జర్నలిస్టుల కోసం.. ఈ ఎంపీ.. కేంద్ర మంత్రిని ఏమి కోరారు..?
తమ ఎదుగుదలకు ఊతం ఇచ్చిన వృత్తిని అసలు మరువకూడడు. అని ఎంపీగా గెలిచిన సాధారణ జర్నలిస్టు చెప్పకనే చెబుతున్నారు. తన ప్రమాణస్వకారం తరువాత మొదటి వినతిపత్రంతో జర్నలిస్టుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-07-04 15:05 GMT
తమ ఎదుగుదలకు ఊతం ఇచ్చిన వృత్తిని అసలు మరువకూడడు. అని ఎంపీగా గెలిచిన సాధారణ జర్నలిస్టు చెప్పకనే చెబుతున్నారు. తన ప్రమాణస్వకారం తరువాత మొదటి వినతిపత్రంతో జర్నలిస్టుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
గ్రామీణ ప్రాంత విలేఖరిగా పని చేసిన ఆయన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని జర్నలిస్టులకు మేలు చేయడానికి విధంగా జాతీయ రహదారులపై టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రికి వినతిపత్రం ఇవ్వడం ద్వారా తన మొదటి అడుగు వేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, తన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే జర్నలిస్టుల పురోభివృద్ధికి కూడా పాటుపడతానని బీసీ సామాజికవర్గం నుంచి టీడీపీ ఎంపీగా విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు అంటున్నారు.
రాజుల కోటలో మాజీ జర్నలిస్టు..
విజయనగరం జిల్లా రాజ్యాధీశుల పురుటిగడ్డ. కాకలుతీరిన నేతలు ఉన్నారు. ఈ ప్రాంతం బీసీ సామాజిక వర్గానిదే ఆదిపత్యం ఉన్నప్పటికీ విజయనగరం, బొబ్బిలి రాజశంశీకులను గౌరవంగా ఆదరిస్తారు. అందుకే పూసపాటి అశోకగజపతిరాజు రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కిమిడి కళావెంకట్రావు వంటి వారు కూడా చక్రం తిప్పుతారు. కానీ, 2009లో విజయనగరం పార్లమెంట్ స్ధానం ఏర్పడిన తరువాతి నుంచి పరిశీలిస్తే, ఒకసారి విజయం సాధించిన వారు. మళ్లీ ఎన్నికల్లో గెలవకపోవడం ఓ ప్రత్యేకత. ఆ కోవలోనే... 2019ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ ఎంపీ పూసపాటి అశోక గజపతిరాజును వైఎస్ఆర్ సీపీ నేత బెల్లాన చంద్రశేఖర్ ఓడించారు. ఆయనపై తాజా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో సాధారణ కార్యకర్తలా సాగుతూ, స్థానిక పదవులకు మాత్రమే ఆదర్శవంతమైన సేవలతో పార్టీలో గుర్తింపు పొందిన మాజీ జర్నలిస్టు కలిశెట్టి అప్పలనాయుడు విజయం సాధించారు.
టీడీపీ నుంచే ముగ్గురు జర్నలిస్టులు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో జర్నలిస్టులుగా పనిచేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రలో ఒక ఎంపీ విజయం సాధించారు. విజయనగరం ఎంపీగా బీసీ సామాజికవర్గానికి చెందిన గ్రామీణ జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు ఒకరు. ఆయనది టీడీపీలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే. ఆయన తండ్రి, తాత సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. 1995 వరకు అప్పలనాయుడు ప్రముఖ దినపత్రిక గ్రామీణ ప్రాంత పాత్రియుడుగా పనిచేశారు. రెండు దశాబ్డాల కిందట ఆయన టీడీపీ ద్వారా ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చి, సాధారణ కార్యకర్తలా పనిచేశారు.
రాయలసీమ లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేకే. అగ్రహారంలో బీసీ సామాజికి వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ఠ్ రాయదుర్గం నుంచి 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాలువ శ్రీనివాసులు మంత్రిగా కూడా పనిచేశారు. అంతకుముందు 1999లో అనంతపురం ఎంపీగా కూడా పనిచేశారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్ధానం నుంచి టీవీ ఛానల్లో రాయలసీమ ఇన్చార్జిగా పనిచేసిన డాక్టర్ మురళీమోహన్ కూడా విజయ సాధించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో జర్నలిజం ఊతంగా ఎదిగి, విజయనగరం నుంచి ఎంపీగా 2,38,216 ఓట్లతో విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. గ్రామీణ జర్నలిస్టుగా తాను పనిచేసిన కాలంలో ఎదుర్కొన్న కష్టాలు మరవలేదు. ఆ విషయాన్ని చేతల ద్వారా చాటిచెప్పిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
"పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ స్ధాయికి ఎదిగిన సందర్భంలో ప్రత్యేక వాహనాల ద్వారా రైతులకు విత్తనాలు డోర్ డెలివరీ చేసే పద్ధతికి శ్రీకారం చుట్టాను" కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రనాయుడు, అప్పటి కలెక్టర్ ద్వారా సమాచారం అందుకున్న అప్పటి సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డాను అని అప్పలనాయుడు గత అనుభవాలను పంచుకున్నారు. ఆ తరువాత కూడా అనేక రాజకీయ పదవులు ఊరించి, వెళ్లినా, "నేను మాత్రం కార్యకర్తగా టీడీపీ ఉత్తరాంధ్ర శిక్షణా సంస్థ ఇన్చార్జిగా పనిచేస్తూ, కార్యకర్తలను సుక్షితులను చేశాను" అని ఎంపీ అప్పలనాయుడు ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
ఈ కార్యక్రమాలను ఇలా సవ్యంగా సాగించడానికి "జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం, సమస్యలను అర్థం చేసుకున్న తీరు, సామాన్య కుటుంబం నుంచి రావడం" వంటి అంశాలు పాఠాలు నేర్చకున్నాను. అందువల్లే సాధ్యం అయ్యాయి. టీడీపీ శిక్షణా సంస్థ ఇన్చార్జిగా పనిచేసిన అనుభవంతో ఏర్పడిన పరిచయాలు నాయకులకు దగ్గర చేశాయని ఆయన అంటున్నారు. జర్నలిజంలో ప్రతి అంశాన్ని సూక్షంగా పరిశీలన చేయడం అలవాటుగా మారిన పరిస్థితుల్లో సమాజాన్ని అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని ఎంపీ అప్పలనాయుడు అంటున్నారు. అందువల్ల సమాజంలో జర్నలిస్టులకు మరింత మంచి చేసే అందివచ్చే ఏ అవకాశాన్ని వదలకుండా న్యాయం చేస్తానని ఆయన ధీమాకు భరోసా ఇస్తున్నారు.
కేంద్రం నుంచి జర్నలిస్టులకు భవిష్యత్తులో కూడా అందాల్సిన కార్యక్రమాలను కూడా వర్తింప చేయడానికి శ్రద్ధ తీసుకుంటానని ఎంపీ అప్పలనాయుడు చెబుతున్నారు. ఆయన స్పందనతో దేశంలో జర్నలిస్టులకు ఎలాంటి మేలు జరుగుతుందనేది వేచిచూద్దాం.