వరద మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం.. ఏపీకి భారీ విరాళాలు..

ఆంధ్రప్రదేశ్ వరద మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు.

Update: 2024-09-04 10:22 GMT

ఆంధ్రప్రదేశ్ వరద మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా మృతుల మృతదేహాలను వారి కుటుంబీకులకు వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని, తమవారి మృతదేహాల కోసం ఏ కుటుంబం కూడా ఎదురుచూసే దుర్భర స్థితి రాకూడదని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా వరద మృతదేహాలకు సేకరించడానికి ఎవరూ రాని యెడల సదరు మృతదేహాలకు ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం యుద్ధప్రాతిపదికన అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా వరద బాధితులకు అందించే సహాయక చర్యలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

సహాయం ఇంటికే అందాలి..

వరద ప్రభావం తగ్గిన క్రమంలో వరద ప్రాంతాల్లో అందిస్తున్న సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వరద తగ్గిన క్రమంలో సహాయక చర్యలను డోర్ టు డోర్ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, కేజీ పంచదార అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించలని, కూరగాయాలను అతి తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పలు చోట్ల మంచినీళ్ల బాటిళ్లను కూడా అత్యధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించి అలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరద బాధితులకు హీరోల భారీ విరాళం..

ఏపీని వరదలు ముంచెత్తిన క్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహాయం అందించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ తదితరులు తమకు తోచినంత మొత్తంలో విరాళాలు ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ విరాళాలు ప్రకటించారు. ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా అల్లు అర్జున్.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయాల విరాళం అందివ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే వరద బాధితుల కోసం ప్రభాస్.. రూ.5 కోట్ల విరాళం అందించినట్లు ప్రచారం జోరుగా సాగగా అందులో వాస్తవం లేదని తేలింది.

తెలుగు సీఎంలపై మాజీ సీజేఐ ప్రశంసలు

రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల తీవ్రత ఏపీ విజయవాడలో అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరదల సమయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఎంతో అద్భుతంగా పనిచేశారంటూ మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ ప్రశంసలు కురిపించారు. అంతకన్నా ముందు ఏపీ వరద బాధితుల కోసం తన వంత సాయంగా రూ.50 లక్షల విరాళం అందివ్వనున్నట్లు ప్రకటించారు. గురజాడ స్ఫూర్తితో తన వంతు సాయం అందించానని ఆయన చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్విరామంగా పనిచేశారని, ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలను తెలుసుకుంటూ తగిన చర్యలు చేపట్టారని వారిని ప్రశంసించారు.

Tags:    

Similar News