అంగుళం ఆక్రమించినా..చుక్కలే
విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిని ఇబ్బందులు పెట్టినా లేదా దాడులు జరిగితే కఠిన చట్టపర చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అడవులు జాతీయ సంపద, ప్రతి అంగుళం అమూల్యమని, ఆక్రమణలు ఎవరు చేసినా ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఆవరణలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లడం, ఎకో టూరిజంతో గిరిజన యువతకు ఉపాధి, గ్రేట్ గ్రీన్ వాల్‌తో హరితాంధ్ర నిర్మాణం, అటవీ శాఖను ఆదాయ వనరుగా మార్చడం వంటి కీలక అంశాలపై మాట్లాడారు.
అడవుల రక్షణ..రాజకీయాలకు తావులేదు
అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాజకీయాలకు, రాజీలకు ఇక్కడ తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలో అటవీ భూములను ఆక్రమించుకున్నప్పుడు అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం కాలేదని, అటవీ అధికారులు కఠినంగా స్పందించాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి తప్పిదాలకు అవకాశం లేదని, ఒక అంగుళం అటవీ భూమి ఆక్రమణ జరిగినా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అటవీ సిబ్బంది భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తూ, విధి నిర్వహణలో ఇబ్బందులు లేదా దాడులు జరిగితే కఠిన చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకుని సిబ్బందికి న్యాయం జరిగేలా చూశామని, అధికారులు భయపడకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.
అటవీ భూముల స్వాధీనం, పచ్చదనం పెంపు
రాష్ట్రంలో నోటిఫై చేసిన అడవులు 22 శాతం భూభాగంలో ఉన్నాయి. డీ-నోటిఫై చేసిన భూములతో కలిపితే 31 శాతం ఉండవచ్చని అంచనా. కానీ, ఆక్రమణలతో పచ్చదనం ఎంత మిగిలిందనేది ప్రశ్నార్థకం. దీనిపై సమగ్ర సర్వే చేసి, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా ప్రజల భాగస్వామ్యంతో పని చేయాలని సూచించారు.
గ్రేట్ గ్రీన్ వాల్ .. తీర రక్షణకు ప్రణాళిక
974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రంలో, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మడ అడవుల పెంపకంతో తీర రక్షణ కీలకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాటి, పాల్మిరా, పాడనస్ వంటి తీరప్రాంత జాతుల మొక్కలు నాటి, ఆకు పచ్చని గోడ నిర్మాణానికి కాలపరిమితితో పని చేయాలని సూచించారు. ఇది తీరప్రాంత జనాభాకు జీవన భరోసాను, తుపాన్లు, సునామీల నుంచి రక్షణను, సముద్ర జీవవైవిధ్య సంరక్షణను అందిస్తుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర కోత సంవత్సరానికి 10 అడుగులకు పైగా ఉందని, మడ అడవులతో దీనిని నివారించవచ్చని అన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్ష్యాన్ని అధిగమించేలా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఎర్రచందనం విత్తనాలు, స్మగ్లింగ్ నిరోధం
శేషాచలం అడవుల్లో 1987లో హెలీకాప్టర్ల ద్వారా ఎర్రచందనం విత్తనాలు చల్లిన ప్రయత్నం ఆర్థిక బీజాలు వేసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి రాష్ట్రానికి రప్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కర్ణాటకలో రూ. 110 కోట్ల విలువైన ఎర్రచందనం వేలం వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
అటవీ శాఖ సిబ్బంది కొరత, భద్రత
అటవీ శాఖలో సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు కేబినెట్‌లో చర్చించామని, నియామకాల్లో పారదర్శకత పాటించాలని, సిఫారసులకు తావు లేకుండా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, విధి నిర్వహణలో ఇబ్బంది పెట్టిన ఎవరినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సమస్యలు ఉంటే తనను నేరుగా కలవాలని అధికారులకు సూచించారు.
కలప ఉత్పత్తి, ఎకో టూరిజం
దేశంలో ఏటా రూ. 22 వేల కోట్ల విలువైన 900 లక్షల క్యూబిక్ మీటర్ల కలపను దిగుమతి చేసుకుంటున్నామని, డీ-నోటిఫై భూముల్లో కలప పెంపకంతో ఈ అవసరాన్ని తీర్చవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, విద్యా శాఖల సమన్వయంతో కలప పెంపకం చేపట్టాలని, దీనితో అటవీ శాఖ ఆదాయ వనరుగా మారుతుందని చెప్పారు. ఎకో టూరిజంతో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని, కమ్యూనిటీ ఆధారిత టూరిజంపై దృష్టి పెట్టాలని సూచించారు.
హస్తకళలకు ముడి కలప
ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి అంకుడు, తెల్ల పొనికి చెట్ల పెంపకం అవసరమని, ఈ చెట్లను విస్తృతంగా పెంచి కళాకారులకు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తెల్ల పొనికి చెట్లు నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి, దీనిపై పైలట్ ప్రాజెక్ట్‌గా పని చేయాలని సూచించారు.
మానవ-జంతు సంఘర్షణ
చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మదపు ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని, చిత్తూరులో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెప్పించామని, శ్రీకాకుళంలో ఒడిశా నుంచి వచ్చిన 9 ఆడ ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
గ్రీన్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
ఈ సందర్భంగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రచార పోస్టర్లను పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్‌ఐఆర్‌డీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి, ప్రతి మొక్క వివరాలను తెలుసుకున్నారు. జమ్మి చెట్టు నాటారు. ఈ వర్క్‌షాప్‌లో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జున రావు, ఉన్నతాధికారులు రాహుల్ పాండే, శాంతిప్రియా పాండే, ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్ పి.ఎస్. రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు.