తిరుమలలో గరుడోత్సవం.. తిరుపతిలో యాత్రిక నరకం..

రద్దీ నియంత్రణకు ఏడువేల మంది పోలీసులతో అసాధారణ భద్రత. ఆదివారం తిరుపతిలో పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్.

Update: 2025-09-28 11:35 GMT
అలిపిరి వద్ద అసాధారణ పోలీసు బందోబస్తు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మెత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అసాధారణ భద్రత కారణంగా తిరుపతి నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం ఒంటి గంటకే కేవలం 50,523 మంది యాత్రికులను మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో తరలించగలిగారు. ఈ వార్త రాసే సమయానికి ఆ సంఖ్య 60 వేల నుంచి 65 వేల మంది వరకు ఉన్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ జగదీష్ కార్యాలయవర్గాలు చెప్పాయి.


తిరుమలకు వెళ్లడానికి ప్రధానద్వారంగా ఉన్న అలిపిరి పాదాల మండపం సమీపంలోని గరుడా సర్కిల్ ను చరిత్రలో మొదటిసారి పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహారాచారి సారధ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.

"మేము పలమనేరు నుంచి వస్తున్నాం. టీటీడీ ఎస్వీబీసీ స్టేషన్ సమీపంలో కారు ఆపేశారు. అక్కడి నుంచి నడిచివస్తున్నాం. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు" అని బాలాజీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కఠినమైన నిబంధనల వల్ల యాత్రికుల సంఖ్య క్రమబద్ధీకరించడం ఏమో కానీ, తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే విధంగా చేస్తున్నారు" అని అభిప్రాయపడ్డారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రికి శ్రీవారికి నిర్వహించే గరుడోత్సవానికి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తుండడం సహజం. కనీసంగా ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందన గత రికార్డులను పరిశీలించి, అంచనా వేసిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేశారు.
"తిరుపతిలోనే గరుడోత్సవం చుక్కలు కనిపిస్తున్నాయి. మేము ఇది ఊహించలేదు. దేవుడిని చూడాలనే కోరికముందు ఇవి పెద్ద కష్టాలు కాదులే" అని సుండుపల్లెకు చెందిన సుబ్బారెడ్డి నిరసన స్వరంతో అన్నారు.
రద్దీపై ఆంక్షల కొరడా..

అనూహ్యమైన ఆంక్షలతో తిరుమలకు రద్దీ నియంత్రణకు అవకాశం కల్పిస్తున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికే తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధులు యాత్రికులతో కిక్కిరిసినట్లు సమాచారం అందుతోంది. గ్యాలరీల్లో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఇనుప బారికేడ్లతో కాంపార్టుమెంట్లు ఏర్పాటు చేసింది. నాలుగు వైపులతో పాటు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం వరకు టీటీడీ లెక్కల ప్రకారం 1.80 లక్షల మంది కూర్చేనే అవకాశం ఉంది.
తిరుపతి లోని అలిపిరి చెక్ పోస్టులో రికార్డయిన లెక్కల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 60 వేల మందిని తరలించినట్లు ఆర్టీసీ వర్గాలు చెప్పారు. శనివారం 70 వేల మంది యాత్రికులు ప్రయాణించారని ఆర్టీసీ ఆర్ఎం జగదీష్ కార్యాలయం సిబ్బంది చెప్పారు.
అసాధారణ భద్రత

తిరుపతి ఇస్కాన్ ఆలయం సమీపంలోని టీటీడీ వరదరాజనగర్ క్వార్టర్ మైదానం వద్ద..

"ఈసారి బ్రహ్మోవాలకు ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలోని 1,500 మందికి సిలిల్ పోలీసులు అదనం. గరుడోత్సవం రోజు అదనంగా 1300 మంది పోలీసులు బందోబస్తులోకి వస్తారు" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ మరకే తిరుపతి చేరుకున్న రాయలసీమ, నెల్లూరు, ఇతర జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు.
తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించారు.

తిరుమలలో గరుడోత్సవం నేపథ్యంలో నగరంలోని ఇస్కాన్ ఆలయం మైదానం, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్టేషన్, ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జూపార్కుకు సమీపంలో ఇంద్రలోక్ కాంప్లెక్స్ వద్ద వాహనాల పార్కింగ్కు కేటాయించిన ప్రాంతంలో పరిస్థితిని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పరిశీలించిన సమయంలో ఏమి కనిపించిందంటే.. ఆ ప్రదేశాలన్నీ వందలాది బస్సులు, కార్లు, ద్విచక్ర వాహాలతో నిండిపోయి కనిపించింది.
అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లేమార్గంలో సైన్స్ సెంటర్ సమీపం నుంచి కొందరు యాత్రికుల బృందం నడిచివస్తే కనిపించారు. వారిని పలకరిస్తే, మదనపల్లెకు చెందిన బాలాజీ మాట్లాడుతూ,
"వాహనపార్కింగ్ కేంద్రాల నుంచి నడిచి వెళ్లడంతోనే దేవుడు కనిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం మేము గరుడోత్సవం రోజు వస్తుంటాం. ఈసారి ఉన్నంత కట్టడి ఇంతకుముందెప్పడూ చూడలేదు" అని బాలాజీ చెప్పారు.
"వారిలో ఓ యువకుడు మాత్రం రద్దీని నియంత్రించడానికి ఇది చాలా అవసరం" అని వ్యాఖ్యానించారు. మరొకరు వెంటనే స్పందించి ఈమాదిరి అయితే, జనం చాలా మంది ఎందుకులేబ్బా పోవడం అని అనుకుంటారు. దీనివల్ల స్వామివోరికి ఆదాయం పోతాదిరా సామి. నువ్వు గమ్మన ఉండు" అని గోవిందమాల ధరించి ఉన్న యాత్రికుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుమలతో పాటు తిరుపతిలో కూడా భారీ భద్రత కల్పించారు. అందులో ప్రధానంగా చీమ కదిలిన తెలిసే విధంగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత పదేళ్లతో పోలిస్తే బ్రహ్మోత్సవాల్లో ద్విచక్రవాహనాలు కూడా అనుమతించేవారు. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గరుడోత్సవానికి ముందు రోజు నుంచి మరుసటి రోజు వరకు అంటే 48 గంటలపాటు బైక్ లు అనుమతించని విధానం వైసీపీ ప్రభుత్వంలో అదనపు ఈఓగా ఉన్న ఏవీ.ధర్మారెడ్డి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసే విధానం అమలులోకి తెచ్చారు. విపరీతమైన ఆంక్షల నేపథ్యంలో రెండేళ్ల కిందటి బ్రహ్మోత్సవ వేళ బైక్ పార్కింగ్ బోసిపోయింది. దీంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. అయినా,

యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేసిన విధానం మంచి ఫలితాలే ఇచ్చింది. అలిపిరి వద్ద ఆదివారం ఉదయం నుంచి ప్రస్తుతం పరిస్థితి గమనిస్తే, వేలాది బైక్ లతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
ఆంక్షలతో రద్దీ తగ్గిందా?

బ్రహ్మోత్సవాల కోసం యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం 435 బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ రిజనల్ మేనేజర్ జగదేశ్ చెప్పారు. గత ఏడాది ఆ సంఖ్య 400 మాత్రమే. గరుడోత్సవం రోజు మూడు వేల ట్రిప్పులు తిప్పారు.
"సాధారణ రోజుల్లో తిరుమలకు తిరుపతి డిపో నుంచి 103 బస్సులు, అలిపిరి డిపో నుంచి 147 బస్సులు, మంగళం డిపో నుంచి మాత్రమే 90 బస్సులు, తిరుమల డిపో నుంచి 93 అల్ట్రా డీలక్స్ నడుపుతున్నాం" ఆర్ఎం జగదేశ్ వివరించారు. అంటే రోజుకు 1,350 ట్రిప్పుల్లో సగటున 77,500 మంది ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. గరుడోత్సవం రోజు 3,500 సర్వీసులు సోమవారం ఉదయం వరకు నిరంతరాయంగా నడపడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెబుతున్నారు. కాగా,

ఆదివారం మధ్యాహ్న అలిపిరి బస్టాండ్ వద్ద బస్సుల కోసం పెద్ద సంఖ్యలో యాత్రికులు నిరీక్షిస్తూ కనిపించారు. బస్సుల్లో ఎక్కడానికి తీవ్రంగా తాపత్రయపడ్డారు. వారిని నియంత్రించే దిక్కులేకుండా పోయిన పరిస్థితి కనిపించింది.

గరుడోత్సవం చూసి, తిరుమల నుంచి తిరిగి వచ్చే యాత్రికులను తిరుపతి సెంట్రల్ బస్టాండ్ వరకు తరలించడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.
ఇంద్రలోక్ కాంప్లెక్స్ వద్ద...

శనివారం సాయంత్రం చిత్రం. ప్రస్తుతం ఈ మైదానం మొత్తం నిండిపోయింది

అలిపిరి బైపాస్ మార్గంలోని జూపార్కుకు సమీపంలో అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా, ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆంధ్రలోని పట్టణాల నుంచి కూడా భారీ సంఖ్యలో బస్సుల్లో వచ్చారు. ఆ బస్సులన్నీ అక్కడే పార్కింగ్ చేయించారు. సిబ్బందికి భోజన సదుపాయం కల్పించడానికి టీటీడీ మొదటిసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
"ఇక్కడి నుంచి అలిపిరి బస్టాండు వద్దకు రావడానికి, తిరుమల నుంచి వచ్చాక అంతదూరంలోని పార్కింగ్ కేంద్రం వద్దకు వెళ్లడానికి బస్సులు అందుబాటులోవు" దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అదే సమయంలో అలిపిరి మార్గంలో నడిచివస్తున్న రాయచోటి పట్టణానికి సమీపంలోని సుండుపల్లెకు చెందిన బృందం వస్తూ కనిపించింది. వారిలో సుబ్బారెడ్డిని పలకరిస్తే..

"చాలా మంచిగా కష్టాలు పెడుతున్నారు సార్. అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మేమే మొదటిసారి తిరుమలకు రాలేదు. ఇంతకుముందెప్పుడూ ఈ పరిస్థితి చూడలేదు. తిరుమలలో ఏమో కానీ గరుడోత్సవం తిరుపతిలోనే కనిపిస్తోంది" అని ఆవేదన చెందారు. తిరుపతి నగరంలో అంతర్భాగంగా ఉన్న ఇస్కాన్ టెంపుల్ మైదానం కార్లు, ఇతర వాహనాలతో నిండిపోయింది. ఈ ప్రదేశంలోనే కొందరు పోలీసులు యాత్రికులపై బూతు పంచాంగం వినిపించిన ఘటన చోటు చేసుకుంది.

అలిపిరికి సమీపంలో పార్కింగ్ కేంద్రం వద్ద..

తిరుమల గరుడోత్సవం రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లు ఔరా అనిపించే విధంగానే కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ప్రొటోకాల్, ఇతర వీఐపీలు వారి సిఫారసులతో మాత్రమే సొంత వాహనాలను తిరుమలకు అనుమతించడం కనిపించింది.
Tags:    

Similar News