జస్టిస్ బీఆర్ గవాయ్ నేపధ్యం తెలుసా ?

రెండు వరుస కేసుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రింకోర్టు చెమటలు పట్టించేస్తోంది;

Update: 2025-04-04 09:14 GMT
Supreme Court Judge BR Gavai

రెండు వరుస కేసుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రింకోర్టు చెమటలు పట్టించేస్తోంది. ఈ రెండు కేసులు కూడా రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన కేసులు అవటం గమనార్హం. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల కేసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) కేసుల విచారణలో సుప్రింకోర్టు చాలా సీరియస్ గా స్పందిస్తోంది. ఈ రెండు కేసుల్లో కామన్ పాయింట్ ఏమిటంటే జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai). రెండు కేసులను రెండు వేర్వేరు ధర్మాసనాలు విచారిస్తున్నా రెండు ధర్మాసనాల్లోనూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ముందుగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) విచారణ విషయాన్నే తీసుకుంటే ఫిరాయింపులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ వైఖరిని గవాయ్ వాయించిపడేస్తున్నారు. స్పీకర్ చర్యలను సమర్ధిస్తు లాయర్ ముకుల్ రోహిత్గీ, అభిషేక్ మను సింఘ్వీ వేర్వేరుగా వాదిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు సీనియర్ లాయర్ల వాగ్ధాటికి బీఆర్ గవాయ్ చాలాసార్లు బ్రేకులు వేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏలపై వేటువిషయంలో స్పీకర్ తనిష్టం వచ్చినంతకాలం గడువు తీసుకుంటానంటే కుదరదని జస్టిస్ స్పష్టంగా చెప్పేశారు. నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ విచక్షణకు కూడా ఎంతోకొంత సమయం ఉండాల్సిందే అని గవాయ్ స్పష్టంగా తేల్చేశారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఐదేళ్ళు గడిపేస్తామంటే కోర్టు చూస్తూ ఊరుకోదని ఇద్దరు లాయర్లను హెచ్చరించారు.

ఫిరాయింపులపై ఎలాంటి అనర్హత వేటుపడదని అసెంబ్లీలో రేవంత్(Revanth) చేసిన వ్యాఖ్యలను కూడా గవాయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తికి బయట మాట్లాడకూడదని తెలీదా ? అంటు లాయర్లను దులిపేశారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడచ్చని ముఖ్యమంత్రికి ఎవరు చెప్పారని లాయర్లను తీవ్రంగా ప్రశ్నించారు. కోర్టువిచారణలో ఉన్న అంశంపై అసెంబ్లీలో మాట్లాడటానికి రక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి అనుకోవటం చాలా తప్పని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకునే అవకాశం ఉన్నా సుప్రింకోర్టు(Supreme Court) అలా చేయకుండా ఇంకోసారి అలా మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నట్లు చెప్పి వదిలేశారు. గవాయ్ గనుక సీరియస్ గా తీసుకున ఉంటే రేవంత్ పై కోర్టుథిక్కార కేసు నమోదయ్యేది అనటంలో సందేహంలేదు.

అలాగే హెచ్సీయూ(HCU) కాంపౌండ్ లోని 400 ఎకరాల వివాదంలో కూడా గవాయ్ చాలా సీరియస్ గానే ఉన్నారు. పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకోకుండానే 400 ఎకరాల్లో చెట్లను అర్జంటుగా నరికేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ను నిలదీశారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటు మండిపడ్డారు. 100 ఎకరాల్లో చెట్లను నరికేయటానికి అవసరమైన జేసీబీ, బుల్డోజర్లను తరలించి యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్కడిపనులను అక్కడే నిలిపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించటంతో పనులన్నీ నిలిచిపోయాయి. తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చీఫ్ సెక్రటరినీ బాధ్యులను చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని ఘాటుగా హెచ్చరించారు. గవాయ్ దెబ్బకు ప్రభుత్వానికి చెమటలు పట్టేసుంటుంది అనటంలో సందేహంలేదు.

ఎందుకంటే ప్రభుత్వ భూములే కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చని బహుశా రేవంత్ అనుకునుంటారు. అలాంటిది సుప్రింకోర్టు తీరును చూసిన తర్వాత ప్రభుత్వానికి షాక్ కొట్టుంటుంది. ఎంఎల్ఏల ఫిరాయింపు కేసయినా, హెచ్సీయూ భూములవేలం అయినా రేవంత్ కు వ్యక్తిగతంగా ఎంతో ప్రిస్టేజియస్ విషయాలు. ఫిరాయింపుల విషయంలో సుప్రింకోర్టు గనుక తప్పుపడితే రేవంత్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యే అవకాశాలును కొట్టేసేందుకు లేదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లోకి లాగేసి కేసీఆర్ దెబ్బకొట్టాలన్న రేవంత్ ఆలోచన ఆగిపోతుంది. కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్నది రేవంత్ టార్గెట్. రేవంత్ టార్గెట్ రీచవ్వటం అన్నది ఇపుడు సుప్రింకోర్టు తీర్పుమీద ఆధారపడుంది. పై రెండు కేసుల్లో సుప్రింకోర్టు జస్టిస్ గవాయ్ ఇంత సీరియస్ గా స్పందిస్తారని బహుశా రేవంత్ ఊహించుండరు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కేసులు విచారణలో ఉన్నా గవాయ్ స్పందించినంత సీరియస్ గా మరే జడ్జి కూడా స్పందించలేదు.

బీఆర్ గవాయ్ నేపధ్యం ఏమిటి ?

ప్రభుత్వానికి చెమటలుపట్టిస్తున్న భూషణ్ రామకృష్ణ గవాయ్(64) నేపధ్యాన్ని పరిశీలిస్తే జస్టిస్ 1960, నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టారు. తల్లి కమలా గవాయ్, తండ్రి ఆర్ఎస్ గవాయ్. తండ్రి ఆర్ ఎస్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(గవాయ్) వ్యవస్ధాపక అధ్యక్షుడు. తండ్రి లోక్ సభ, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. బీహార్, సిక్కిం, కేరళకు గవర్నర్ గా కూడా ఉన్నారు. 30 ఏళ్ళపాటు మహారాష్ట్ర శాసనమండలిలో సభ్యుడిగా పనిచేశారు. అంటే బీఆర్ గవాయ్ తండ్రిది రాజకీయంగా ఎంతటి గట్టి బ్యాక్ గ్రౌండో అర్ధమవుతోంది. బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా ఎందుకనో బీఆర్ గవాయ్ రాజకీయాల్లోకి కాకుండా న్యాయరంగంలోకి ప్రవేశించారు. 2019లో సుప్రింకోర్టు జడ్జిగా రాకముందు ముంబాయ్ హైకోర్టు జడ్జీగా చాలాసంవత్సరాలు పనిచేశారు. నాగ్ పూర్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీకి ఛాన్సులర్ గా వ్యవహరిస్తున్నారు.

అంతేకాకుండా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పనిచేస్తున్నారు. కాలం కలిసొచ్చి సీనియాటీని ప్రాతిపదకగా తీసుకుంటే బీఆర్ గవాయ్ సుప్రింకోర్టుకు 52వ చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశముంది. 1960లో పుట్టిన గవాయ్ 1985లో బొంబాయ్ కోర్టులో లాయర్ గా చేరారు. రాజా ఎస్ భోంసలే లా సంస్ధలో చేరి కొంతకాలం లాయర్ గా పనిచేశారు. తర్వాత 1987-90 మధ్య లాయర్ గా స్వతంత్రంగానే కేసులను వాదించారు. నాగ్ పూర్ లోని అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి యూనివర్సిటికి స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. 1992-93 మధ్య బాంబే హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా తర్వాత అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. 2000 సంవత్సరంలో నాగ్ పూర్ బెంచ్ కే గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. 2003, నవంబర్ 14వ తేదీన అడిషినల్ జడ్జిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు జడ్జీగా చాలాకాలం పనిచేసిన గవాయ్ 2019లో సుప్రింకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

Tags:    

Similar News