తిరుమల శ్రీవారి ఆలయం లో హోమంతో ప్రోక్షణ...!

తిరుమల శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడానికి హోమ నిర్ణయించాలని టిటిడి నిర్ణయించింది. సోమవారం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

Update: 2024-09-22 16:23 GMT

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వు నుంచి తీసిన నూనెలు, చేప నూనె కలిసిందనే సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణల నేపథ్యంలో ప్రపంచంలో తీవ్ర అలజడి చెలరేగింది.ఈ  పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో శుద్ధి జరగడానికి ఏమి చేయాలనే విషయంపై టీటీడీ ప్రధాన అర్చకులతో పాటు ఆగమశాస్త్ర సలహాదారులతో సమావేశమైన ఈవో జే. శ్యామలరావు 48 గంటల పాటు మల్లగుల్లాలు పడ్డారు. అయినా ఎలాంటి నిర్ణయం చేయలేక పోయారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరిగిందని రెండు నెలల కింద అందిన నివేదికలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారాన్ని ఈనెల 18వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు బాహ్య ప్రపంచానికి తెలియజేయడం ద్వారా హిందూ సమాజంలో అలజడి చెలరేగింది.
దీంతో ఆలయ పవిత్రను కాపాడడానికి ఏమి చేయాలనే విషయంపై శనివారం నుంచి రెండు రోజులపాటు తిరుపతి టీటీడీ భవనంలో ఈవో శ్యామల రావు ఆలయ ప్రధాన అర్చకులైన వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు కృష్ణమాచార్య దీక్షితులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని పండిత పరిషత్ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ అంతిమంగా నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఇందులో సంప్రోక్షణ చేయాలా లేక మహా సంప్రోక్షణ చేయాలా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. సంప్రోక్షణ చేయడానికి మూడు రోజులు, మహా సంప్రోక్షణకు 12 రోజులు పడుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపించాయి. భక్తులను ఆపడానికి అవకాశం లేకుండా పోతుందనే దానిపై తర్జనభర్జన పడ్డారు.
సీఎంను కలిశాక...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం ఎన్ చంద్రబాబును ఆహ్వానించడానికి వేద పండితులతో కలిసి టీటీడీ ఈవో శ్యామలరావు ఆదివారం మధ్యాహ్నం అమరావతికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆహ్వాన పత్రిక అందించడంతోపాటు ఎలాంటి సూచనలు చేశారో తెలియదు కానీ, తిరుపతిలో ఏడు గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని టిటిడి సమాచార విభాగం ప్రకటించింది. వారు రావడం ఆలస్యం కావడంతో రాత్రి 9 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించారు.
టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జరిగిన కల్తీ వల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించారు.
అందులో ప్రధానంగా..
తిరుమల ఆలయం లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళా మాత ఆలయానికి సమీపంలోని బంగారు బావి పక్కన యాగం చేయాలని నిర్ణయించారు.
"వాస్తు హోమం తోపాటు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించాలని ఆగమ శాస్త్ర సలహా మండలి సభ్యులు సూచనలు చేశారు" అని ఈవో శ్యామలరావు వివరించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని ప్రదేశాలతోపాటు ఆలయం వెలుపల వాస్తు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించాలని నిర్ణయించాం" అని చెప్పారు.
దోషం సగం పోయింది
" శ్రీవారి ఆలయం, స్వామివారికి సమర్పించిన ప్రసాదాలు ఇతరత్రా వ్యవహారాల్లో తెలిసో తెలియకో జరిగిన సగం దోషాలు పోయాయి" అని కూడా ఈవో శ్యామలరావు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారికి పవిత్ర ఉత్సవాలు ఇటీవల నిర్వహించారు. దీని ఉద్దేశం ఏమిటి అంటే తెలిసి తెలియకో జరిగిన తప్పులను క్షమించండి. సర్వలోకాలను సుఖశాంతులతో చూడండి అని ప్రార్థించడమే ఉద్దేశం.
ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తయినందున ఆలయంలో జరిగిన దోషాలు సగం సమసిపోయాయి. మిగతా సగం హోమాలు, పంచగవ్య పోషణతో ఆలయం పరిసరాలను శుద్ధి చేసే కార్యక్రమాలతో పోతాయని, అందుకే యాగం నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.


Tags:    

Similar News