'కుంకీ'లతో మదపుటేనుగులు దారికొస్తాయా?

పంటల రక్షణకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు డిప్యూటీ సీఎం కల్యాణ్ స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక విధానసౌధ వద్ద వీడ్కోలు సభలో అవి గౌరవ వందనం చేయడం ఆకట్టుకుంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-21 11:28 GMT
కుంకీ ఏనుగులతో ప్రదర్శన. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు జ్ణాపిక అందిస్తున్న కర్నాటక సీఎం సిద్ధరామయ్య (ఇన్ సెట్

ఏనుగుల దాడుల నుంచి పంటలను కాపాడేందుకు అటవీశాఖ మరో అడుగు వేసింది. మదపుటేనుగులను అడవిలోకి దారి మళ్లించడానికి అవసరమైన ఆరు కుంకి ఏనుగులను రంగంలోకి దించనున్నారు.

కర్ణాటక విధాన సౌధలో బుధవారం ఆ ఏనుగులను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రయత్నానికి సానుకూలంగా స్పందించిన ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే బుధవారం ఉదయం ఆరు సుక్షిత కుంకి ఏనుగులను స్వాధీనం చేశారు.

2024 సెప్టెంబర్ 27వ తేదీ చిత్తూరు జిల్లాలో పంటలపై అటవీ ఏనుగుల దాడుల నుంచి కాపాడాలని కుంకి ఏనుగుల కోసం స్వయంగా వెళ్లి, కర్ణాటక ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారు. ఆ ప్రయత్నాలు ఫలించడంతో..
కర్ణాటక విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో రంజని, దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లతో ఉన్న ఆ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అధికారులు లాంఛనంగా స్వాధీనం చేసుకున్నారు.
"దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్ లో వినియోగించే ఏనుగులను ఇవ్వం" అని గతంలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
గౌరవ వందనం

ఏనుగులను స్వాధీనం చేసే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే. శివకుమార్ తోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఏపీకి తరలడానికి ముందు కుంకీ ఏనుగులు తొండం పైకి లేపి ఘీంకారిస్తూ, గౌరవ వందనం చేశాయి. ఆ సమయంలో వేదికపై ఉన్న మంత్రులు అధికారులు, ఆరు ఏనుగులపై పూలు చల్లుతూ ప్రతి నమస్కారం చేశారు.
జిల్లాలో ఇదీ సమస్య
శేషాచలం అటవీప్రాంతం 4,755 చదరపు కిలోమీటర్లలో అన్నమయ్య, కడప, చిత్తూరుకు సరిహద్దులోని నెల్లూరు జిల్లాల వరకు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు పడమటి ప్రాంతంలో తమిళనాడులోని కరియమంగళం, కర్ణాటకలోని కౌండిన్య అటవీప్రాంతం అనుసంధానంగా ఉంది. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు నుంచి ఇటు చంద్రగిరి నియోజకవర్గం వరకు, కడప జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు తాలూకాల్లోని అటవీ సమీప గ్రామాల్లో మామిడి, చెరకు, వేరుశెనగ, టమాటతో పాటు మిగతా ఉద్యానవన పంటలకు ఏనుగుల దాడుల్లో తీవ్రంగా నష్టం జరుగుతోంది. శేషాచలం అటవీప్రాంతంలో సుమారు 15 ఏనుగుల మంద సంచరిస్తున్నట్లు అటవీశాఖ యంత్రాంగం గుర్తించింది. వాటిని బెదరగొట్టే యత్నాల్లో ఇప్పటి వరకు దాదాపు 50 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో కౌలు రైతు, అంతకుముందు సీఎం ఎన్. చంద్రబాబు కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో మరణించిన ఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి.
కుంకీ ఏనుగుల విడిది
2006లో పంటలపై అడవి ఏనుగుల దాడుల నివారణకు కుంకీ ఏనుగులను తెరపైకి తీసుకుని వచ్చారు. 17 ఏళ్లుగా కుప్పం సమీపంలోని ననియాల వద్ద ఉన్న జయంత్, వినాయక్ అనే ఏనుగులు 60 ఏళ్ల వయసు రావడం వల్ల సేవలు అందించడం కష్టంగా మారింది. దీంతో..
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల నుంచి పంటలను కాపాడడం కోసం టిడిపి కోటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతికి స్పందించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆరు సుక్షిత కుంకీ ఏనుగులను అందించింది. వాటిలో రెండు ఏనుగులను తిరుపతి జూ పార్క్ లో ఉంచనున్నారు.
"నాలుగు ఏనుగులను పలమనేరు సమీపంలోని ముసళ్ళమడుగు ఏనుగుల క్యాంపులో ఉంచుతాం" అని ఓ అటవీశాఖ అధికారి చెప్పారు.
"ముసళ్ళమడుగు సమీపంలో 50 ఎకరాల్లో ఏనుగుల క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం అక్కడే అన్ని సదుపాయాలు కల్పిస్తాం" అని కూడా ఆ అధికారి చెప్పారు.
ఈ క్యాంపు వద్ద ప్రస్తుతం 20 ఎకరాలు మాత్రమే ఏనుగుల సంరక్షణ కోసం వినియోగంలోకి తీసుకున్నారు.
కర్ణాటక నుంచి తీసుకువచ్చే ఏనుగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్యాంపులో ఏనుగులకు రోజు స్నానం చేయించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. శిశాల విస్తీర్ణంలో తిరుగుతూ నీటిలో తిరగడానికి అవసరమైన వాటర్ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు.
సంరక్షణ: ముసలమడుగు ఏనుగుల క్యాంపులో ఈ ఏనుగుల సంరక్షణ కోసం మావటీలకు అవసరమైన క్వార్టర్స్, అందులో రోడ్లు, సోలార్ విద్యుత్, సహజ నీటి కుంటలను కూడా సిద్ధం చేశారు.
ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇద్దరు డాక్టర్లు, ప్రత్యేకంగా పశువుల ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు.
కర్ణాటక నుంచి తీసుకువచ్చే ఈ ఆరు ఏనుగులకు మావటీలుగా తమిళనాడు, కేరళ నుంచి కూడా ఇద్దరిని నియమించనున్నారు. వీరికి ఈ ఏనుగులు అలవాటయ్యే వరకు ఇప్పటివరకు వాటికి శిక్షణ ఇచ్చిన ఇద్దరు కర్ణాటక మావటీలు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండబోతున్నారు.
వయసు మీద పడి..
దాదాపు రెండు దశాబ్దాలుగా రెండు కుంకీ ఏనుగులు సేవలు అందిస్తున్నాయి. జయంత్, వినాయక్ అనే పేరుతో ఉన్న ఈ ఏనుగులు రామకుప్పం సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో నంద్యాల అటవీ క్యాంప్ రక్షణలో ఉన్నాయి.
"17 సంవత్సరాలు పైగానే సేవలందిస్తున్న ఈ ఏనుగుల వయసు 60 ఏళ్లకు పైబడింది. కదిలించడం ఇబ్బందిగా ఉంది. అడవుల నుంచి వచ్చే ఏనుగులను కూడా మళ్లించడానికి కష్టమవుతుంది" అని ఓ అధికారి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో.. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులు పంటలపై దాడులు చేస్తున్నాయి. వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించిన గ్రామస్తులను కూడా తొక్కి చంపాయి. ఈ విధంగా సంవత్సరానికి కనీసంగా 5 వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. కనీసం ఇద్దరూ ఏనుగుల దాడుల్లో మరణి న్నారు.
దీనిపై టిడిపి కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అడవుల నుంచి వచ్చే ఏనుగుల వల్ల పంటలకు, గ్రామస్తుల వల్ల ఏనుగుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసం ఎవరికీ హానికరం లేకుండా సుక్షిత కుంకి ఏనుగులను రంగంలోకి దించబోతున్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న 6 ఏనుగులు తిరుపతి జూ పార్క్, పలమనేరు సమీపంలోని ముసళ్ళమడుగు కేంద్రానికి చేరబోతున్నాయి. ఇక పంటలకు, రైతులకు కూడా భయం, ఆందోళన తీరుతుందని అటవీశాఖ అధికారులు ధైర్యంచెబుతున్నారు.

Similar News