కేసీఆర్ జీతం ఎంత తీసుకున్నారో తెలుసా ?
రు. 57,84,124 రూపాయలను జీతంరూపంలో తీసుకుంటున్న కేసీఆర్(KCR Salary) అసెంబ్లీ(Telangana Assembly)కి వచ్చింది మాత్రం రెండురోజులే అని రేవంత్ ఎద్దేవాచేశారు;
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ గడచిన 15 మాసాల్లో తీసుకున్న జీతమెంతో తెలుసా ? అక్షరాల రు. 57.84 లక్షలు. అవును, నెలకు కేసీఆర్ జీతం రు. 3.8 లక్షలు. ఇన్ని లక్షలరూపాయల ప్రజాధనాన్ని జీతంరూపంలో తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి హజరయ్యింది మాత్రం రెండంటే రెండే రోజులు. ఈ విషయాన్ని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించారు. రు. 57,84,124 రూపాయలను జీతంరూపంలో తీసుకుంటున్న కేసీఆర్(KCR Salary) అసెంబ్లీ(Telangana Assembly)కి వచ్చింది మాత్రం రెండురోజులే అని రేవంత్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీకి వచ్చి తన విలువైన సూచనలు, సలహాలను ఇవ్వాలని తాము ఎంత కోరుతున్నా కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి ఎందుకు రావటంలేదో అర్ధంకావటంలేదన్నారు.
కేసీఆర్ జీతంగురించి రేవంత్ సభలో ప్రకటించిన తర్వాత అసలు ఎంఎల్ఏల జీతం ఎంత అన్న విషయమై అనుమానం వచ్చింది. గూగుల్(Google) లో సెర్చ్ చేస్తే తెలంగాణ ఎంఎల్ఏ జీతం రు. 2.5 లక్షలుగా కనిపించింది. ముఖ్యమంత్రి జీతం రు. 4 లక్షలుగాను, మంత్రులకు నెలకు రు. 3 లక్షల జీతం అని కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కు మంత్రిర్యాంకు ఉంటుంది. ఈ లెక్కన వేసుకున్నా కేసీఆర్ నెలకు తీసుకుంటున్న మంత్రి జీతం రు. 3 లక్షలు మాత్రమే. నెలకు 3 లక్షల రూపాయల జీతం తీసుకున్నా 15 మాసాల్లో కేసీఆర్ తీసుకున్న జీతం రు. 45 లక్షలు మాత్రమే. ఏ విధంగా చూసినా కేసీఆర్ జీతం రు. 45 లక్షలు అవుతోందే కాని రు. 57.84 లక్షలు కావటంలేదు. రేవంత్ చెప్పినట్లుగా కేసీఆర్ జీతం 57.84 లక్షల రూపాయలు అవ్వాలంటే నెలకు తీసుకోవాల్సిన జీతం సుమారుగా రు. 3.80 లక్షలుండాలి. మాజీ ముఖ్యమంత్రి హోదా+ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ నెలకు ఎంత జీతం తీసుకుంటున్నారన్న విషయంపై రేవంత్ క్లారిటి ఇచ్చుంటే బాగుండేది. అందుకనే ఏలెక్కన కేసీఆర్ 57.84 లక్షల రూపాయల జీతం తీసుకున్నారని రేవంత్ చెప్పాడో అర్ధంకావటంలేదు.
రేవంత్ చెప్పిన కేసీఆర్ జీతం విషయంలో క్లారిటి లేకపోవచ్చు కాని అసెంబ్లీకి రాకుండానే కేసీఆర్ ఏ విధంగా జీతం తీసుకుంటున్నారన్నదే ఇక్కడ పాయింట్. అసెంబ్లీకి రాకపోయినా కేసీఆర్ జీతం తీసుకోకూడదని ఏమీలేదు. కాకపోతే అసలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే జీత, బత్యాలు తీసుకోవటం అన్నది నైతికతకు సంబందించిన విషయం. 2023 డిసెంబర్ 4 వ తేదీన వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నాలుగురోజులకే జరిగిన ప్రమాదంలో కేసీఆర్ కాలితుంటి ఎముక విరిగింది. కాలికి ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ల సలహా ప్రకారం రెండునెలలు పూర్తి రెస్ట్ తీసుకున్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగైన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ ఆఫీసుకు వచ్చి ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ తర్వాత నుండి హాజరుకాలేదు. ఇంతకాలానికి తాజా బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజు హాజరైన కేసీఆర్ మళ్ళీ ఇంతవరకు సభలో కనబడలేదు. అందుకనే కేసీఆర్ జీత, బత్యాల గురించి రేవంత్ అసెంబ్లీలో ప్రకటించింది.