ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించండి

ఆదాయార్జన శాఖల్ని యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.;

Update: 2025-07-11 15:30 GMT

రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని, ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సముపార్జన అనేది ఎంత వరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవడం పైనా దృష్టి సారించాలని సూచించారు. ఆదాయ సముపార్జనలో ఉన్న లీకేజీలను గుర్తించాలని, వాటిని నివారిస్తూ.. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
వివిధ పథకాల్లో కేంద్రం నుంచి ఎలా నిధులు ఉన్నాయో గుర్తించి, ఆ మేరకు ప్రతి పైసాను రాష్ట్రానికి తెచ్చుకునేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. రాష్ట్ర సొంత ఆదాయాలు పెంచుకుంటూనే.. కేంద్ర నిధులపై దృష్టి పెడితే.. రాష్ట్ర ఖజనాకు నిధుల ఇన్‌ ఫ్లో పెరుగుతుందన్నారు. ఆ దిశగా నిరంతరం పని చేస్తూనే ఉండాలి అని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
3.52 లక్షలకు పైగా ఉపాధి హామీ పనులను మళ్లీ రీ–ఓపెన్‌ చేసేందుకు కేంద్రం అంగీకరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరగా ప్రాసెస్‌ చేయాలని ఆదేశించారు. ఓ నెల రోజుల్లోగా ఈ పనులకు సంబంధించిన రూ.180 కోట్లు వచ్చేలా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్, ఇసుక, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల లాంటి శాఖల్లో సంస్కరణలు తెచ్చామని, ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ సంస్కరణలతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రానికి కొంత మేర ఆదాయం పెరిగిందన్నారు. ప్రజలతో నిత్యం సంబంధం కలిగి ఉండే ఆదాయార్జన శాఖల పనితీరు మెరుగ్గా ఉండాలన్నారు. ఆదాయార్జన శాఖలను లీడ్‌ చేస్తున్న అధికారులు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు.
Tags:    

Similar News