పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు.
ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ వాహనాన్ని మారుతి షిప్ట్ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు మృతి చెందారు. నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డుపై గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయ్యప్ప మాలలో ఉన్న యువకుల బృందం కారులో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం గుంటూరులోని విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకున్నారు. వీరంతా వినుకొండ మండలం విఠంరాజుపల్లె వద్ద అయ్యప్ప భజనకు బయల్దేరి దారిలో ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో నలుగురు విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉండగా మరొకరు గోవింద దీక్షలో ఉన్నారు. చనిపోయిన విద్యార్థుల్లో విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న శ్రీకాంత్ (వినుకొండ మండలం శివాపురం), వాసు (వినుకొండ సమీప గ్రామం), మహేష్ (పిడుగురాళ్ల), యశ్వంత్ సాయి (నూజెండ్ల మండలం ములకలూరు), విజ్ఞాన్ లారాలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రామిరెడ్డి (తాళ్లూరు, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా) ఉన్నారు. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన మద్దుకూరి కార్తిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న మరో యువకుణ్ణి గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు-ఒంగోలు జాతీయ రహదారి గణపవరం బైపాస్ రోడ్డు సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని మారుతీ షిఫ్ట్ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణీస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
రోడ్డు ప్రమాదంపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అతివేగంతో ప్రమాదాలు ఎన్నో... ఇటీవల కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తెలిసిందే.
గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.
గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్‌ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు) 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్‌లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణంగా ఉంది. పోలీసులు ఎంతగా చెబుతున్నా ఏ ఒక్కరూ పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం అవుతోంది.
అవలక్షణాలను అదుపులో ఉంచుకునేందుకు, హద్దు మీరి ప్రవర్తించకుండా ఉండేందుకు వేసుకునే ప్రవిత్ర అయ్యప్పమాలలో ఉన్నా ఆ ఐదుగురు విద్యార్థులు అతివేగాన్ని అదుపు చేయలేకపోయారు అనే మాటలు వినపడుతున్నాయి.