పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..అందుకేనా
మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా ఇరువురు ఏకాంతంగా వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం మర్యాదపూర్వక భేటీగా జరిగినట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ భేటీలో చర్చించిన నిర్దిష్ట అంశాలపై అధికారిక వివరాలు వెల్లడి కానప్పటికీ, ఇద్దరి మధ్య ఈ సమావేశం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై చర్చలకు సంబంధించి ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో అటవీ రక్షణ, ఆక్రమణల నిరోధం, గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.