బెంగళూరు... తిరుపతిలో హైటెన్షన్ ... మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఏం చేశారు?

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్. లుక్ ఔట్ నోటీస్ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎందుకు కట్టడి చేశారు. ఈ తరువాత ఏం జరిగింది?

Update: 2024-07-28 15:30 GMT

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే కుమారుడు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో హైటెన్షన్ ఏర్పడింది. నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోహిత్ విదేశాలకు పారిపోతున్నాడనే కారణంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను ఆదివారం తిరుపతికి తీసుకువచ్చారు. జిల్లా దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ (పులివర్తి నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో ఆయన చేతిలో పరాజయం పాలైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ-37 నిందితుడిగా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచిచూడాలి.

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉంది. వివిధ దేశాలకు వెళ్లే విమానాల సిద్ధంగా ఉన్నాయి. బోర్డింగ్ పాసులు జారీ చేస్తున్నారు. అదే సమయంలో క్యూ లో ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తమ్ముడుతో కలిసి నిలబడి ఉన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో మోహిత్ రెడ్డిని విమానాశ్రయ సిబ్బంది అడ్డగించారు. వారితో మోహిత్ రెడ్డి వాదనకు దిగారు. బోర్డింగ్ పాస్ జారీ చేయడానికి ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించారు.
2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరువాత ఈవీఎంలు భద్రపరిచిన తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇవి దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో...
దుబాయ్ వెళ్లడానికి బోర్డింగ్ పాస్ కోసం క్యూలో ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు నియంత్రిం, కర్ణాటక పోలీసుల ద్వారా ఏపీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరచారి, ఎస్వీయూ స్టేషన్ సీఐ మురళీమోహన్ ప్రత్యేక పోలీసులు బెంగళూరుకు వెళ్లారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని తిరుపతికి బయలుదేరారు.
వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో అలజడి..
చిత్తూరు జిల్లాలో ఈ సంఘటనతో వైయస్ఆర్సీపీ నాయకుల తోపాటు, తీవ్ర అలజడి చెలరేగింది. సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది. తిరుపతి చంద్రగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీస్ అధికారులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నుంచి బయలుదేరిన అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, బయట ఆయన తండ్రి పార్టీ శ్రేణుల నిరసన నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
జిల్లా దాటవద్దని ఆంక్షలు
తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో దాదాపు గంటపాటు మోహిత్ రెడ్డిని విచారణ చేసిన ఎస్వీయూ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి పంపిచేశారు. జిల్లా దాటి వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు విధించడంతో పాటు, ఎప్పడు పిలిచినా, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో శనివారం రాత్రి నుంచి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో రాజ్యమేలిన ఉత్కంఠకు తెరపడింది.


మాజీ ఎమ్మెల్యే నిరసన
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఎస్వీయు సమీపంలని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.
తన కుమారుడిని అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆదివారం కావడంతో మోహిత్ రెడ్డిని జడ్జి ముందు హాజరు పరుస్తారని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దాది జరిగిన 52 రోజుల తరువాత కేసు బుక్ చేయడం ఏమిటి? అని భాస్కరరెడ్డి ఆరోపించారు.

"అది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు. సంఘటన జరిగిన రోజు పద్మావతి వర్సిటీలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నా కుమారుడు మోహిత్ రెడ్డి ఉన్నారు. ఆయన వద్ద ఫోన్ కూడా లేదు" అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. " ఆ సమయంలో మోహిత్ రెడ్డి కలెక్టర్, జేసీ, ఎన్నికల రిటర్నింగ్ సమీపంలోనే ఉన్నారు" అని గుర్తు చేశారు. "అరెస్ట్ చేయడం ద్వారా భయాందోళన సృష్టించడానికే ఇలా చేశారు" అని ఆరోపించారు. నా కుమారుడు లండన్ లో చదవాడు. స్నేహితుడి వివాహానికి దుబాయ్ బయలుదేరారు. ఆదివారం రాత్రి తిరిగి చెన్పైకు చేరుకునే విధంగా టికెట్టు బుక్ చేసుకున్నాడు" అని వివరించారు. ఆ టటనపై ఎప్ఐఆర్ లో పేరు లేదు. మెమో మాత్రమే దాఖలు చేశారు. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసే పోలీసులకు అక్షింతలు తప్పవని హెచ్చరించారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తికి వీధిపోరాటాలకు సిద్ధం చేయించారని అన్నారు.


ఉత్కంఠకు తెర
ఆ తరువాత పోలీసులు మోహిత్ రెడ్డికి 41_సీ సీనోటీసులు అందించి, వదిలేశారు. జిల్లా దాటి వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. ఎప్పుడూ పిలిచినా విచారణకు రావాలని కూడా ఆదేశించారు. దీంతో శనివారం రాత్రి నుంచి ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. దుబాయ్ పర్యటన వెనుక కారణాన్ని మోహిత్ రెడ్డి వివరించారు. "తాను అమెరికాలో చదువుకునే రోజుల్లో పరిచయం అయిన స్నేహితుడి వివాహానికి బయలుదేరాను. తిరిగి ఆదివారం రాత్రి దుబాయి నుంచి బయలుదేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకోవడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు" మోహిత్ వివరించారు. తన సెల్ ఫోన్ లో టికెట్ చూపించారు. మినహా ఆ స్నేహితుడు ఎవరు? వివాహపత్రిక మాత్రం బయటపెట్టకపోవడం గమనార్హం.
చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సాగిస్తున్న అక్రమాలు, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్న తన తండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పై కక్షతోనే ఘటన జరిగిన 52 రోజుల తరువాత తన పేరు కలిపారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. "పోలీసులు తమాషా చేశారు. దీనికి భయపడే ప్రసక్తి లేదు. ఎటువంటి పోరాటికైనా సిద్ధం. ప్రభుత్వమే తనను వీధిపోరాటాలకు సిద్ధం చేసింది" అని వ్యాఖ్యానించారు. "తన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్ఫూర్తితో పోరాటం సాగిస్తా.  తనపై ఇది మొదటి కేసు. క్యాడర్ ను భయాందోళనకు గురి చేయడానికి ఇదంతా చేస్తున్నారు" అని ఆరోపించారు. 
ఈ వ్యవహారంపై తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ, "ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు సాగుతోంది" అని మాత్రమే మీడియాతో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని తాడిపత్రి, పలనాడు తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి వద్ద ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనపై మొదట 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ తరువాత 34 మంది నిందితులను గుర్తించి కోర్టు ముందు హాజరు పరిచారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.


శిక్ష తప్పదు.. పద్ధతి మార్చుకోండి
"తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు" అని టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆదివారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తప్పుడు కేసులు పెట్టడానికి నేను రెండు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చంద్రగిరిలో జరిగిన దాడుల విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అభివృద్ధికి సమయం చాలడం లేదు.ఇక మీపై కక్ష సాధింపు చర్యలకు నాకు సమయం ఎక్కడిది చెవిరెడ్డి అని ప్రశ్నించారు.  విచారణలో నిందితులు మీపేరు (చెవిరెడ్డి, కుమారుడు) ఎందుకు చెప్పారో అది తెలుసుకోండి. విదేశాలలో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా? నాపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథరెడ్డి,  భానుపై ఫిర్యాదు చేశానని ఆయన స్పష్టం చేశారు. తానిచ్చిన ఫిర్యాదులోని పేర్లు కాకుండా సంబంధంలేని పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారని ఆయన పోలీసులపై కూడా ఆరోపణ చేశారు. చెవిరెడ్డి కనుసన్నల్లో  పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం అప్పుడు నా కంప్లైంట్ పరిగణలోకి తీసుకోలేదన్నారు.తనపై హత్యాయత్నం, దాడికి సంబంధించి విజయవాడకు చెందిన అధికారులు పూర్తి సమాచారం ఇచ్చారని పులివర్తి నాని వెల్లడించారు.
Tags:    

Similar News