Tirupati | ఈత సరదా.. స్వర్ణముఖి నది వద్ద విషాదం..
నలుగురు పిల్లల గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-24 15:31 GMT
తిరుపతి నగరానికి సమీపంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఒక పిల్లవాడి మృతదేహం అతికష్టం మీద కనుగొని ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురు పిల్లలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తిరుపతి నగరం వేదాంతపురం వద్ద శుక్రవారం సాయంత్రి ఈ సంఘటన జరిగింది. గల్లంతైన బాలుర కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్సీ రవిమనోహరాచారి గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు, ప్రధానంగా తిరుపతికి సమీపం నుంచి శ్రీకాళహస్తి మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
తిరుపతికి సమీపంలోని వేదాంతపురం ప్రాంతంలో ప్రవహిస్తున్న నదిలో స్నానానికి దిగిన పిల్లలు కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు. అదేసమయంలో నీటి ఉధృతి పెరగడంతో ప్రకాష్, తేజు, మునిచంద్ర, బాలు అనే పిల్లలు నీటిలో కొట్టుకొనిపోయారు. కాస్త ఒడ్డునే ఉన్న మరో ముగ్గరు పిల్లలు విష్ణు, మణిరత్నం, కృష్ణ ఒడ్డుపైకి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గల్లంతైన పిల్లల తల్లిదండ్రలు స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డు వెంబడి గాలిస్తూ, కన్నీటిపర్యంతం అయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసులు
స్వర్ణముఖి నదిలో పిల్లలు గల్లంతయ్యారనే సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, సిబ్బందితో కలిసి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. పోలీసు సిబ్బందితో పాతు అగ్నిమాపక SDRF బృందాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి పొద్దుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. సెర్చ్ లైట్ల సాయంతో పిల్లల్లో డ్రోన్‌ల సహాయంతో గాలింపు సాగిస్తున్నారు.
ఒకరి మృతదేహం లభ్యం
స్వర్ణముఖి నదిలో గల్లంతైన నలుగురు పిల్లల్లో ఒకరి మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడం, రాత్రి కావడంతో డ్రోన్లు, లైట్ల వెలుగులో ఒక బాలుడి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. మిగతా ముగ్గురు పిల్లల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు సాగిస్తున్నారు.