రేవంత్ గుణపాఠం నేర్చుకున్నాడా ?
అన్నిగంటలసేపు ఎంఎల్ఏలతో రేవంత్ భేటీ అవటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.;
ముఖ్యమంత్రయిన 15 మాసాలకు రేవంత్ మంచిపనిచేశాడు. ఇంతకీ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన మంచిపని ఏమిటి అనుకుంటున్నారా ? పార్టీ ఎంఎల్ఏలను కలవటమే. మంత్రులు, పార్టీ ఎంఎల్ఏలను కలవకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో రేవంత్(Revanth) గుర్తించినట్లున్నాడు. బహుశా తన సీనియర్లు అంటే పార్టీలో సీనియర్లు కాదు తనకన్నా ముందు సీఎంలు అయిన చంద్రబాబునాయుడు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకున్నట్లే ఉన్నాడు. అందుకనే ఇకనుండి వారంలో నాలుగురోజులు ఎంఎల్ఏలతో భేటీ అవుతానని గతంలో చెప్పినట్లే చేశాడు. శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడుగురు ఎంఎల్ఏలతో రేవంత్ దాదాపు నాలుగు గంటలు భేటీ అయ్యాడు. అన్నిగంటలసేపు ఎంఎల్ఏలతో రేవంత్ భేటీ అవటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
సీఎంలతో మంత్రులు, ఎంఎల్ఏలకు మధ్య గ్యాప్ వచ్చేది కమ్యూనికేషన్ లేకపోవటం వల్లే. ఎంఎల్ఏలేమో ముఖ్యమంత్రిని కలిసి తమసమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని అనుకుంటారు. సీఎంలేమో ఎంఎల్ఏలకు సమయం ఇవ్వరు. దాంతో కొంతకాలం తర్వాత ఎంఎల్ఏల్లో ముఖ్యమంత్రి మీద అసంతృప్తి మొదలై చివరకు వ్యతిరేకతగా ముగుస్తుంది. ఈవ్యతిరేకత అన్నది పైన చెప్పిన ముగ్గురు నేతల్లో స్పష్టంగా నిరూపణైంది. అందుకనే పార్టీలో మొదలైన అసంతృప్తిని మొగ్గలోనే తుంచేయాలని రేవంత్ నిర్ణయించుకోవటం చాలామంచి ఆలోచన. అందుకనే ముందుగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎంఎల్ఏలతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను, సంక్షేమపథకాల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితరాలగురించి సుదీర్ఘంగా మాట్లాడారు. పార్లమెంటు పరిధిలోని మహబూబ్ నగర్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసరెడ్డి, నారాయణపేట ఎంఎల్ఏ చిట్టెం పర్నిక, జడ్చర్ల ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి, దేవరకధ్ర ఎంఎల్ఏ మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎంఎల్ఏ శ్రీహరి, షాద్ నగర్ ఎంఎల్ఏ శంకరయ్య ముఖ్యమంత్రితో భేటీ అయి చాలావిషయాలు మాట్లాడుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రోజువారి శాఖల సమీక్షలు, ఉన్నతాధికారులతో రివ్యూలు, అధికారిక కార్యక్రమాలు తదితరాలతో ప్రతిరోజు చాలా బిజీగా ఉంటారన్న విషయంలో సందేహంలేదు.
అయితే పైన చెప్పిన కార్యక్రమాలతో రేవంత్ ఎంత బిజీగా ఉన్నా పార్టీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో భేటీలు కూడా అంతే ముఖ్యంకదా. పార్టీ ఎంఎల్ఏల మద్దతులేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ కు ఇబ్బందులు తప్పవని అందరికీ తెలిసిందే.
పైన చెప్పినట్లు కేసీఆర్(KCR) అయితే ముఖ్యమంత్రిగానే కాదు ఇపుడు ప్రతిపక్ష నేతగా కూడా ఎవరికీ అందుబాటులో ఉండటంలేదు. కేసీఆర్ స్టైలే అంతని అందరు సరిపెట్టుకోవాల్సిందే తప్ప తాను మాత్రం మారరు. అధికారంలో ఉన్నపుడు తాను 18 గంటలు పనిచేస్తున్నాని, చాలా బిజీగా ఉంటానని స్వయంగా చంద్రబాబే(Chandrababu Naidu) చెప్పుకుంటారు. మంత్రులు, ఎంఎల్ఏలు కలవాలని ఎంత ప్రయత్నించినా దొరకరు. ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి రాగానే తాను మారానని, ఇకనుండి అందరికీ అందుబాటులోకి వస్తానని పదేపదే చెప్పుకుంటారు. అధికారంలోకి రాగానే మళ్ళీ మామూలే. ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది(YS Jaganmohan Reddy) కూడా అదేపద్దతి. 2019-24 మధ్య సీఎంగా ఉన్న జగన్ మీద ప్రధాన ఆరోపణ ఏమిటంటే మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను కలవలేదని. తాము ఎంతప్రయత్నించినా జగన్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది అభ్యర్ధులు మీడియాతోనే చెప్పారు.
వైఎస్ రూటే సపరేటు
పైన చెప్పిన అందరిలోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YS Rajasekhar Reddy) రూటు సపరేటనే చెప్పాలి. వైఎస్సార్ తో పాటు పైన చెప్పిన అందరికీ ఉన్నది రోజుకు 24 గంటలే. అయితే వైఎస్సార్ రోజువారి సమీక్షల్లో పాల్గొంటు, ఉన్నతాధికారులను రివ్యు చేస్తు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటు, మామూలు జనాలను కలుస్తునే పార్టీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యేవారు. వైఎస్సార్ ఇన్నిపనులు చేయగలిగినపుడు పైన చెప్పినవారు ఎందుకు చేయలేకపోయారు ? ఎందుకంటే వైఎస్సార్ లో ఉన్న హ్యూమన్ టచ్ మిగిలిన వాళ్ళల్లో లోపించటమే ప్రధాన కారణం. టై మ్యానేజ్మెంట్ వైఎస్ కు తెలిసినట్లుగా మిగిలిన వాళ్ళకు తెలీదు. అందుకనే 24 గంటలను బ్యాలెన్స్ చేసుకోవటంలో వైఎస్ మినహా మిగిలిన వాళ్ళు ఫెయలయ్యారనే చెప్పాలి. కారణం ఏదైనాకాని 15 మాసాల తర్వాత రేవంత్ మంచిపనికి శ్రీకారంచుట్టాడు. ఇదేపద్దతిలో రేవంత్ భేటీలు జరుపుతుంటే పార్టీ ఎంఎల్ఏల్లో అసంతృప్తి అన్నదే ఉండదు. పార్టీ ఎంఎల్ఏలు అనేకాదు ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఏలతో కూడా భేటీ అయి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తే అందరు సంతోషిస్తారు.