించారు. విద్యార్థుల దాడి వల్లే జరిగిందని భార్య అంటుంటే కాదు... గుండెపోటు అని టీచర్లు, పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ ఏమి జరిగింది?;

Update: 2024-12-05 05:00 GMT

ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెబుతున్నారు. పక్క గదిలో అల్లరి చేస్తున్న విద్యార్థులను ఆయన మందలించాడు. అదే ఆయన పాలిట శాపమైంది. తుది ఘడియలయ్యాయి. తమను మందలించిన టీచర్ పై తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆగ్రహంతో తిరగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి ముందే ఓ విద్యార్థి పారిపోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు దాడితో కుంగిపోయిన ఈ టీచర్ కొద్దిసేపటి తరువాత స్టాఫ్ గదిలోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకుని వెళితే, ప్రార్ధనలో ఉన్నానని డాక్టర్ కూడా నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఆ టీచర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషాధ ఘటన ఉమ్మడి అన్నమయ్య జిల్లా (కడప జిల్లా ) కేంద్రం రాయచోటిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

ఈ సంఘటనపై రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ కథనం మరోలా ఉంది. ఇంతకీ ఏమి జరిగింది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో ఎస్. మహ్మద్ ఎజాజ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తరువాత విద్యార్థులకు పాఠం చెబున్నాడు. అదేసమయంలో పక్కనే ఉన్న గదిలో విద్యార్థుల అల్లరి ఎక్కువగా ఉంది. పాఠం చెప్పడానికి ఇబ్బంది పడిన ఎజాజ్ ఆ గదిలోకి వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులను మందలించాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు విద్యార్థులు తిరగబడ్డారు. వారిలో ఓ విద్యార్థి తరగతి గది నుంచి పారిపోయినట్లు సమాచారం. మిగతా ఇద్దరు విద్యార్థులు టీచర్ ఎజాజ్ పై దాడికి దిగి, ఇస్టానుసారంగా కొట్టారని తెలిసింది. ఆ తరువాత మిగతా టీచర్లు కూడా రావడంతో వారిద్దరు కూడా తరగతి గది నుంచి పారిపోయారని తెలిసింది. ఊహించని విధంగా విద్యార్థులు దాడి చేసిన సంఘటనతో ఎజాజ్ మానసికంగానే కుంగిపోయాడని చెబుతున్నారు.
ఓదారుస్తుండగానే...
విద్యార్థుల దాడిలో గాయపడిన టీచర్ ఎజాజ్ ను మిగతా సహచర ఉపాధ్యాయులు ఓదారుస్తున్నారు. బీపీ, షుగర్ ఏమైనా ఉందా? అని వాకబు చేసి, ఆయన సేదదీరడానికి సపరిచర్యలు చేస్తూ, మంచినీళ్లు కూడా ఇచ్చారని సమాచారం అందింది. మౌనంగా ఉండిపోయిన టీచర్ ఎజాజ్ ఒక్కసారిగా స్టాప్ గదిలో కుప్పకూలాడని తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లడానికి వాహనం లేక సుమారు 15 నిమిషాలు ఆటోకోసం నిరీక్షించి, చివరికి రాయచోటిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని తెలిసింది. సాయంత్రం కావడంతో తాను "నమాజ్ చేసుకుంటున్నా. కాసేపు ఆగండి" అని ఆ డాక్టర్ ఆలస్యం చేయడంతో అప్పటికే టీచర్ ఎజాజ్ ప్రాణాలు వదిలాడని రాయచోటి నుంచి అందిన సమాచారం ద్వారా తెలిసింది.
ఆ తరువాత స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. టీచర్ ఎజాజ్ పై దాడికి పాల్పడిన ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉర్దూ పాఠశాలలో జరిగిన సంఘటతో టీచర్లు విషాదంలో మునిగిపోయారు. ఈ సంగటన రాయచోటి పట్టణంలో సంచలనం కలిగించింది.
ఈ ఘటనపై రాయచోటి సీఐ చంద్రశేఖర్ కథనం మరోలా ఉంది.
"తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లలను టీచర్ మందలించారు" అని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారని సీఐ చంద్రశేఖర్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఆ తరువాత స్టాఫ్ రూంలోకి టీచర్ ఎజాజ్ వచ్చారనీ, యనకు సేవలు చేస్తుండగానే కొద్దిసేపటికి గుండెనొప్పితో పడిపోయాడు. అని టీచర్లు చెబుతున్నారని సీఐ వివరించారు. ఈ సంఘటనపై మాకు ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదు. పూర్తిగా విచారణ చేస్తే కానీ, వివరాలు చెప్పలేమని సీఐ చంద్రశేఖర్ అంటున్నారు. ఇదిలావుంటే,
సీన్ రివర్స్
ఉర్దూ సైన్స్ ఉపాధ్యాయుడు ఎజాజ్ మృతేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లాక భర్త మరణంపై రెహమూన్ సందేహాలు వ్యక్తం చేశారు. తన భర్త ఛాతీపై ముగ్గురు విద్యార్థులు కూర్చుని కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపించడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. ఈ ఘటనపై ఉపాధ్యాయులు, పోలీసులు వాస్తవాలు ఎందుకు దాస్తున్నారనే తెలియడం లేదని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెహమూన్ సందేహాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎజాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ సంఘటన జరిగిన బుధవారం రాత్రి సీఐ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించడంలో కూడా సుముఖత చూపలేదు. అసలు మాకు ఇంతరకు ఫిర్యాదు అందలేదని రాత్రి 8.30 గంటలకు చెప్పారు. ఎట్టకేలకు టీచర్ ఎజాజ్ మరణంపై భార్య రెహమూన్ ఫిర్యాదుతో పోలీసులు కదలకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు తేలుస్తారనేది వేచిచూడాల్సిందే.

వాస్తవాలు చెప్పండి

రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి జెడ్పీ ఉర్దూ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎజాస్ అహమ్మద్ అనుమానాస్పద మృతి విచారకరమని వైసీపీష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలో ఈ సంఘటన ఎలా జరిగింది, ఏమి జరిగింది, గత కొద్దిరోజులుగా ఏమి జరుగుతుందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. స్థానిక హెచ్ఎం, పోలీసులు ప్రజలకు వాస్తవాలు తెలపాలని కోరిన ఆయన విద్యార్థుల దాడిలోనే ఉపాధ్యాయుడు మరణించారని వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ టీచర్, నిజాయపరుడిగా మన్ననలు పొందిన మృతిపై విద్యాశాఖ, పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. 

Tags:    

Similar News