హెచ్సీయూ రూపంలో రేవంత్ కు తలనొప్పి మొదలైందా ?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల వివాదం పెద్దదయిపోతోంది;
రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల వివాదం పెద్దదయిపోతోంది. 400 ఎకరాలు తమదే అని ప్రభుత్వం వాదిస్తుంటే కాదు కాదు ఆ భూమి మొత్తం యూనివర్సిటీదే అని హెచ్సీయూ రిజిస్ట్రార్ జారీచేసిన నోట్ వివాదానికి కీలకమైంది. తమ భూములను తాము వేలంద్వారా అమ్మబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదేసమయంలో యూనివర్సిటి భూములను ప్రభుత్వం ఎలాగ అమ్ముతుందని యూనివర్సిటి మేనేజ్మెంట్ తో పాటు విద్యార్ధులు నానా గోలచేస్తున్నారు. యూనివర్సిటి పరిధిలోని 400 ఎకరాల్లోని చెట్లు ఆక్సిజన్ హబ్ గా ఉన్నాయని, ఈ భూమి మొత్తం చిన్న చిట్టడవిలాగుంటుందని యూనివర్సిటి యాజమాన్యంతో పాటు విద్యార్దులు చెబుతున్నారు. 400 ఎకరాల్లో వేలాది చెట్లేకాకుండా లేళ్ళు, దుప్పులు, నెమళ్ళు, అడవిపందులు, చిన్నపాటి చెరువులు దెబ్బతినేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వీళ్ళకు ప్రతిపక్షాలు మద్దతుగా రంగంలోకి దిగాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్(Revanth) ఏప్రాజెక్టు టేకప్ చేసినా ప్రతిపక్షాలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. మూసీనది సుందరీకరణ(Musi River Beautification) ప్రాజెక్టు టేకప్ చేయాలని అనుకున్నపుడు కూడా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు వ్యతిరేకించాయి. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించాలని అనుకున్నపు కూడా ఇదే పద్దతిలో గొడవచేశాయి. నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని అనుకున్నపుడూ బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల నిర్వహణను కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రకటించినా, ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించటమే బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రేవంత్ మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలో పేరుకుపోయిన కసి అనే చెప్పాలి.
బీఆర్ఎస్ అగ్రనేతల వైఖరి ఎలాగుందంటే కాంగ్రెస్ అధికారంలోకి రావటంకన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటమే ఎక్కువగా మంటగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ మంటనే బీఆర్ఎస్ లోని కీలకనేతలు ప్రతిరోజు రకరకాల రూపాల్లో బయటపెడుతున్నారు. ఇపుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ)(HCU)లో 400 ఎకరాల వివాదాన్ని వీలైనంతగా పెంచాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేయటంలోనే తెలిసిపోతోంది. యూనివర్సిటి భూములను ప్రభుత్వం తీసుకోవటం అన్యాయమంటు కేటీఆర్(KTR), హరీష్, కవిత నానా గోలచేస్తున్నారు. విద్యార్ధుల ఆందోళనకు సంపూర్ణమద్దతు ప్రకటించారు. హెచ్సీయూ భూములను రేవంత్ ప్రభుత్వం తీసుకోకూడదని అంటున్న వీళ్ళు మరి బీఆర్ఎస్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటి భూములను తీసుకోవాలన్న కేసీఆర్(KCR) నిర్ణయాన్ని ఎలాగ సమర్ధించారు ? పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు ఓయూలోని 11 ఎకరాలను తీసుకోబోతున్నట్లు కేసీఆర్ 2015లో ప్రకటించారు. అప్పట్లో కేసీఆర్ నిర్ణయాన్ని కేటీఆర్, హరీష్, కవిత ఎందుకు వ్యతిరేకించలేదు ?
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే 400 ఎకరాల్లో జంతు, వృక్షజాలం ఉన్నాయి. 400 ఎకరాల్లో వేలాదిచెట్లున్నది వాస్తవం. ఈ చెట్లనుండి గచ్చిబౌలి(Gacchibowli) ప్రాంతంలోని జనాలకు ప్రతిరోజు వేలటన్నుల ఆక్సిజన్(Oxygen) విడుదలవుతోంది. అలాగే వివాదాస్పద స్ధలంలో రెండుమూడు చిన్న చెరువులు కూడా ఉన్నాయి. చెరువులు, చెట్ల ఆధారంగానే లేళ్ళు, దుప్పులు, అడవిపందులు, ఎలుగుబంట్ల లాంటి జంతువులు, వేలాది పక్షలు బతుకుతున్నాయి. ఇపుడీ 400 ఎకరాలను ప్రభుత్వం వేలంవేస్తే చెరువులు, జంతువులు, పక్షాలు ఏమవుతాయన్నది కీలకమైన ప్రశ్న. వేలంలో భూములను రక్షించుకునే కార్పొరేట్ సంస్ధలు చెరువులను పూడిపించేసి, చెట్లను కొట్టేస్తాయనటంలో సందేహంలేదు.
కాబట్టి చెట్లు కొట్టకుండా, చెరువులు పూడ్చేయకుండా, జంతువులు, పక్షాలు, నెమళ్ళు, పాముల్లాంటి వాటి సంరక్షణకు ప్రభుత్వం ఏమి జాగ్రత్తలు తీసుకుంటుందన్నది కీలకమైన పాయింట్. ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనే విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేయాల్సిన అవసరమైతే ఉంది. ఇపుడు ఆందోళనలను అణిచివేయటానికి ప్రకటన చేసినట్లు కాకుండా ప్రభుత్వ ప్రకటనలో చిత్తశుద్ది కనబడాలి.
ఇక రాజకీయ వివాదాలగురించి ఆలోచిస్తే ఓయూ భూములను కేసీఆర్ తీసుకోవచ్చు కాని సుప్రింకోర్టు తీర్పుద్వారా ప్రభుత్వానికి తిరిగొచ్చిన హెచ్సీయూలోని 400 ఎకరాలను మాత్రం రేవంత్ వేలంద్వారా అమ్మకూడదు. బీఆర్ఎస్ కీలకనేతల వైఖరి ఎలాగుందంటే తాము ఏమిచేసినా ఒప్పే..రేవంత్ ప్రభుత్వం ఏమిచేసినా తప్పు అన్నట్లుగా ఉంది. తాము అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాల్లాంటివే ఇపుడు రేవంత్ తీసుకోవటాన్ని కేటీఆర్, హరీష్, కవిత సహించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలోనే రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ప్రతిరోజు బురదచల్లేస్తున్నారు. ఇందులో భాగమే హెచ్సీయూ వ్యవహారంలో కూడా అనుసరిస్తున్నారు. కొత్త తలనొప్పినుండి రేవంత్ ఎలాగ బయటపడతారో చూడాలి.